సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

26, సెప్టెంబర్ 2017, మంగళవారం

అన్నవరం సత్యదేవుని సందర్శనం.


రత్నగిరీశ్వరున్ గొలువ రమ్మని బిల్చిన బిడ్డవెంట నే
న్నూత్న మనో విభూతి వలనొప్పగ వెళ్ళితి , నెంత వేడుకో !
యత్నము సాంతమున్ మదికి హాయి నొసంగెను ,  జన్మ పుణ్యముల్
నూత్నములై యదృష్టముల నొక్కెడ గూర్చిన భాగ్య మొప్పగా -

కను విందుగా క్రింది గర్భాలయమ్ములో
శ్రీచక్రయుతముగా చెలువు మెరయ
బ్రహ్మాది దేవతల్ పడి పడి మ్రొక్కిన
పాదాలు గంటిని పరవశమున
కడు శోభనము పైన గర్భాలయమ్ములో
శివ , రమా మూర్తులు చేరి కొలువ
మధ్యలో కొలువైన మహనీయ మూర్తి  ము
ఖమును గంటిని నాదు కర్మ తొలగె

అన్నవరము యాత్ర మిన్నయై మదిదోచె
కన్నుల కొక పుణ్య మున్న కతన
జన్మ ధన్య మయ్యె , సత్యదేవు మహా ప్ర
సాదము దొరికినది , సకల శుభము .

సత్య దేవు నెదుట సాగిలి మ్రొక్కితి
వ్రతము సేయు భక్త వరుల గంటి
వెలయు కొండ మీది యిలను  వైకుంఠమ్ము
కన్నులార గంటి కరవు దీరె .


3 వ్యాఖ్యలు:

 1. అమ్మని దర్శించి, స్వామిని అన్నవరంలో కుటుంబ సహితంగా దర్శనం చేసుకున్నారనమాట. ఆనందం.

  మిమ్మల్ని ఆహ్వానించగల స్థితిలో లేకపోయాం! అదే చింత.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. బండి రావు గారు వచ్చిన తదుపరి
   మిమ్ము 'జూడ వచ్చు' కమ్మనైన
   యోచన గలదయ్య , మాచన భాస్కరా !
   అనుమతించ వలయు ననఘ ! తమరు .

   తొలగించు

  2. మిత్రులు రాజారావుగారు,

   విషయం ముందే తెలిసింది. తమరిరాక మాకెంతో సంతోషం కదండి. తమకిదే మా కుటుంబ సాదర ఆహ్వానం. కోలుకుంటున్నాం మీరొచ్చేనాటికి చిరునవ్వుతూ ఆహ్వానించాలన్నదే సంకల్పం.

   అది నా అనుమతికాదండి తమరి అనుగ్రహం

   __/\__

   తొలగించు