సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

9, అక్టోబర్ 2018, మంగళవారం

ఆనంద నందన వనం


అమ్మవారి గుడికి నటు నిటు నిరువైపు
రెండు నూర్ల మొక్క లిరువుగాగ
నాటి పెంచినాను , నేటి కేడాదయ్యె ,
పది యడుగులు పెరిగి ముదము గూర్చె .

కంటక కీకావరణము
నంటించి రగిల్చి నేలనంత చదునుగా
గుంటలు పూడ్చితి , దోలితి
పంటల కనువయిన మట్టి పలు విడతలుగా .

సిమ్మెంటు స్థంభాలు స్థిరముగా వోయించి
మెష్షుతో ఫెన్సింగు మించి తీర్చి
ఇనుప గేట్లు పెట్టి యిరుగడ గీలించి
నేలలో పైపులు నిగుడ జేసి
బావికి మోటారు పరిఢవింపగ జేసి
నీళ్ళు పట్టేందుకు నియతి జేసి
పాదులు తీయించి పశు యెరువులు వోసి
వివిధ మొక్కలు నాటు విథము నేర్చి

వేప , కానుగ , నేరేడు వృక్షములును
ఉసిరి , మారేడు , బాదము లున్ను , కొన్ని
నిమ్మ , మామిడి , కదళి , దానిమ్మ తరులు
పనసయు , తురాయి , జామయు ఘనత గలుగ .

ఎర్రచందన వృక్షాలు --- నింపు లొలుకు
పూల కస్తూరి , మందారముల రకాలు
పారిజాత , మల్లియ , నందివర్ధనాలు
పలు రకాలు నాటితిని నా భాగ్య మనగ .

బ్రతుకు టింకెన్ని నాళ్ళొ  ? యెవ్వ రెరుగుదురు ?
నేను నాటిన మొక్కలు  నిండుగా  ఫ
లాలు , నీడ లొసగును  హేరాళము గను ,
వంద లాదిగ భావి సంవత్సరములు .
16 వ్యాఖ్యలు: 1. ఆనంద నందన వనపు
  ఫోటో పెట్టండి


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అది అమ్మవారి చిత్రమే .
   తప్పనిసరిగా ,
   ఊరికెళ్ళం గానే .
   మీకు కూడా ప్రణతులు
   మరియు ధన్యవాదములు .

   తొలగించు


 2. ఆనంద నందన వనం
  బానందము నొందినాము ప్రాజ్ఞుడ! రాజా
  మీ నందనవనమగు దే
  వా! నగ జాతకు కదంబ వనముగ రాజా!

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తమ యాశీర్వాద బలము
   న , మాతృ వనము దినదినము నభివృధ్ధి గనున్ ,
   సుమ ఫల తరచాయలతో
   రమణీయం బగుత ! హితుడ ! లలిత వనంబై .

   తొలగించు
 3. "తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ"_/\_

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ప్రతి ప్రణామాలు .
   పై వాక్యాన్ని వివరించండి .

   తొలగించు
  2. మహాలయ అమావాస్య కదా ...

   ప్రేమ,భక్తి,జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు కాని ఏ కర్మకైనా నియమము అవసరము.ఆ నియమములను తెలిపేదే శాస్త్రము. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన కార్యం తప్పక ఫలితాన్నిస్తుంది.

   "తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ"

   మనం చేసే పనిని ఏకాగ్రతతో చేస్తే తప్పక సత్ఫలితం లభిస్తుంది.సకల జనుల శ్రేయస్సు కోసం శాస్త్రం చెప్పినట్లుగా చేస్తే పితృఋణాలు తీరి అంతా మంచి జరిగి శుభాలు కలుగుతాయి.

   తొలగించు
  3. మరొక్కసారి ధన్యవాదములు ,
   వివరాన్నందించి నందుకు .

   తొలగించు
 4. ఆనంద నందన వనం పెంచిన మీకు వందల వందనాలు, మాష్టారూ!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీ అందరి ఆశీర్వాద బలంతో
   అమ్మవారి ఆశీస్సులతో మొక్కలు
   పదడుగుల ఎత్తు పెరిగేయి .
   ఆనందంగా ఉంది .
   ధన్యవాదాలు .

   తొలగించు


 5. మొక్కలు పదడుగులెత్తుకు
  చక్కగ పెరిగేయి యమ్మ చలువగ సభలో
  పెక్కుటముగ మెచ్చిన నా
  చక్కటి మిత్రుల చలువగ సహజ వనంబై !


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ రోజు ఇప్పుడే కొల్హాపూర్ మహలక్ష్మీ అమ్మ వారి
   దర్శనం లభించింది . మనస్సు నిండా అమ్మవారి
   రూపం ప్రతిష్టించుకున్నాను .ఆనందంగా ఉంది .

   తొలగించు
 6. లక్షలు చాలా మందికి ఉంటాయి కానీ
  లక్షల మందిలో ఎంతమందికుంటుందీ సుగుణం ?
  ఓ లక్షణమైన వ్యక్తిగా మీకు వినమ్ర వందనం
  మీ విలక్షణ వ్యక్తిత్వానికి శుభాభినందనం ...

  ఇంచుమించు సంవత్సర కాలం పైబడి మీరు
  రోజులో అధిక భాగం మీ ఊరి గుడిని స్వఖర్చుతో
  లక్షలు వెచ్చించి ఒక నందనవనంగా తీర్చి దిద్దడానికి
  యెంత శ్రమ పడుతున్నారో నాకు తెలుసు. మీ ఈ
  నిస్వార్ధ గుణంతో ఊరికి చేస్తున్న సుకార్యం మిమ్మల్ని
  ఆ దైవకృపకి పాత్రుణ్ణి చేస్తుందని మనసా ఆకాంక్షిస్తూ ...

  మీ మహారాష్ట్ర యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ ...

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీరు వొగడి నంత మింపేమి లేదండి
  నాపయి తమ కున్న చూపు దప్ప ,
  కొలిచి అమ్మ వార్ని కొల్హపూరు విడిచి
  హైద్రబాదు చేరి తయ్య విబుధ !

  ప్రత్యుత్తరంతొలగించు