సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, మే 2012, శనివారం

సౌఖ్యములు లేవు - దు:ఖముల జల్లె గాని .....

తనదు పరమాత్మ తత్త్వంబు తనర - ప్రేమ ,

సత్యము , సహనమ్ము , యెరుక , సాత్వికతలు

పుట్టుకకు తోడిచ్చి బంపె నీ పుడమి దనుక -

ఆ పరాత్పరు డెంత దయా మయుండు !పుడమి పై బడు టాదిగా బుధ్ధి వొడమె

శత్రు లార్గురి స్నేహ పాశముల బడగ ,

కరిగె పరమాత్మ తత్త్వంబు , సురిగి పోయె

మనిషి దిగజారి , మనుగడ మారి పోయె !సౌఖ్యములు లేవు - దు:ఖముల జల్లె గాని ,

దైవ తత్త్వంబు వీడిన తనబ్రతుకున -

మనిషి మనిషిని ద్వేషించ జనుట మొదలు

అన్ని యవ లక్షణాలున్ను ఆవహించె"కోరికల మీద నత్యాశ కూడి మనుటె

దు:ఖ కారణంబ" ని చెప్పి , తొలగు విథము

మనకు నేర్పిరి , యైనను మాను టెట్లు ?

మనుజ తత్త్వంబు గొప్పగా మారు టెట్లు ?తానె విఙ్ఞాన ఖని యంచు తనకు తానె

గొప్పలకు బోవు మనిషి కీ తిప్ప లేల ?

తిన్న దరుగక యెగిరి గంతేయ నేల ?

తడువ తడువకు చతికిల బడగ నేల ?మనిషి మనుగడ వందేళ్ళ మాత్ర నిడివి

జరయు బాల్యంబు బోవ నికరము దేల్చ

అల్ప మాయుష్షు , దీనికే , నంత యహమ ?

మృతులు జీవించు నవని లో బ్రతుకు మనదిపుట్టి నది యాదిగా చని పోవు వరకు

తెలిసియే సమస్యల కొని తెచ్చు కొనును

సతము వాటి పరిష్కార గతుల యందె

బ్రతుకు పండించుకొని చావు పాల బడును
3 వ్యాఖ్యలు:

 1. మానవుడి పతనానికి కారణమయ్యే వాటిని అందమైన పద్యాల రూపంలో అలరింప జేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మాస్టారు గారు, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు.మంచి పద్యంతో మళ్ళీ మమ్మల్ని అలరించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఒద్దుల రవి శేఖర ! నా
  పద్దియముల తీరు నచ్చి వ్యఖ్యానింపన్
  తద్దయు సరూప భావన
  లిద్దరి యందుండ నయ్యె నెంతయు నొకటై .

  జలతారు వెన్నెలా ! మి
  మ్మలరించుట జూడ ,పోష్టునందలి భావ
  మ్ముల తో మీ యాలోచన
  కలగలియుట ముదము గూర్చె కవితా ! నాకున్

  బ్లాగు సుజన-సృజన

  ప్రత్యుత్తరంతొలగించు