సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, ఫిబ్రవరి 2020, ఆదివారం

మాటలా ? చేతలా ?


మాటలను కూర్చి రచనల మాయజేయు
కవులు ! , పండొలిచి ప్రసంగ విథ వివిధ
భాగవత సంవిధ ప్రవచనాగమములు
సేయు బుధులు ! , మీ తీరులు చిత్త మలరు .

వృక్షో రక్షతి యందురె !
అక్షయముగ నొక్క మొక్క నల నాటి కడున్
రక్షించి పెంచి యటుపై
వీక్షింపుడు చెట్టు శోభ  విభవము దెలియున్ .

మాటలకే పరిమితమై
పాటింపరు చేతలు , పరిపాటి యిదే , యీ
నోటి పసగాళ్ళ తీరని ,
మోటుగ మాటాడ , పడుట , మోమాటేలా ?

ధర్మకార్య నిరతి మర్మమ్ము దెలిసిన
మాట కంటె చేత మహిత మెపుడు ,
శుష్కవాక్య ఝరులు శూన్య హస్త చయము
గాని ,  యిలను , పనికి రాని వెపుడు .

ఒక్క చేతి మీద నోలి రెండొందలు
మొక్కలు తగ నాటి నిక్కువముగ
రక్షణ నొనగూర్చి  రమణమై కడుపెంచి
పెద్ద జేసినాడ తద్దయు కడు .

నేడవి యిరవై యడుగులు
శోడష కళ లూని పెరిగి శుంభద్యశమై
కూడి నన పూప పిందెల
పోడిమితో కాపుకొచ్చె  మోదము గూర్చెన్ .

అమ్మ గుడికి శోభ లలరారె పచ్చంగ
దర్శనీయ మగుచు తరులు లతలు ,
జన్మ ధన్యమయ్యె ,  జనని పోలేరమ్మ
కృపలు కూడ నాకు సఫలమగుట .

10 కామెంట్‌లు:

  1. మంచి చేతలే శ్రేష్టం కదా. మీరది నిరూపిస్తున్నారు.
    పెరిగిన తరులు, లతల ఫొటోలు కూడా పెడితే బాగుంటుంది కదా మాస్టారూ?

    రిప్లయితొలగించండి
  2. పెద్దలు శ్రీనరసింహరావుగారికి నమస్సులు .
    ఇక్కడ నేను ఒహ మేథావిని అన్నట్లుగా
    టాం టాం వేసుకోవడానికి కాదు , ఆహా
    వోహో అని కవితాలతల కల్లుకుపోయే కవి
    వృషభులు కాస్తయినా బుధ్ధి తెచ్చుకుని కర్తవ్యో
    న్ముఖులగుదురని . ఐనా .....
    ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?
    దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?
    మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
    అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!.
    అనే ధోరణి మారదుగా .
    ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  3. చెప్పినది ఆచరించే వారు ఎప్పుడూ అరుదే కదా మాస్టారూ. అటువంటి వారి గురించి ఆలోచించడం అనవసరం.

    మీరు నాలుగైదైనా ఫొటోలు పెట్టండి, చూసి ఆనందిస్తాం.

    రిప్లయితొలగించండి
  4. దేహ మున్నంత వట్టు నా యూహ లెల్ల
    అర్థులకు దగ నావల్ల నగు తెఱగున
    సాయ మందించ దిరుగును , సతము హృదియు
    దైవ , ధార్మిక కర్మల దవిలి సాగు .

    ఇంకో సంకల్పం తలపుదాటి , ప్రయత్నంలో పరుగెడు
    తోంది . అమ్మగుడి పునర్ణిర్మాణ సేవా
    క్రతువది . 80యేళ్ళనాడు తెల్లసున్నంతో నిర్మాణం .
    ప్రస్తుతం మొత్తం గ్రానైట్ తో నిర్మించబోతున్నాం .
    అమ్మదే సంకల్పం .

    రిప్లయితొలగించండి


  5. నారదా! ఎక్కడున్నావయ్యా :)


    నాటితి చెట్టుల నేనని
    సాటి కలరకో యటంచు చాటింపుల వే
    లా? టాంటాంలేల విదుర
    మేటిగ కర్తవ్యమిద్ది మిలనపు శ్రమగాన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. మాటలాడువారుగలరు మత్తుదేల్చ!
    మంచి చేతలె నిక్కమై మానవులకు
    శ్రేష్టతరమగు; స్వచ్ఛత, చేవ కలిగి
    మీరు మార్గదర్శకులు సుమీ యువతకు


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. కవి వృషభులున్ను తెరువంగ కన్నుల తమ
    బాధ్యతల పంచు కొనగ వివరము గాను
    వ్రాసి నాడ నరసరాయ పండిన తల
    లలు కదా కొంతయు పలుకుల నరయుదుర?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. అమ్మయె మూలంబగు నా
    దమ్మును చేర్చి యిటువంటి తరుణములో తే
    జమ్మును పుంజుకొనగ కా
    ర్యమ్ములను భుజముల పయి నిడన్ రాధనమై

    జిలేబి

    రిప్లయితొలగించండి