సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

9, అక్టోబర్ 2016, ఆదివారం

వర పరంజ్యోతి దుర్గమ్మ

కరుణా తరంగిత  కమనీయ దృక్కుల
చల్లంగ జూచెడి తల్లి దుర్గ
అమృతాంతరంగిత  విమల వాత్సల్యాల
దగ్గర దీసెడి తల్లి దుర్గ
వరదాభ యామృత కర సహస్రాలతో
అడిగిన విచ్చెడి మ్మ దుర్గ
కోటి సూర్య ప్రభలు కూడిన డెందాన
తమిదీర దీవించు తల్లి దుర్గ

కష్ట నష్టాది జీవితాంకములుగాని
భయ దరిద్రాది బాదర బంది గాని
ప్రజల దరిజేర కుండ దుర్గమయి నిల్చి
కాచి కాపాడు తల్లి మా కనక దుర్గ .


 మిరుమిట్లు గొలిపెడి  మెరుగు బంగారంపు
పచ్చని తనుచాయ బరగు తల్లి !
ముమ్మూర్తులకు , వారి మువ్వురు సతులకు
మూలపుటమ్మయి గ్రాలు తల్లి !
అమ్మ తనమ్ము బ్రంహ్మాండమ్ము నిండి  వె
లుంగ వాత్సల్యమ్ము లొలుకు తల్లి !
జీవ కోటికి మహా జీవనానందమై
అనురాగములు పంచు అమృత వల్లి !

 అమ్మ ! అమ్మల కమ్మ! మాయమ్మ! దుర్గ !
బిడ్డలను కాచి  రక్షించు ప్రేమ మూర్తి !
వర పరంజ్యోతి! దుర్గమ్మ!  వదలనమ్మ
పాద పద్మాలు - పట్టిన పట్టు వదల . 

6 కామెంట్‌లు:

  1. " అమ్మ తనమ్ము బ్రంహ్మాండమ్ము నిండి వె
    లుంగ వాత్సల్యమ్ము లొలుకు తల్లి !"

    నచ్చాయండీ మీ ఈ వాక్యాలు. మీకు శరన్నవరాత్రి శుభకామనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ లలిత గారూ ,

      అమ్మా యని ఆర్తి గదుర
      అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
      అమ్మతనము వాత్సల్యము
      క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .

      తొలగించండి
  2. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మకడుపారడి బుచ్చెడియమ్మ.......

    పద్యాలు బాగున్నాయ్! అమ్మగురించి ఎంత చెబితే తనివి తీరుతుంది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ శర్మగారూ ,
      నిజమే , అమ్మను ఎంత పొగిడినా తనివి తీరదు .

      తొలగించండి


  3. పట్టిన పట్టును విడువక
    తట్టని వరదాభయామృతకరీ దుర్గన్
    గట్టిగ పట్టు జిలేబీ
    చట్టని మెరియును పదములు చక్కగవనమై !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పట్టిన పాదము విడువను
    నట్టేటను కదల లేని నావ గడచి తా
    గట్టెక్కు దాక విహితా !
    గట్టెక్కిన మీద కుదురు కడుకొను వరకున్ .

    రిప్లయితొలగించండి