సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, జనవరి 2019, శనివారం

మల్లెలపై పద్యాలు .....



మల్లెలోయమ్మ మల్లెలు , మల్లె విరులు ,
మనసు దోచేటి మల్లెలు , మగువలకును
మగలకును , మనోల్లాస సమాగమంపు
సరసగుళికలు , రమణీయ విరి కళికలు .

మల్లెలపై పద్యావళు
లల్లుడు భాషా మతల్లి కాహ్లాదముగా
నెల్లెడల తెన్గు పరిమళ
మల్లన తగ వెల్లి విరియ నాంధ్ర కవి వరుల్ .

మల్లె పూల బుట్ట  తెల్లని పరిమళ
ముల్లసిల్ల మీకు ముందు గలదు
అల్లి తెలుగు పద్య మల్లె దండలు గ్రుచ్చి
తల్లి మెడను జేర్చ దన్యత గద !

మల్లియలార ! మీకు ప్రతిమానముగా సరివచ్చు పూలు లే
వల్ల ధరాతలంబునను , నా త్రిదివంబునగాని , పార్వతీ
వల్లభుడే వరించు మిము వాసిగ పూజకు , మల్లికార్జునుం
డుల్లము మెచ్చి వేడ్క కురియున్ వరముల్ మిము దాల్చినంతనే .

నల్లని వాల్జడన్ తురిమి , నాణ్యముగా దిగజార్చ , పోడుముల్
మొల్లములై యెసంగు కడు ,  ముగ్ధ మనోహర రూపలాలస
త్సల్లలితోరు రోచిషులు సాధ్యమ , నీ సయిదోడులేక , యీ
ఫుల్ల సరోజ నేత్రలకు ,  పూవన నీవె మనోఙ్ఞ మల్లికా !


20 కామెంట్‌లు:

  1. బుట్ట నిండ మల్లె మొగ్గలు దెచ్చితి
    పరిమళ భరితమయి బ్లాగు విరిసె
    పద్య మొక్క టివ్వ పదిమొగ్గ లిచ్చెద
    ధర సరసము , డబ్బు దస్క మడుగ .

    రిప్లయితొలగించండి
  2. మల్లెల మీద పద్యాలు, పాటలు వ్రాయాలంటే ఆంధ్రులే వ్రాయాలి.
    హైదరాబాద్ లో వాసనలేని మల్లెలు బోలెడు దొరుకుతాయి.
    మల్లెలతో చేసిన అత్తరు మాత్రం దొరుకుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. తెలగాణ వారికి మల్లెల గురించి తెలియదని మీ భావ మా నీహారికగారూ ?


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ, హైదరాబాద్ లో (వాసనలేని) మల్లెలు బోలెడు దొరుకుతాయి అన్నారు కదా ఇంక తెలగాణ వారికి మల్లెల గురించి తెలియదని మీ భావ మా నీహారికగారూ అంటారేమిటీ?

      తొలగించండి


    3. మల్లెల గురించి యాంధ్రుల
      కెల్లలు లేని తెలివిడి సఖీ గలదు సుమా
      చిల్లర తెలగాణ జనుల
      కెల్ల యివి తెలియ తరమకొ కేకే కేకా :)


      జిలేబి

      తొలగించండి
    4. జిలేబీ గారూ, వచ్చీరాని పద్యాలూ తెలిసీతెలియని వ్రాతలూ మానండి దయచేసి. "చిల్లర తెలగాణ జనులు" ఏమిటి? అసందర్భం! ఒకప్పుడు శ్రీశ్రీ గారు "ప్రధాని కాగోరు టాగోరు అయ్యాడు కొందరికి ఐసోరు" అంటూ కవిత్వం గిలికినట్లుంది. అయన గారిలాగే మీరూ సరదాకే అసందర్భంగా మాట్లాడారా ఏమిటి?

      తొలగించండి

    5. శ్యామలీయమ్ వారికి

      చాలా ఆలోచించి వేసిన పదమండి 'చిల్లర '

      ఆలోచించి చూడండి అర్థమవుతుంది



      జిలేబి

      తొలగించండి


  3. రావె!జిలేబి! మల్లె లివి రాగిణి నీకని తెచ్చినాడ! రా
    వే వెల పూజ్యమేను కొనవే సరసమ్ముగ తోటలోనివే!
    కోవెల కెళ్ళి కన్నడికి కోరిక తీరగ మాల వేయగా
    రావె!శుభాంగి! పద్యముల రాశుల కుప్పగ పోయు మమ్మరో !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. హైదరబాదు మల్లె విరులందు సువాసన లుండ వంచు మా
    సోదరి చెప్పినా వినను , చోద్యముగా గయికొందు గాని , భూ
    మ్మీద మరేడగాని కన మిట్టివి , మల్లె పరీమళంబు లీ
    వాదన లేల యొక్క విభవంబుననే వెదజల్లు వాసనల్ .

    రిప్లయితొలగించండి
  5. మల్లియలారా, మాలికలారా, మౌనముగా వున్నారా,
    ‘ ఈ వాదనే ’ విన్నారా 😀?

    రిప్లయితొలగించండి
  6. విన్నకోటవారు ! హన్నన్న మీరున్ను
    నారద రథమెక్కినార యేమి ?
    మల్లె మొగ్గలిత్తు , మాయన్న ! యొక కొంత
    దయను జూపరాదె , జయము మీకు .

    రిప్లయితొలగించండి


  7. మల్లెల వాసన మత్తున
    కల్లాకపటం బెరుగని కబరపు శ్రేష్టుం
    డల్లే పేరొందిన వా
    రల్లా! నారదుడయిరి మరకత జిలేబీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. నీహారిక గారు మల్లెలమీద పాటల ప్రసక్తి తెచ్చారు. పాటంటే నాకు శ్రీరామ సంకీర్తనమే!
    అందుకని సీతారామలక్ష్మణులకు మల్లెలపాట ఒకటి - శ్రీరామసంకీర్తనంలో 533వ సంకీర్తనం చిత్తగించండి.

    మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది
    మల్లెలమాలలు మురిపెముతో మగనికి వేసినది

    కొల్లలుగాను మాలలు తెచ్చి కోమలి వేయగను
    నల్లనివాడు రాముని గళము నాతిమహిమ చేత
    తెల్లగ నగుట లెస్సగ చూచి దేవర లక్ష్మణుడు
    మెల్లగ నగియె ముసిముసి గాను మిగుల సంతసించి

    కొన్ని మాలలు రాముడు తీసి కోమలి మెడ నుంచ
    సన్నసన్నని సిగ్గులు తోచ జానకి యాత్మేశు
    మన్నన కెంతొ మురియుచు నుండ మరిది లక్ష్మణుండు
    అన్నావదినెల సరసము జూచి యమిత ముదమునందె

    దండ లన్నియు మనమే గొనుట ధర్మము కాదనుచు
    దండి మగడు శ్రీరాము డొక్కటి తమ్ముని కందించె
    వెండి సీతమ్మయు నొక్కటి ప్రీతి మరది కిచ్చె
    పండెను నా బ్రతుకని తనతలపై నిడుకొనె నతడు

    శ్యామలీయం బ్లాగులో ఈసంకీర్తనం లింక్ https://syamaliyam.blogspot.com/2019/01/blog-post_86.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. >>>పద్య మొక్క టివ్వ పదిమొగ్గ లిచ్చెద>>>>

      రమ్యమైన ఈ కీర్తనకి ఎన్ని మొగ్గలిస్తారో చెప్పండి.
      హైదరాబాద్ మల్లె మొగ్గలు మాత్రం వద్దే వద్దు...

      తలపులు కలుపులైనా
      కలుపుల తలపులైనా
      కనుతలుపులు మూసేవరకూ
      తలొంపులు తెచ్చునులే !

      తొలగించండి
    2. మల్లె మొగ్గలన్ని మాధవు కర్పించి
      వాటి జన్మ సఫల వంత మగుట
      కీర్తన గురి యించె కీర్తించితిని మీరు
      చదువలేద పద్య మిదిగొ క్రింద .

      మీ కవిత ఆధ్యాత్మికతను అందిపుచ్చుకున్నట్లుంది.
      అదేదో విస్పష్టం చేస్తే ఆనందిద్దాం .

      తొలగించండి
  9. తల్లి సీతమ్మ వ్రేలుల నల్లబడి , యి
    నకుల విభు రాఘవు గళమున మురిసి , ధవు
    చేత సతికి కైసేయు విశేషభాగ్య
    మొందె నీమల్లె లేజన్మపు సఫలమ్మొ !

    రిప్లయితొలగించండి
  10. 533వ సంకీర్తనంగా వచ్చిన మల్లెదండల పాటకు అనుసంధానంగా 534వ సంకీర్తనం వెలువడింది. ఇది సీతమ్మ శివపూజను గురించినది. చిత్తగించండి.

    మల్లెపూలతో శివుని మనసార పూజింప
    తల్లి సీతమ్మకు తహతహ కలిగె

    చెలులార చెలులార శివదేవుని మల్లెలతో
    కొలచెదము కొల్లలుగ కోసుకొని రండన్నది
    కలనైన మల్లెలను కనీవినీ యెరుగమని
    చెలులందరు పలుకగా చింతించ దొడగినది

    తెలిసి వదినమ్మ చింత తెచ్చి చూపె సౌమిత్రి
    యలనాడు సీతారాము లొసంగిన దండలు
    చెలులు రిచ్చపడి రవి చెక్కు చెదర కున్నవని
    పలికె నతడు దివ్యదంపతుల మహిమచే నని

    హనుమా ఓ హనుమా యని పిలచె సీతమ్మ
    హనుమ వచ్చి యాజ్ఞగొని జనస్థానమున కేగి
    కొనివచ్చెను విరబూచిన గుబురుమల్లె పొదలను
    వనిత సీతమ్మచేసె తనివారగ శివపూజ

    ఈ సంకీర్తనం శ్యామలీయం బ్లాగులో కూడా చూడవచ్చును. లింక్ https://syamaliyam.blogspot.com/2019/01/blog-post_79.html

    రిప్లయితొలగించండి
  11. మల్లన్న పూజ కోసం
    బల్లన హనుమన్న నంపి యవనిజ పతితో
    ఉల్లమలర శివదీక్షను
    చెల్లించెను మల్లెపూలు శ్రేష్టమని కదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతే కదండీ మరి. గూఢార్థం చెప్పేస్తున్నాను. అప్పటివరకూ జనస్థానంలో అడవిపూలుగా ఉన్న మల్లెలు నాటినుండీ నాగరీకజనావాసాల్లోనికి ప్రశస్తికి వచ్చినవన్న అంతరార్థం ఈపాటయందు నిక్షిప్తం.

      తొలగించండి