సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, మే 2020, శుక్రవారం

అమృతఫలాలు .....


అమృత ఫలాలు
--------------------
అమృతఫలాలివి , వీటిని
సుమశరు డింద్రుని వనమున చూచి , పుడమికిన్
రమణి రతీదేవి కొఱకు ,
శ్రమపడి కొనితెచ్చె రాగ రంజితు డగుచున్ .

రుచికి పడి , రతీ దేవి వ
లచి తన వనమున యమృతఫలమ్మును విత్తెన్ ,
సచిపతి కిష్ట ఫలదమగు
యచలము మదనాలి యింట నమరెను తరువై

వలరేని చెలిమికాడగు
వలపు వసంతుం డచటికి వచ్చెను , రాగా ,
కలయో మాయో తెలియదు ,
విలసిల్లెను చెట్టు పూప పిందె ఫలాలన్ .

మావి పండు తిన్న మన్మథ పతిసతుల్
మదన మోహ ఝరుల మరులు గొనిరి ,
మధుర ఫలము మహిమ మదనాయితమ్మను
నిజము తెలిసె , దివిజ రుజయు దెలిసె .

భూలోక మంత మావుల
జాలము నాటించి చిత్తజాతుడు , మిథునా
లోల సరాగాలాలస
లీలల పండించె , సృష్టి లీల లివేగా .

7 కామెంట్‌లు:

  1. రాజావారు
    పై చెఱుకు రసాల పళ్ళలా పద్యాలూ ఎంతబావున్నాయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆమ్ రస్ బన్గయా షుగర్కేన్ జ్యూస్ :)

      తొలగించండి
    2. శర్మగారూ , నమస్సులు , ధన్యవాదములు .

      దివిజు లమృత ఫలమ్మని తినిరి , ఋషులు
      మధుర ఫలమని జుఱ్ఱిరి , మనుజు లకట
      మరి మరి భుజియింత్రుగద ! యీ మదన ఫలము
      సారు కిష్టమేగద ! యీ రసాల ఫలము .

      తొలగించండి
    3. జిలేబీ సారు ! నమస్సులు ,ధన్యవాదములు .

      తమరేమంటిరొ తెలియను ,
      కమనీయం బెపుడు తమరి కామెంట్ , అవునూ ,
      అమృత ఫల రసమున షుగరు
      అమరున చెడగొట్టు గాని , అమృతము రుచిన్ .

      తొలగించండి
  2. వేసవి అంటే మామిడిపళ్ళే కదండీ, అందులోనూ చూడగానే చెప్పేరకాలు,బహు పసందైనవి,కొత్తపల్లి కొబ్బరి,చెఱుకు రసాలు (ఫోటోలోవి పెద్ద రసాలు)బంగినపల్లి,పంచదార కలశ, దేశవాళీ. ఫోటో పెట్టి ఊరించేసేరు :)

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది మీ పద్యం మామిడి పళ్లంటే చాలా ఇష్టం నాకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బహుకాలమయ్యె, మీరిటు
      విహితా! చనుదెంచి, నాటి విమలమతులు చా
      ల హితుల్, బ్లాగ్ నిష్క్రమణన్,
      అహితంబై కళలుదప్పె నంతయు నిచటన్ .

      తొలగించండి