సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

4, జనవరి 2014, శనివారం

చతికిలబడిన సంక్రాంతి లక్ష్మి



        ఏంటీ అలా ఉన్నావు . వొంట్లో బాలేదా    అడిగేడు రాజారావు .
ఇంకా ఏంబాగు , ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం ? తొందరగా పోతే బావుణ్ణు   అంది నిర్వేదంగా సుభాషిణమ్మ.

        రాజారావుకు 63 ,  సుభాషిణమ్మకు 58 . ఇద్దరికీ బీపీ , షుగరూ వగైరా వగైరా చాలా మంది ఆత్మీయులు బాసటగా నిలిచేరు . ముసలి తనానికీ – అనారోగ్యానికీ ఆత్మీయత కాస్త అధికమే మరి !

       రాజారావు రిటైరై ఐదేళ్ళయ్యింది . కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యు . ఎస్ లో . కూతురూ అల్లుడూ హైద్రబాదులో . కొడుక్కి మగ , ఆడా ఇద్దరు పిల్లలు . కూతురికి ఇద్దరూ మగ పిల్లలు .

       పెద్దపండుగ రాబోతోంది . కొడుకూ కూతురూ కోడలూ అల్లుడూ మనవళ్ళూ మనవరాళ్ళ తో కళ కళ లాడుతూ ఉండాల్సిన యిల్లు . పెళ్ళిళ్లయి ఎవరికి వాళ్ళు దూర తీరాలలో ఉంటున్నారు . అందుకే దిగులు . సుభాషిణమ్మ బైట పడుతోంది . రాజారావు బయట పడడంలేదు . అంతే తేడా .

        రాజారావు మనోగతం బాల్యంలోకి మళ్ళింది . పల్లెటూరి నేపథ్యం వాళ్ళది . సంక్రాంతి వస్తుందంటే
పిల్లలంతా కొన్నిరోజుల ముందు నుంచే భోగి మంట కోసం తాటి మట్టలూ ఈత బరిగెలూ వగైరా ప్రోది చేసి పెట్టుకునే వారు . భోగి రోజు అర్థ రాత్రి దాటంగనే పోటీలు పడి మరీ భోగి మంటలు మొదలయ్యేవి .

       పది రోజుల ముందు నుంచే పిండి వంటలు తయ్యారు చేసేవారు . ముఖ్యంగా నేతి అరిసెలు – బెల్లంతోనూ పంచదారతోనూ రెండు రకాలు చేసేవారు . ఇక లడ్లూ వగైరాలు నాలుగైదు రకాలు స్వీట్లూ , నాలుగైదు రకాలు కారా తప్పనిసరి .

       ఇంటి నిండా జనం . పెద్దల పండుగ కావడం వల్ల స్వర్గస్తులైన వారికి  కొత్త బట్టలూ  నైవేద్యాలూ  పెట్టి  వాళ్లను స్మరించుకొని ధూపం వేసి  పూజాదికాలు నిర్వర్తించే వారు .  ఆ సందడే వేరు .

       పెండ్లయిన తరువాత అత్తవారింట సంక్రాంతికి అల్లుడి మర్యాదలు , ఆ ఆదరణ , ఆ వేడుకలు రాజారావు మదిలో తళుక్కున ఒక్క క్షణం మెరిసినవి .

       గతాల స్మృతి పథం నుండి బయట పడి నిట్టూర్చేడు . చివరకు ఇధ్దరు మిగిలేరు . ఏముంది పండుగ . నిర్వేదం తప్ప . ఈ వయస్సులో బిడ్డలు తోడుగా – మనవళ్లూ మనవరాళ్లతో ఆనందంగా సంక్రాంతి గడపడం – ప్చ్- అత్యాశే మరి .

        అవును నిజమే . అప్పటికీ ఇప్పటికీ  జీవన స్థితి గతులలో  ,  వసతులలో  అభివృధ్ధి కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉంది . ఇప్పుడున్నన్ని వసతు లప్పుడు లేవు . ఇప్పుడున్నంత స్థితి గతు లప్పుడు లేవు . 

       గ్రామీణ భారతంలో అప్పుడు వ్యవసాయం  పాడి తప్ప వేరే ఆదాయ వనరులు లేవు .  కలిసుండడం ,
కష్టించి పని చెయ్యడం , కష్ట సుఖాలు పంచు కుంటూ , ఆప్యాయతలు పెంచుకుంటూ తృప్తి కరమైన కుటుంబ జీవన మాధుర్యాన్ని అనుభవించేవారు .

       ఇప్పుడు తల్లి దండ్రుల – బిడ్డల  ఎవరి బ్రతుకు వారిది . ఒంటరి జీవితాలు . బంధాలు తెగిన జీవితాలు . భద్రత కొఱవడిన జీవితాలు . తృప్తి చెందని మనస్సులు . మనోవేదనలు .

      కాలానుగుణంగా మార్పు సహజమే . కుటుంబ జీవన మాధుర్యం లేని మార్పు అంగీకారం కాదు .  


                       

31, డిసెంబర్ 2013, మంగళవారం

ఆశిద్దాం - స్వాగతిద్దాం



ఆర్థిక-సామాజికాంశాలతో కూడిన సమ సమాజం ఏర్పడాలని ఆశిద్దాం .
సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి ఏర్పడాలని ఆశిద్దాం .
ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను నివారించి క్రమశిక్షణ పాటించాలని ఆశిద్దాం .
విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడాలని ఆశిద్దాం .
పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే రోజు రావాలని ఆశిద్దాం .
లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తుందని ఆశిద్దాం .
మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రావాలని ఆశిద్దాం .
పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం రావాలని ఆశిద్దాం .
మానసిక-శారీరక దుర్బలులను , వృధ్ధులనూ గౌరవించి ఆదరించే సంస్కృతి అలవడాలని ఆశిద్దాం .
స్త్రీలనూ , పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత సమాజం ఏర్పడాలని ఆశిద్దాం .
ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం ఏర్పడాలని ఆశిద్దాం .
రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోవాలని ఆశిద్దాం .
అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తుందని ఆశిద్దాం .
రచయితలూ,కవులూ,కళాకారులూ – సమాజం సజావుగా నడవడానికి అవసరమైన చైతన్యస్ఫూర్తినందిస్తారని ఆశిద్దాం .
మేలైన సమాజం కోసం
మెరుగైన జీవనం కోసం
కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం
శుభాకాంక్షల నందిద్దాం