సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, జూన్ 2012, సోమవారం

ఆశీస్సు లందిద్దాం లక్ష్మికి ... (పాఠశాల కథలు)


ఏమ్మా ! లక్ష్మీ   అన్నాడు పలకరింపుగా ప్రథానోపాధ్యాయుడు, వ్రాసుకొంటున్న వాడల్లా తల పైకెత్తి  గదిలోకి వచ్చిన లక్ష్మి నుద్దేశించి

సమాధానంగా లక్ష్మి కళ్ళ నిండా నీళ్ళు

                                                                ******************

అది ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం . అందులోనే జూనియర్ కళాశాల కూడా నడుస్తోంది . అప్పుడు లక్ష్మి జూనియర్ ఇంటర్ . ఆ పాఠశాలలోనే పది చదివింది . లక్ష్మి ఆవూరి అరుంధతీయ వాడ అమ్మాయి . తల్లి దండ్రులకు అనారోగ్యం . అక్కలిద్దరకూ పెండ్లిండ్లయి వెళ్ళిపోయారు . పదవ తరగతి పరీక్ష తప్పింది . ఇంగ్లీష్ సబ్జెక్ట్ మిగిలి పోయింది . మళ్ళీ మళ్ళీ రాసింది . తన వల్లకాలేదు . ఇల్లు గడవడానికి కూలి పనులకు వెళ్ళేది .

పరీక్ష ఫీజు కట్టడం – పిలిపించడం ప్రథానోపాధ్యాయులకు షరా మామూలయ్యింది . ఆ మార్చిలో కూడా పరీక్ష ఫీజు కట్టేడు .  పరాయి ఊళ్లో కూలి పనులకు పోయి ఉంటే పిలిపించి , వారం రోజులు కూచోబెట్టి పరీక్షకు ప్రిపేర్ చేసి పంపించాడు . లక్ష్మి ఎట్టకేలకు పది పాసయ్యింది .

జూన్లో విద్యాలయాలు ప్రారంభించగానే – పిలిపించి ఫీజు కట్టి ఇంటర్ లో చేర్పించినాడు . పుస్తకాలు వగైరా ఏర్పాటు చేసినాడు .

                                                            *********************

అరెరే !   ఏమిటా కన్నీళ్ళు? కళ్లు తుడుచుకొని విషయం చెప్పు అనునయించాడు ప్రథానోపాధ్యాయుడు . 

రోజూ కాలేజికి రావడం వల్ల ఆదివారం ఒక్కరోజు మాత్రమే కూలి కెల్తున్నాను . మా నాయనకు రెండొందలు వృధ్ధాప్యపు పింఛను ఇస్తారు . వాటితో గడవడం కష్టంగా ఉంది . ప్రిన్సిపాల్ కు చెప్పండి సార్  అంది లక్ష్మి సంకోచంగా

అంటే వారంలో ఆదివారం కాకుండా ఇంకో రెండు రోజులు కూలి కెళ్ళే అవకాశం కోసమన్నమాట . 

అరెరే వీళ్ళ పరిస్థితి తెలిసీ లక్ష్మిని ఇంటరలో చేర్పించానే, పొరపాటు చేశానా !  అన్పించింది ప్రథానోపాధ్యాయులుకు లిప్తకాలం .

కానే కాదు , తాను చేసింది కరక్టే .  అయితే పరిస్థితిని అధిగమించడమెలా ? ‘

లక్ష్మీ !  ఊళ్ళో రేషన్ ఇచ్చే ముందురా ,  ఏదో ఒక మార్గం చూద్దాం , కాలేజీకి మాత్రం మానొద్దు ,  హాజరు కాక పోతే పాఠాలు అర్థం కావు , ఎలాంటి అవసరమైనా నా వద్దకురా  అంటూ తక్షణ కుటుంబ అవసరాలకు గాను కొంత డబ్బిచ్చి పంపించాడు .

                                                       **************************

ప్రిన్సిపాల్ , లెక్చరర్ల సహకారంతో ఇంటర్ దగ్విజయంగా పూర్తి చేసింది లక్ష్మి .

ప్రథానోపాధ్యాయుడు T.T.C (D.ed ) కు అప్లై చేయించాడు .

టీచర్స్ ట్రయినింగ్ పూర్తయింది .

ఆశ్చర్యంగా ఉందా ?

లక్ష్మి ప్పుడు చదువులమ్మ !

పదిమందికి చదువు చెప్పే పంతులమ్మ .

ఆశీస్సులందిద్దాం లక్ష్మికి .