సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, జనవరి 2018, ఆదివారం

పద్యమూ - పద్యకవులూ వర్థిల్లాలి

' పలుకు ' నన వేసి , ' మొగ్గయై ' భావ మొదిగి ,
' పద్య 'మై పూవు విడిసె - నిప్పగిది కవి - మ
నోజ్ఞ రుచిర పరిమళ వినూత్న భంగి
రస మయము జేసె తెల్గు నేలలు తరించ .

మొనసి నాబోటి వేవురు ముదముతోడ
పద్యమందలి రసభావ విద్యమాన
మథువు ద్రావి , తనిసి , కవి విథము దెలిసి ,
తనివి తీరంగ మెత్తుము తనను దలచి .

ఎంత రమణీయ మీ పూల పుంత !  మున్ను
నన్నయాది కవీంద్రులు సన్నుతముగ
తెల్గు నేలల దీర్చి ఖ్యాతిలగ జేసి
తెలుగు పద్య పూదోటలు దెచ్చినారు .

కోరి బుధు లనంగ హేరాళమై యిప్డు
పద్య మెవ్వడేని పరిఢవిల్ల
వ్రాసె నేని వచ్చి రాయిడి జేతురు
తప్పు తప్పు తప్పు తప్పటంచు .

కాస్త యెప్పుడైన స్కాలిత్యము దొరలు
అంత మాత్ర మతని సుంతయేని
సారహీను డనుచు చావగొట్టంగ నీ
ఘనులు తప్పెరుగని వినుతు లేమి !

తప్పు వెదుకుచు జదువు బుధవర ! కాస్త
దోరణిని మార్చుకో ! పద్యసారము గను !
మేలు భజియించు ! తలయూచు మించుకైన !
నిండు  రంథ్రైక ధ్యాసలో నుండి తలగు !

14 కామెంట్‌లు:

  1. మనోజ్ఞమైన తెనుగు పద్యానికి సాటి కలదా! అందమైనది కట్టమన్నదే నా గోస

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యాన్ని పండితులు తప్పులు వెదికే దృష్టితోనే చదువుతున్నారు .
      ఇదేమి శాడిజమో అర్థంకాదు . వీళ్ళూ పద్యం వ్రాసే వాళ్ళా ? అనే
      చులకన భావం పోవాలి . తమలో ఏమాత్రం సహిష్ణుత మిగిలున్నా వ్రాసినవాణ్ణి ప్రశంసించి ప్రోత్సహించడం అలవరచుకోవాలి .
      ధన్యవాదాలు .

      తొలగించండి
    2. 'పద్యాన్ని పండితులు తప్పులు వెదికే దృష్టితోనే చదువుతున్నారు'
      దీన్ని నిరశిద్దాం,కాని కొత్త అని, అర్ధం లేనిపదాలు,అర్ధం కాని పదాలు వాడితే, ఎలా ప్రోత్సహించాలంటారు? .

      తొలగించండి


    3. అర్థము లేని పదమ్ముల
      నర్థము కాని పదముల ఘనమ్ముగ గూర్చన్
      సార్థకతేమి గలదయా
      వ్యర్థములీ పద్యములు సువర్ణము లైనన్ !

      జిలేబి

      తొలగించండి


    4. నాకు తెలియని పదాలను
      ఓ కుందనపు పువు బోడి గూర్చకు సుమ్మీ
      హేగురు ! మాచన! మీపద
      సాగరమును జూచి నేర్వ జాల్వారినవే :)

      జిలేబి

      తొలగించండి


  2. కలగాదయా జనులు గట్టిగ యత్నము జేయ పేర్మితో
    పలుకుల్ వినూత్నముగ పద్యములెల్లను రూపుదిద్దగన్
    వెలుగున్ తెలుంగు మదివేణువు గానముగా సయాటలన్
    లలితమ్ముగా నిలచి లబ్జును‌గాంచునయా కవీశ్వరా!


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగు భాషన్నా , తెలుగు పద్యమన్నా మీకున్న యిష్టానికి జేజేలు .ధన్యవాదములు .

      తొలగించండి


  3. పండితులు చదివి రయ్యా
    ఖండన మండనలతో నఖక్షతములతో
    పిండిరి క్రొంగొత్త జనుల
    దండగ దండగ యనుచు సదా కొఱ‌గనుచున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. కానిండు పద్య సుమములు
    రానిండు మనోజ్ఞ పరిమళాలు పొదివి , యె
    వ్వని సొత్తేమి కవిత్వము ?
    మనసున కానంద మిడును మనకైన గదా !

    రిప్లయితొలగించండి


  5. పద్యంబెవ్వడిసొత్తురా నరుడ! రాపాడించి నెట్టేవుగా
    సాధ్యంబియ్యది కాదు మీకనుచు యే సాయమ్ములన్ సేయకన్
    విద్యార్థుల్ మనకేలరొచ్చు యనుచున్ వీడంగ జేసేవుగా
    హృద్యంబై వెలుగియ్యలేక తెలుగే హృత్కాష్ఠమయ్యెన్ గదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ
    చదువు నిరర్థకమ్ము , గుణ సంయుతు లెవ్వరు తప్పులెన్నుటే
    విధిగ గణింప జూడరు వివేకము గోల్పడి , యట్లు జూతురేన్
    బుధుల రసజ్ఞ చచ్చువడి బుధ్ధి కృశించి నశించు భాస్కరా !

    రిప్లయితొలగించండి













  7. పద్యం బాగుందండీ!

    ఈ మధ్య మత్తకోకిల ఒకరు అందంగా చెబుతున్నారట విన్నారా?
    రాసి పెంచిరి వాసి లేదయె రావుగారటు చూడుడీ !
    మూసగా పద మెల్ల గుచ్చగ ముగ్ధ పద్యమనేరుగా!
    గోసు గోసుల ప్రాస లెల్లను గోల గోలగ వేసిరే!
    కాసువీసపు వార లెల్లరు కంద పద్యము గట్టిరే !

    రిప్లయితొలగించండి
  8. రాశీ వాసి గణింపగా వలదు వారాశంత ఉప్పేగదా !
    చూసీ చూడక వీడుటే సుఖము తేజోమూర్తిమత్ పాండితీ
    భాషాభూషణులైన పెద్దలు గదా ! వందారు వందారటం
    చీషణ్మాత్రపు మందహాసమిడినన్ యిబ్బందులే రావుగా !

    రిప్లయితొలగించండి


  9. తేజోమూర్తులు పెద్దవారు వలదీ తీరుల్ సుమా మాచనా
    ర్యా! జైకొట్టుడయా జిలేబికి సుతారంబై సరే యంచు మీ
    కైజారుల్ సయి యప్పుడప్పుడు భళా కైవాట మై కొట్టుడీ
    బేజారై పరుగెత్తి పోవలెనయా బెంబేలు గా బామ్మయున్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి