సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, మార్చి 2014, శనివారం

ఏమ్మా ! వింటున్నావా ?



ఏమ్మా!
వింటున్నావా ?
ఔను ! కూతుర్నేనమ్మా !
నాన్నకూతుర్ని!

కొడుకును కాదమ్మా!
నీ ముద్దుల కొడుకును కాదమ్మా!
కొడుకును కన్నందుకు పొంగి పోతున్నావా ?
కొడుకంటే ఎందుకమ్మా అంతిష్టం ?
ఇద్దర్నీ ఒక్కలాగే పెంచవేమమ్మా ?
ప్రేమానురాగాల్ని ఒక్కలాగే పంచవేమమ్మా ?
వాడికేమో కాన్వెంటూ -
నాకేమో గవర్న్ మెంట్ స్కూలూనా ?
నాచదువు ఊళ్ళో ఉన్నంతవరకేనా ?
ఉన్నత చదువులు మాత్రం వాడికేనా ?
ఉధ్ధరిస్తాడను కుంటున్నావా ?
కొడుకు మీది మోహంతో -
కళ్ళు మూసేసుకోకమ్మా !
మరీ అంత మురిసి పోవద్దమ్మా !

నీ మురిపెం వల్లే -
వాడిల్లా తగలడింది
మంచీ చెడులు మంటి కింద పాతేస్తున్నాడు
కీర్తి ప్రతిష్టలను కిరాతకాల కెక్కిస్తున్నాడు
మాన మర్యాదలు మరుస్తున్నాడు

ముదిమిలో ముద్ద పెడతాడనుకుంటున్నావా ?
చచ్చింతర్వాత తలకొరివి పెడతాడనుకుంటున్నావా ?
బ్రమలో బతకొద్దు
తల్లీ తండ్రీ అనుకునేదీ
దగ్గరికి తీసుకునేదీ
తుదకు,
తలకొరివి పెట్టేదీ
ఈ తనయేనమ్మా!

వాణ్ణైనా నన్నైనా
కాస్త కఠినంగా అనిపించినా
కష్టమూ సుఖమూ తెలిసేట్టు
క్రమశిక్షణతో పెంచమ్మా
కళ్ళు మూసుకో వద్దమ్మా
గారాంచేసి చెడగొట్టొద్దమ్మా
అవనీ తలాన్ని-
అమృతమయం చేయడం
అమ్మకే సాధ్యమమ్మా
                                                                                                                                                               (మహిళా బ్లాగరు లందరకూ 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు)








2 కామెంట్‌లు: