సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, ఆగస్టు 2016, గురువారం

కూతురే తల్లి దండ్రుల కొంగు పసిడి

పుట్టి పుట్టంగనే పుణ్యాల ప్రోవయి
        కన్న వారికి గూర్చు కామ్యఫలము
బుడి బుడి నడకల బుజ్జాయి నవ్వులు
         నట్టింట ముత్యాల నగలు పేర్చు
పరికిణీ గట్టిన పాపాయి సొబగులు
           మురిపాల ముద్దులు మూట గట్టు
పెళ్ళీడు దరిసిన ప్రియ తనయ దిరుగు
            నాయింట లక్ష్మీ విహార మొనరు

ఘనులు కడుపార కూతురిన్ గన్న వారు
తల్లి దండ్రులు తనివార తమకు దాము
మురియు ననుభూతు లేమని బొగడ వచ్చు !
ఆడ పిల్లయే ఇంటికి అమృత ఫలము .

పండుగల నాడు కన్నుల పండు వగుచు
ఆడి పాడుచు దిరుగాడు ఆడ పిల్ల
ల కళ ఆయింటి నిండ వరాలు గురియు
కూతురే తల్లి దండ్రుల కొంగు పసిడి  .

అమ్మాయి నాన్న కూచీ ,
అమ్మకు గడు తోడు నీడ , అన్నయ్యకు ప్రా
ణ మ్మపురూప మ్మీ బం
ధమ్ములు గద ! ఆడ పిల్ల తనరిన యింటన్ .వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి