సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

24, ఏప్రిల్ 2019, బుధవారం

కోరి ప్రేమించి ....



కోరి ప్రేమించి పెండ్లాడి క్రొత్త జంట
పురము వీడ్వడి వేరు కాపురము బెట్టె
నంతలో చుక్కతెగి పడ్డ యట్లు దిగిరి
బండి గట్టుక వచ్చిన బంధు జనులు

వరుని వైపున వారని వధువు తలచె
వధువు వైపున వారని వరుడు తలచె
వస్తు చయముల సమకూర్చ వరుని వంతు
వండి వార్చంగ వడ్డించ వనిత వంతు

ఇష్ట మైనట్టి వన్ని వండించు కొనుచు
తినుచు త్రాగుచు బంధువుల్ దిరుగు చుండ
తీరికే లేదు పాపము తినగ ద్రావ
కూడి తలపోయ నింకేడ? క్రొత్త జంట

తిష్ట వేసిన బంధుల తీరు జూచి
చేరి తమలోన జంట చర్చించు కొనగ
తమకు వారికి నెట్టి బంధమ్ము లేమి
యెరిగి యడిగిరి , వారు జంకేమి లేక

‘ అయ్యొ! మా బండి చక్రాల కొయ్య గాని
అట్టె మీయింటి ముందున్న చెట్టు గాని
బదరికా వృక్ష సంబంధ మగుట, మనము
బాదరాయణ సంబంధ బంధువులము ‘

అనిరి, నివ్వెర పోయిరి వినిన జంట ,
పరగ నేబంధములు లేని బంధమునకు
చేరి యీమాట భూమి ప్రసిధ్ది గాంచె
బాదరాయణ సంబంధ బంధ మనుట
(బదరికా వృక్షము = రేగు చెట్టు)

2 కామెంట్‌లు:

  1. బ్లాగర్ల బాదరాయణ సంబంధాలకి కంప్యుటర్, నెట్, బ్రాడ్ బాండ్, మౌస్ సరిపోతాయంటారా? ....... మహా

    రిప్లయితొలగించండి
  2. లేదు , లేదు సార్ ,
    బోడిగుండ్లకు - మోకాళ్ల కు ముడేసి మాటాడగగలిగే
    అనుచిత , అసంగత , అసంబధ్ధ , అమానుష ,
    అసమాన వాచాలతలు కూడా మేల్తరమైన సామగ్రిగా
    ఇచట భేషుగ్గా భావించ బడు చున్నవి .
    సుజన సృజన బ్లాగు మీకు సాదరస్వాగతం చెబుతున్నది .
    ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి