సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

4, జులై 2015, శనివారం

రఘువంశ సోము డా రాముడేలిన భూమి .....

రఘువంశ సోము డా రాముడేలిన భూమి
సీతా మహా సాధ్వి మాతృ భూమి
గీతా ప్రబోధి శ్రీ కృష్ణుండు జన్మించి
ధర్మంబు నిలిపిన కర్మ భూమి
సిధ్ధార్థు డుదయించి బుధ్ధుడై జగతికి
దారిచూపించిన ధర్మ భూమి
వేదాది విఙ్ఞాన శోధనల్ విరిసి _ ప్ర
పంచ గురువయిన భరత భూమి

ఘనత బొగడంగ వలయునో _ కాక_ జ్యోతి
షాది మోసాల నిలయమై చనుట జూచి
కలచి యేడ్వంగ వలయునో తెలియరాదు
పండితులె యిచట మోసాల బాట నడువ 


సంపద సృష్టించు చక్కని మార్గమ్ము
కృషి యొక్కటేను _ తక్కినవి మోస
మష్టలక్ష్మి ప్రతిమ లరయ రాత్రికి రాత్రి
కోటీశ్వరుడగున ?  కుట్ర గాద ?
పేరులో మార్పుచే పేద శ్రీమంతు డ
గుట న్యూమరాలజి కుట్ర గాద ?
గ్రహ శాంతి జరిపించ గతి మారి గ్రహ రాశి
అనుగ్రహ ఫలితాలు గనుట నిజమ ?

ఘనత దాల్చిన మేథావి ! కాస్త వినుము !
చదువుకున్నట్టి చదువు నసత్యములకు
పూని వెచ్చించ వద్దు , ఈ పుణ్య భూమి
పరువు తీయొద్దు  _ సుఖముగా బ్రతుకు కొఱకు 

2 కామెంట్‌లు:

  1. నిజమే , కష్టపడకుండా ఫలితాలు రావు . ఈ సత్యమందరికీ తెలుసు .
    ఐనా ,
    అంతరిక్షంలో మనకు లక్షల మైళ్ళ దూరంలో నిర్దిష్ట కక్ష్యలలో సూర్యగోళం చుట్టూ
    తిరిగే గ్రహాలకూ , వాటికి అనంతకోటి దూరాలలో ఉన్న నక్షత్రాలకూ , మనిషి పుట్టుకకూ
    సంబంధం లేని లెక్కలు గట్టి ఒక అసంబధ్ధ శాస్త్రాన్ని సృష్టించి జాతక చక్రాన్నీ ,
    తద్వారా మనిషి దొంగవుతాడా దొరవుతాడా భవిష్యత్తు నిర్ణయిండం , దీన్నొక సంపాదన
    మార్గంగా .....
    ఇలాంటి ఇంకా అనేకం ..... కష్ట పడకుండా ..... మోసం ద్వరా ...... ఆర్జించి
    సుఖమయ జీవనానికి అలవాటు పడ్డ మేథావులకు .....
    ' కష్టే ఫలి ' మీరిచ్చే సందేశానికి ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి