సర్కారు బడిజెప్పు సార్లకు పట్టదు
చేతి నిండ రియలెస్టేటు వల్ల
పర్యవేక్షకులకు పట్టదు పనితీరు
విద్యానిధులు బొక్కు విధుల వల్ల
పాఠశాలల బాగు పట్టదు నేతకు
కార్పొరేటు బడుల కలిమి వల్ల
బిడ్డల చదువులు పెద్దవారెరుగరు
జీవన పోరాట స్థితుల వల్ల
వెరసి - గ్రామీణ బడులలో వెలయు చదువు
చిత్తశుధ్ధికి దూరమై చిత్రమైన
తీరు తెన్నుల భాసించు తీరు చూడ
చదువు మృగ్యము సర్కారు ‘సాగు’ బడుల .
కొడుకు జదివించు కొనుటకు కూలి చేయు
తల్లికి తనయ చేదోడు తప్పదయ్యె
చదువు సర్కారు బడులలో చక్కనైన
కార్పొ’ రేటు ’ బడుల కేగు కర్మ తొలగు .
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి