సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, ఫిబ్రవరి 2015, బుధవారం

తెలుగేలా ? ఆంగ్లభాష తియ్యగనుండన్

చిన్నూ , ఇంద బనానా తిను
మామ్ నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి
నాన్నా , డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు , ఓకే?
ఓకే ,  మామ్
దట్స్ గుడ్
                    *********
హలో బావ గారూ , ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు , తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....
హారినీ...రావుడూ, నువ్వటోయ్ , అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .
ఒరేయ్ అబ్బాయీ, ఈ భోషాణంతో నేను పడ్లేను, ఒక ఊరోపరి కానీ , హస్తోపరి కానీ కొని తగలడరా అంటే వింటాడా , మా శివుడు ? నిన్నకు నిన్న _ తెలుగేలా ఆంగ్లభాష తియ్య్డగనుండన్ _ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు .
                    ***********
హలో వదినా , ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ఈతరం ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే , నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్  ఒప్పుకుందా , అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ .
                        *************
       భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
      అరటి పండును బనానాగా , ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం .
       ఓరుగంటినీ , ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?
          రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్ నెట్ , ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ , మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై , వికృతభాష తయారౌతుంది .
           అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు  ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
            నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .

2 వ్యాఖ్యలు:

 1. మరీ పిచ్చిగా రోడ్డు, ఫోను లాటి పదాలకి తెనుగు పదాలు చెప్పడం హింసించడమే! తెనుగు, తెనుగు అని అరిచేవారెవరూ తెనుగులో రాయటం లేదు, మాటాడటం లేదు కూడా. సంవత్సరానికోసారి దినం జరిపి పడుకుంటారు. తెనుగు చదువుకున్నవారికి జీవికలేదు. అందుకే ఆదరణాలేదు, అవసరమే భాషను పెంచుతుంది.... అవసరం పెంచడం మనవారివల్లకాని పని...ఇది అనంతం... ఇదింతే...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. భాస్కర శర్మగారూ ,
  ధన్యవాదములు .
  అనేక స్వచ్ఛమైన తెలుగు పదాలు మారుమూల గ్రామ సీమలలో
  గ్రామీణుల వాడుకలో సజీవంగా వర్థిల్లు తున్నాయి . వాటిని మన
  పండితులు గ్రామ్యాలని ఈసడిస్తారు .
  ఫోన్ , ఇంటర్ నెట్ , కంప్యూటర్ , టీవీ _ లాంటి వస్తువుల పేర్లు
  కూడా తెలుగులో విరివిగా వాడబడడం వీరికి నచ్చడం లేదు .
  వీటిని తెలుగులోకి తీసుకరావాలనే ప్రయత్నంలో సంస్కృతీకరించి
  తెలుగును వికారం చేసేస్తున్నారు .
  ఈ దురదంతా వీళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికే గాని ,
  భాషాభివృధ్ధికి కాదు . వీళ్ళకీపిచ్చి కుదిరేదీ లేదు . రోకలి తలకు
  చుట్టుకోవడం మానేదీ లేదు .

  ప్రత్యుత్తరంతొలగించు