సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

6, నవంబర్ 2018, మంగళవారం

సత్యభామ నరకాసుర వధ


గరుడుపై నిడుచక్కి గగనాని కెగబ్రాకి
కోపానల జ్వాల కోల జేసి
వింటి నారికి జేర్చి మంటికి మింటికి
కణ కణ విస్ఫులింగాలు రాల
నాధుండు డస్సి విణ్ణాణంబు వీక్షించ
గరుడుండు గువ్వయి కానుపింప
జడిసి సురాసురు లుడిగి భువి బడంగ
బ్రహ్మ మేల్కాంచి విభ్రమము దొడర

కదన రంగాన గల నరకాసురుండు
నీ కొడుకునమ్మ ! చంపొద్దని యడు గిడుచు
ఏడ్చి గీపెట్టి చేతులు మ్రోడ్చు చున్న
చిత్రవధ జేసె ' కొడుకును , చెడును ' - సత్య .

చెడును శిక్షించు పట్టున పుడమి తల్లి
యే వివక్షను చూపలేదే ! విడువక ,
రావణుని చావు పట్టున రమణి సీత
తల్లి పుడమిని తలపించె తాను కూడ .

2 కామెంట్‌లు:

  1. దీపావళి శుభాకాంక్షలు రాజారావు గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారూ ,
      మీకూ దీపావళి శుభాకాంక్షలు లండీ .

      ఇది దీపావళి , నూనె దీపములు వెల్గించండి , భూమాత ది
      వ్య దిదృక్షా సమలంకృతా విభవముల్ వర్థిల్లు , వేవెల్గు లీ
      ను , దిగంతాల మనోఙ్ఞతల్ పరచు , ఙ్ఞానాబ్జాలు దీప్ంచు , సం
      పద లక్ష్ముల్ మన గుమ్మముల్ నిలుచు , నీ పర్వంబు మోదంబగున్ .

      ధరణి పొగచూరి దట్టమై మురికిబారి ,
      జీవములు వోయి , విష పవనావశిష్ట
      కారణమగు టపాసులు కాల్చవద్దు ,
      కోరి చేజేతులా చావు కోరవద్దు .

      ఆనంద తుందిలమ్మయి ,
      మేనులు పులకింప , నుద్యమించి , కుటుంబా
      లూనిక దీపాల నడుమ
      పూని నిలిచి , వెలుగు సిరుల భోగింప నగున్ .

      తొలగించండి