సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, నవంబర్ 2017, ఆదివారం

పద్యం - పరమార్థం

పద్యం - పరమార్థం
                     *****************
వచనం గుర్తుంచుకోవడానికి వీలవదు . మనస్సు
నాకట్టు కుంటే పద్యం హత్తుకు పోతుంది .పలు
సందర్భాలలో ఉదహరించ బడుతుంది .
వచనంలో లేని ' నడక - లయ ' పద్యాన్ని గుర్తుం
డేలా చేస్తుంది . వచనంలో లేని ' స్వారస్యం ' పద్యంలో చూపించ వచ్చు . శబ్ద అనువృత్తులు
శోభను కూర్చి పద్యాన్ని మనోఙ్ఞం చేస్తాయి .
తెలుగు వాళ్ళు ఇప్పటికీ సుమతి , వేమన శతకాలనూ , భాగవత పద్యాలనూ నెమరు వేసుకుంటుంటారంటే పద్యం సరళంగానూ ,
చదువగానే అర్థమయ్యేలా ఉండబట్టే జనం
లోకి అమితంగా చొచ్చుకు పోయినవి .
' మేం పండితులం , మామూలు జనం కంటే
మాకు రెండేసి తలలున్నాయి ' అనుకోబట్టే
పద్యానికి జనం దూరమయ్యారు .
పద్యాన్ని సరళం చేసి , చదవంగానే అర్థమయ్యే
భాషలో రాస్తే , జనానికి చేరువౌతుంది . ఔత్సాహి
కులు రాయడానికి కూడా ముందుకు వస్తారు .
తెలుగు పద్యం కలకాలం వర్థిల్లుతుంది .
పద్యం రాయడానికి ఎవడైనా ముందుకొస్తే
ఈపదం గ్రామ్యం , ఈపదం వ్యాకరణ విరుధ్ధం ,
అని బెదరగొట్టేస్తున్నారు . అమ్మో , ఇది మనకు అచ్చుబాటయ్యే విషయం కాదు ,ఇదిపండితులకు
సంబంధించింది . - అని ఔత్సాహికులు మథ్యలోనే వదిలేస్తున్నారు .
సోషల్ మీడియా వల్ల జనంలో చాలమంది రచనల పట్ల , ముఖ్యంగా పద్యం పట్ల ఆకర్షితులౌతున్నారు . వారికి సహకరించాలి గాని , తమ శషభిషలతో అవమాన పరచడం పండితులకు భావ్యం కాదు .
వాడుకభాష పారుటేరు . మార్పు జీవద్భాషకు సహజం . మారిన మార్పును నమోదు చేసేందుకే వ్యాకరణం . పిడికెడు మంది పండితులు తలలూచడమే భాషకు ప్రయోజనం కారాదు . జన బాహుళ్యం లోకి చొచ్చుకు పోతేనే ఏదైనా బ్రతికుండేది .
పూర్వకవుల వాడుక భాష కూడా గ్రాంథికమే . మనం గ్రాంధికం మాట్లాడడం లేదే .
శిష్ట వ్యావహారికం కూడా పద్యంలో పనికి రాదా ?
అసలు తమరు రాసే పద్యాలు చదువరులకు
అర్థం కాక పోతే రాసేదెందుకు . మరీ విచిత్రంగా
కొందరు తాము రాసిన పద్యంలోని పదాలకు టీకా , టిప్పణి రాసుకుంటున్నారు .
చేయుచూ , చేస్తూ అని రాయకూడదట . అది వ్యావహారికం , చేయుచున్ అని గ్రాంధికం రాయండని ఆదేశిస్తున్నారు .
కాస్తయినా అనకూడదట , కొంతయినా అనాలట .
వల్ల అనకూడదు వలన అనాలి . ఇలా శిష్ట వ్యవహారాలుకూడా
పద్యంలో కూడదట . అడిగితే , మావి
సాంప్రదాయిక తులసివనాలంటారు .
నా భాదల్లా, సోషల్ మీడియాల పుణ్యం
వల్ల పద్యం రాయడం నేర్చుకోవడానికి చాలమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు . వారికి
సహకరించండి . పద్యాన్ని కనీసం కొన్ని తరాల
వరకైనా మననీయండి .
ఇక , నావిషయం -
తమరనుకుంటూండవచ్చు . ' వీడికేం తెలుసు ఛందస్సు , వ్యాకరణం - వాటి గొప్పతనం , వీడు
కూడా భాషను గూర్చి మాటాడే వాడా ' - అని .
నేను విద్వాన్ , పండిత శిక్షణ , MA , B ed , ఇంకా
అనేకం చదువుకున్న వాణ్ణి . ఛందో వ్యాకరణ భాషాశాస్త్రాలు పఠించిన భాషా , సారస్వతాభి
మానిని . 38 దేండ్లు ఉపాధ్యాయ వృత్తి నెరపిన
వాణ్ణి . కానీ , పండితాహంకారం కానీ భేషజం కానీ
దరిజేరనీయను . వినయం అలంకారం గా బ్రతికిన
వాణ్ణి .
భాష పుట్టింది జనబాహుళ్యం నాలుకల మీద .
పండితుల మెదళ్ళ నుండి కాదు .
పద్యాన్ని పలువురు చదివేలా , రాయడం నేర్చు
కునేలా ప్రయత్నిద్దాం .

19 వ్యాఖ్యలు:

 1. నేనేం చదువుకోలేదండీ!
  తెనుగు భాష మీద మక్కువ ఎక్కువ.
  ఇటుకల కట్టుబడంటే భయం.
  జీవ భాష సాగే ప్రవాహం

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు


  1. నేనేమీ చదువువు కొన
   లే! నాకింపైన భాష లెస్సగ తెలుగే !
   చానా భయకృత్తు గద
   బ్బా నాకు యిటుకల కట్టుబడి కవివర్యా !

   తొలగించు
  2. మా చదువులు వృత్తి వరకె ,
   మీ చదువులు వృత్తి దాటి మిన్నులు బట్టెన్ ,
   సూచనకును మేము తగము
   మాచన భాస్కరుల సాటి , మాతర మగునా ?

   తొలగించు
  3. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  4. మాన్యుణ్ణి చేస్తిరే సామాన్యుణ్ణి
   నమోవాకము గురువరా! __/\__

   తొలగించు
  5. గురువని సంబోధించుట
   గురువరులకు పాడి గాదు , కోవిదులగు మీ
   చరణ రజమునకు గూడా
   సరిబోలను నేను , తమరు ఙ్ఞానాంభసులే !

   తొలగించు


  6. మాన్యుణ్ణి చేస్తి రే సా
   మాన్యుణ్ణి నమో నమో ! సుమధుర కవీశా,
   అన్యతరము మాత్రమ్మే
   విన్యాసముల విదురుండ విరివి టపాలన్ :)

   జిలేబి

   తొలగించు
  7. మాటే! మాటాడేదే లేదే!
   ఏమని చెప్పుదు సుకవీ!!
   గుండె గొంతులో కొట్లాడుతున్నదే!!!

   తొలగించు


  8. ఏమని చెప్పుదు సుకవీ !
   మా మాటను తిరగవేసి మామి యిటన్ కం
   దామృతముగ మార్చెనుగా !
   ఏమో మా పదముల గతి యే కందంబో !

   చీర్స్
   జిలేబి

   తొలగించు


  9. అట్లా కష్టే ఫలముల్
   యెట్లాంటి పరిస్థితులనయిన యెదురుకొనన్
   తట్లాటల సరిజేయన్
   కొట్లాడెన్ గొంతులోన గుండెగ సుమ్మీ !

   జిలేబి

   తొలగించు

 2. జనబాహుళ్యపు నాల్కన
  మనుజుడ పుట్టెను పలుకులు, మహిత హితంబై
  మనుగడ కొరకై భాషయు
  కనుక గొలుసున చెఱబట్టకయ కవి దానిన్ !


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తవరు చదువు చున్న తాదృశ తులసి వ
   నమ్ము తెలుగు విభవ నందనమ్ము
   నాదు మొఱ వినంగ నప్పని చెవులవి
   కవి వృషభులు మీకు చవులు గావు .

   తొలగించు


  2. తెలుగే తెలియని వారమ
   య! లబ్జుగన్నిప్పుడే నయా నేర్చుట ఓ
   పలుకుల రాజా ! వృషభువు
   ల లుకలుక మరియు జిలేబు లన్ గన గలమే ?

   జిలేబి

   తొలగించు
 3. మీరు ఎలా రాసినా బ్రహ్మాండం...
  ఆకట్టుకోవాలన్న ఆత్రుత ఆలోచనలు మాలాంటి వారికి మీకు కాదండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పద్మార్పిత గారి ప్రశంశ అంటే
   కవితామతల్లి ప్రశంశే నండీ ,
   ధన్యవాదాలు .

   తొలగించు


  2. కవితామ తల్లి వీవే !
   మవురీ ! పద్మార్పితా! సుమధురిమ లొలుకన్
   నవనవ భావన లెల్లన్
   కవనం బయ్యెను జిలేబి కమలంబువలెన్ !

   తొలగించు


 4. మీరెట్లా రాసిననూ
  ఓరయ్య భళి భళి సూవె ఓరాజన్నా !
  ఆరాటమ్ముల్ మాక
  య్యా రాసిన రాతలెల్ల యాకాణమ్మే ?:)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రాజారావుగారు మీరు వ్రాసినట్లు అందరికీ సాధ్యం కాదు కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు సుమా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఆ ప్రయత్నమే ఇప్పుడు కావలసింది తులసి గారూ ,
   కానీ , పద్యాన్ని పదిమందికీ పంచడం పండితులకిష్టంలేదు .
   తమది సాంప్రదాయ కవిత్వం . సామాన్యులు ముట్టుకో కూడ
   దంటున్నారు .

   తొలగించు