సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, మే 2012, గురువారం

ఏది సత్యం ? ఏదసత్యం ? (పాఠశాల కథలు)

ప్రియమైన విద్యార్థులారా !

సైన్సులో మీకు సూర్యుడు – శక్తి పాఠం ఉంది కదా ! మీ సైన్సు టీచరు సూర్య గోళాన్ని గురించి ఏమి చెబుతాడు ? వాయువుల తో మండే గోళమని కదా ! మరి తెలుగు పాఠాన్ని బోధిస్తూ మీ తెలుగు టీచర్ ఏమి చెబుతాడు? సూర్యనారాయణుడనీ , దేవుడనీ కదా !

అంటే మీ పాఠశాలలో ఒకే అంశానికి రెండు విరుధ్ధ భావనలు బోధించి మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తున్నారన్నమాట ! ఇందులో ఏది నిజమో పరిశీలించండి . శాస్త్రీయంగా నిరూపింప బడేదే సత్యం . శాస్త్రీయంగా నిరూపించ లేనిది అసత్యమే కదా మరి ! పాఠశాలలో అసత్యాలు బోధించడం సముచితమేనా ?

సూర్యుడు కేవలం వాయువులతో నిండి నిరంతరం మండే వాయుగోళం . ఇది శాస్త్రీయంగా నిరూపించ బడింది. ఇది సత్యం . సూర్యున్ని భగవంతుడుగా చిత్రీకరించే కథలన్నీ అసత్యాలు .....

--- ఇలా అనర్గళంగా సాగిపోతూ ఉంది ఆనాటి పాఠశాల సమావేశంలో ఒక మేథావి ఉపన్యాసం .ఆ మేథావి ఆనాటి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసిన విశిష్ట ఉపన్యాసకులు . మీదు మిక్కిలి హేతువాది . సదరు ఉపన్యాసకులు మంచి స్ఫురద్రూపి . మంచి వాగ్ధాటితో ,చతురోక్తులతో విద్యార్థులను ఆకట్టుకొని మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు .

ఇంతలో ఆపాఠశాల తెలుగు టీచర్ వేదిక మీదకు వచ్చి , తనకూ సదరు అంశం మీద మాటాడ్డానికి అవకాశం ఇవ్వవలసినదిగా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న హెడ్మాష్టరు గారిని కోరినాడు .

ప్రధానోపాధ్యాయుని సంశయాన్ని గమనించిన హేతువాది తన ఉపన్యాసాన్ని అర్థాంతరంగా ఆపి , తెలుగు టీచర్ను మాటాడ వలసినదిగా కోరినాడు . సమావేశ వేదిక కాస్తా చర్చావేదికగా మారింది .

వేదిక మీదకు వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల లో కొంత మందిని లేపి వారి తల్లి దండ్రుల పేర్లు చెప్పవలసినదిగా కోరినాడు . వారు చెప్పినారు. మీరు మీ తల్లిదండ్రులను ఏమని పిలుస్తారు? “ టీచరు ప్రశ్న

అమ్మా – అనీ , నానా – అనీ పిల్లల సమాధానం

పేర్లతో పిలవరా ? టీచరు

తప్పుకదండీ ! “ పిల్లలు

ప్రియమైన విద్యార్థులారా! తల్లిదండ్రుల మీదా , గురువుల మీదా , పెద్దల మీదా మనకుండే గౌరవం వల్ల మనం వాళ్లను పేర్లతో సంబోధించడం తప్పుగా భావిస్తున్నాము .

సూర్యుడు మండే గోళం మాత్రమే కాదు . సూర్యుడు భూమిమీది సర్వజీవ రాశికీ శక్తి ప్రదాత . సూర్యగోళం నుండి వెలువడే అనంతమైన శక్తి వల్లనే ఈ భూమిమీది సర్వ జీవ రాశీ మనుగడ సాగిస్తోంది . సూర్యకిరణాలు భూమికి చేరని నాడు భూమిపై జీవరాశి నశిస్తుంది . ఇది కూడా శాస్త్రీయ మైన అంశమే .

మన మనుగడ కు నిరంతరం శక్తిని ప్రసాదించే సూర్యుణ్ణి గౌరవించి , దైవంగా భావించి , ఆరాధించడం ఎంత మాత్రమూ తప్పు కాదు . మానవ జాతి మనుగడకు దోహద కారులైన ఏ అంశాలనైనా గౌరవించి దైవంగా భావించి, ఆరాధించడం అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతీ –సంప్రదాయాల లో ఉన్న గొప్పదనం .భారతీయ సంస్కృతి మానవజాతి ఉన్నతికి ప్రతీక .

ఇలాగే నేల . నేలంటే మన్నేకదా ! నేలే మనకు ఆధారం . ఇందులోనే మనం ఆహారాన్ని పండించు కొంటున్నాం . అందరికీ అన్నం పెట్టే నేలను తల్లీ అనడం తప్పా? అనక పోవడం తప్పా ?

నీరు , గాలి . ప్రకృతి – ఇలా మన మనుగడకు ప్రత్యక్షంగా గానీ , పరోక్షంగా గానీ దోహదకారులయ్యే ప్రతి అంశాన్నీ విథిగా గౌరవించాలి .

అందుకే సూర్యణ్ణి సూర్యభగవానుడనీ , నేలను నేలతల్లిగా , ప్రకృతిని ప్రకృతి మాతగా మనం గౌరవించడం –ఆరాధించడం నేర్చుకున్నాము . గౌరవించక పోవడం తప్పు . ఆరాధించక పోవడం నేరం . అనాదిగా మనకు సంక్రమించిన ఈ సంప్రదాయాన్ని వదులుకోవద్దు . అని ముగించినాడు . కరతాళ ధ్వనులతో సమావేశ మందిరం మారు మ్రోగింది . పాపం హేతువాది ఎటు వెళ్ళేడో మరి !


6 వ్యాఖ్యలు:

 1. చాలా బాగా చెప్పరు తెలుగు ఉపాధ్యాయుడు.ఇలా మన మనుగడకు ప్రత్యక్షంగా గానీ , పరోక్షంగా గానీ దోహదకారులయ్యే ప్రతి అంశాన్నీ విథిగా గౌరవించాలి-Ok.
  మరి పురాణాలలో అదే సూర్య భగవానుడి కి కుంతీ దేవి కి కర్ణుడు పుట్టాడని అంటారు కదా మాష్టారు? మరి ఇలాంటివి ఎలా అర్ధం చేసుకోవాలి?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. జ్యోతిర్మయి గారూ ,

  ధన్యవాదములు .

  జలతారు వెన్నెల గారూ ,

  ధన్యవాదములు . మీరన్నట్లు దాన్ని పురాణ గాథ గానే అర్థం చేసుకోవాలి మరి !

  ప్రత్యుత్తరంతొలగించు
 3. తెలుగు మాష్టారు గారి సమన్వయము బాగున్నది !!
  ఎందుకంటే అది సత్యాన్ని సూచించేదిలా ఉన్నది !!

  బాగున్నది చాలా simple గా చక్కగా అర్థం అయ్యేలా తిప్పి అంతే చక్క గా చెప్పేలా !!
  అతి చిన్న example ద్వారా భారతీయ సనాతన సాంప్రదాయాల వైభవం ఇది అనే చెప్పగలిగే రీతిలో ఇది ఒక కథగా చక్కగా కుదిరింది.

  నిజానికి పిల్లలకు అర్థం అయ్యేలా మీరు చెప్పినది సరిపోతుంది ...!
  అయితే ! మరి పెద్దలు ఏమి చెయ్యాలి?

  ఇలా కేవలం సూర్య నమస్కారం అనే ప్రాథమిక అంశం లోనే ఇంత లక్ష్యం దాగి ఉంటె,
  మరి ఇతరత్రా అమలుజరుప బడుతున్న సాంప్రదాయాల వెనుక దాగిన
  సత్యాలను శోధించి వాటిని ఏ ఉద్దేశ్యం చేత అలా సంప్రదాయం గా ఏర్పాటు చేసారో గుర్తించి వర్తిన్చగలగటం మన బాధ్యత అవుతుంది,

  ప్రతి భారతీయ సాంప్రదాయం వెనుకా ఒక సత్య స్ఫొరకమైన జ్ఞాన దృష్టి దాగి ఉంటుంది,

  అలాకాక
  అంధంగా చేయటం వలన మూడాచారం గా పేర్కాన్చుతుంది.
  అది గుర్తించ కుండా చేస్తే అది అలవాటు గానో మొక్కు బడి గానో తయారౌతుంది,
  గుర్తించి చేయుట వలన జ్ఞాన సిద్ధి కలుగుతుంది,

  సర్వేజనాః సుఖినో భవంతు
  అనే వాక్యం లో సర్వే జనాః అంటే సర్వ జీవ రాసి గా గుర్తుంచాలి
  అప్పుడు భారతీయ ఆత్మ వైభవం వెలుగు చూస్తుంది,
  సాయిరాం !!

  (ఏమిటో మీ post కి comment గా చిన్నగా thanks చెప్పాలి అనిపించి start చేస్తే,,, నా మనసు చేతులూ ఆగటం లేదు
  ఎంతో ప్రేరణను తీసుకున్నట్లున్నాయి మీనుంచి సాగిపోతూనే ఉన్నాయి )
  ఇంకా పెంచటం కరెక్ట్ కాదని నేనే ఆపేసాను - బాగుంది )

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఎందుకో ? ఏమో ? - గారికి ధన్యవాదముల .
  ఏది సత్యం ? ఏదసత్యం ? - కథాంశం పై లోతుగా విశ్లేషించిన మీకు కృతఙ్ఞతలు . తంతు జరిపించే పురోహితపనికి కూడా అర్థం తెలియని పెండ్లి మంత్రాల్లా - గ్రుడ్డిగా కాకుండా రాగ ద్వేషాల కతీతంగా విశ్లేషించి ,మంచో చెడో తేల్చి, పాటించాలనో కూడదో తెలియ జెప్పాల్సిన బాధ్యత విద్యావేత్తల పై ఉంది . అలా చేయగలిగిన నాడు మనం భావి భారత పౌరులకు చక్కని మార్గ దర్శనం చేసిన వారమౌతాము .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నమస్కారమండి ! నా పేరు శివ !!

   నేను శ్రీ శ్రీ గారి ఒక కవితను youtube లో
   http://youtu.be/vYiyV2pX1ck
   ఉంచి ఆ link ని forward చేస్తే ఒక friend కి reply గా మీ post link ని పంపారు వారు.
   చూసి చాలా inspire అయ్యాను great things are so simple అన్న చందాన చాల తేలిక పదాలతో అందరికి ఎదురయ్యే అనుభవమే
   కనుక హృదయానికి హత్తుకునేలా కథా వస్తువు ఉన్నది. (నిజంగా జరిగినదే అయినప్పట్టికినీ)
   Thanks for your valuable reply

   :)

   ?!

   తొలగించు