సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, జూన్ 2012, సోమవారం

ఆశీస్సు లందిద్దాం లక్ష్మికి ... (పాఠశాల కథలు)


ఏమ్మా ! లక్ష్మీ   అన్నాడు పలకరింపుగా ప్రథానోపాధ్యాయుడు, వ్రాసుకొంటున్న వాడల్లా తల పైకెత్తి  గదిలోకి వచ్చిన లక్ష్మి నుద్దేశించి

సమాధానంగా లక్ష్మి కళ్ళ నిండా నీళ్ళు

                                                                ******************

అది ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం . అందులోనే జూనియర్ కళాశాల కూడా నడుస్తోంది . అప్పుడు లక్ష్మి జూనియర్ ఇంటర్ . ఆ పాఠశాలలోనే పది చదివింది . లక్ష్మి ఆవూరి అరుంధతీయ వాడ అమ్మాయి . తల్లి దండ్రులకు అనారోగ్యం . అక్కలిద్దరకూ పెండ్లిండ్లయి వెళ్ళిపోయారు . పదవ తరగతి పరీక్ష తప్పింది . ఇంగ్లీష్ సబ్జెక్ట్ మిగిలి పోయింది . మళ్ళీ మళ్ళీ రాసింది . తన వల్లకాలేదు . ఇల్లు గడవడానికి కూలి పనులకు వెళ్ళేది .

పరీక్ష ఫీజు కట్టడం – పిలిపించడం ప్రథానోపాధ్యాయులకు షరా మామూలయ్యింది . ఆ మార్చిలో కూడా పరీక్ష ఫీజు కట్టేడు .  పరాయి ఊళ్లో కూలి పనులకు పోయి ఉంటే పిలిపించి , వారం రోజులు కూచోబెట్టి పరీక్షకు ప్రిపేర్ చేసి పంపించాడు . లక్ష్మి ఎట్టకేలకు పది పాసయ్యింది .

జూన్లో విద్యాలయాలు ప్రారంభించగానే – పిలిపించి ఫీజు కట్టి ఇంటర్ లో చేర్పించినాడు . పుస్తకాలు వగైరా ఏర్పాటు చేసినాడు .

                                                            *********************

అరెరే !   ఏమిటా కన్నీళ్ళు? కళ్లు తుడుచుకొని విషయం చెప్పు అనునయించాడు ప్రథానోపాధ్యాయుడు . 

రోజూ కాలేజికి రావడం వల్ల ఆదివారం ఒక్కరోజు మాత్రమే కూలి కెల్తున్నాను . మా నాయనకు రెండొందలు వృధ్ధాప్యపు పింఛను ఇస్తారు . వాటితో గడవడం కష్టంగా ఉంది . ప్రిన్సిపాల్ కు చెప్పండి సార్  అంది లక్ష్మి సంకోచంగా

అంటే వారంలో ఆదివారం కాకుండా ఇంకో రెండు రోజులు కూలి కెళ్ళే అవకాశం కోసమన్నమాట . 

అరెరే వీళ్ళ పరిస్థితి తెలిసీ లక్ష్మిని ఇంటరలో చేర్పించానే, పొరపాటు చేశానా !  అన్పించింది ప్రథానోపాధ్యాయులుకు లిప్తకాలం .

కానే కాదు , తాను చేసింది కరక్టే .  అయితే పరిస్థితిని అధిగమించడమెలా ? ‘

లక్ష్మీ !  ఊళ్ళో రేషన్ ఇచ్చే ముందురా ,  ఏదో ఒక మార్గం చూద్దాం , కాలేజీకి మాత్రం మానొద్దు ,  హాజరు కాక పోతే పాఠాలు అర్థం కావు , ఎలాంటి అవసరమైనా నా వద్దకురా  అంటూ తక్షణ కుటుంబ అవసరాలకు గాను కొంత డబ్బిచ్చి పంపించాడు .

                                                       **************************

ప్రిన్సిపాల్ , లెక్చరర్ల సహకారంతో ఇంటర్ దగ్విజయంగా పూర్తి చేసింది లక్ష్మి .

ప్రథానోపాధ్యాయుడు T.T.C (D.ed ) కు అప్లై చేయించాడు .

టీచర్స్ ట్రయినింగ్ పూర్తయింది .

ఆశ్చర్యంగా ఉందా ?

లక్ష్మి ప్పుడు చదువులమ్మ !

పదిమందికి చదువు చెప్పే పంతులమ్మ .

ఆశీస్సులందిద్దాం లక్ష్మికి .


16 వ్యాఖ్యలు:

 1. మనసంతా ఉద్వేగంతో , ఆనందంతో నిండిందండీ , ఈ పోస్ట్ చదివింతర్వాత ...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రొత్సహించి పై చదువులు చదివించిన మాష్టారు గారికి, ఎన్నో కష్టాలు తట్టుకుని చదువుకు, తన బ్రతుకును చక్కదిద్దుకోవటమే కాక, ఎంతో మందికి విధ్యాదానం చేస్తున్న లక్ష్మికి నా వందనం!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. స్కూల్లో చదువు చెప్పగానే బాధ్యత తీరిపోయిందనుకోకుండా లక్ష్మి జీవితానికో దారి చూపించిన మాష్టారికి అభివందనాలు, ఎంత కష్టమైనా ధైర్యంగా నిలబడి గమ్యం చేరుకున్న లక్ష్మికి అభిన౦దనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. జలతారు వెన్నెల గారూ ,
  మీ సహృదయ స్పందనకు అభినందనలు ,
  సమాజంలో లక్ష్మి వంటి వాళ్ళు అనేక మంది . వాళ్ళళ్ళో సాధ్యమైనంత మందికి మార్గ దర్శనం చేయడం , సహాయ - సహకారాలందించడం చేయాలనేదే ఆకాంక్ష .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. జ్యోతిర్మయి గారూ ,
  నిండు హృదయంతో మీ రందించిన అభినందనలకు కృతఙ్ఞతలు .
  గవర్ణమెంట్ హైస్కూల్ ప్రథానోపాధ్యాయుడుగా నేను సమాజంతో మమేకమై దర్శించి నావంతు బాధ్యతగా భావించి నిర్వర్తించిన ఘట్టాలే పాఠశాల కథలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మట్టి లో మాణిక్యాలంటే ఇలా లక్ష్మి లా ఉంటారేమో అండీ....!!
  ఆమె ని ప్రోత్సహించిన ఉపాధ్యాయ బృందానికి , లక్ష్మి కి ఎప్పటికీ మంచే జరగాలని
  కోరుకుంటూ...అభినందనలు లక్ష్మి గారికి ....
  అందరిని ఆలోచింపచేసే పోస్ట్.ధన్యవాదములు మీకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. స్వతహాగా లక్ష్మి చదువులో అంత హుషారైన అమ్మాయి కాదు . 'పది' రెండు మూడు సార్లు తప్పడంతో చదువుకు బ్రేక్ పడి పరాయి ఊళ్లో కూలి చేసు కుంటూ ఉంది -
  తాను టీచరౌతానని కలలో కూడా ఊహించి ఉండదు -
  వెన్నంటి మార్గ దర్శనం చేసి - పది - ఇంటర్ - టి.టి.సి - ఇలా నిచ్చెన లెక్కించేడు ప్రథానోపాధ్యాయుడు . ఇలా మనకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుందీ కథ -
  స్పందించిన సీత హృదయ నవనీతానికి ధన్యవాదములు .....

  ప్రత్యుత్తరంతొలగించు
 8. స్పూర్తికరమైన పోస్ట్. మట్టిలో ఉన్న మణులను వెలుగులోకి తేవాలంటే..సహృదయుల సహకారం చాలా అవసరం. భాద్యతాయుతమైన ఉద్యోగ నిర్వహణ తో పాటు మానవతా హృదయంతో.. స్పందించి సహాయ సహకారాలు అందించే ఉపాద్యాయ బృందానికి,ప్రదానోపాధ్యుల వారికి మనసైన అభినందనలు.
  లక్ష్మికి అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. వనజ వనమాలి గారూ ,
  సామాజిక స్పృహ ఉండాలి కాని -
  సమాజంలో ఏసమస్యా మనల్ని మించిపోదు -
  కుటుంబం మీద బాధ్యతలు నిర్వర్తిస్తూనే , సమాజ బాధ్యతలు కూడా అందిపుచ్చుకోవాలి -
  పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించ గలిగేది అప్పుడే -
  నేను ప్రధానోపాధ్యాయులుగా ఆ ఆనందాన్ని అనుభవింప గలిగాను -
  స్పూర్తి దాయకమైన మీ స్పందనలకు ధన్యవాదములు .....

  ప్రత్యుత్తరంతొలగించు
 10. The tree గారూ ,
  ముప్పై యెనిమిదేళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో నేననుభవించిన ఆనందము అనంతం -
  నా దగ్గర చదువుకొన్న విద్యార్థులు ,నాతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు ప్రభావితులై సమాజంపై అవగాహన ఏర్పరచుకొని తమవంతు దోహద పడ్డారు -
  ఉపాథ్యాయుడే గనక పూనుకుంటే సాధించ రానిది ఉండదు -
  పోస్టు చదివి అంతరంగంలో స్పందించిన మీకు ధన్యవాదములు .....

  ప్రత్యుత్తరంతొలగించు
 11. స్ఫూర్తి దాయకమైన విషయం చెప్పారు...
  లక్ష్మి కి ఆశీస్సులు...అభినందనలు...
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 12. శ్రీనివాస్ గారూ ,
  మీ సహృదయ స్పందనకు ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 13. నా విద్యార్థినులను పై చదువులు చదవమని పదేపదే చెబుతుంటాను.మీ కృషి ఒక జీవితానికి వెలుగు నింపింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. తన వద్ద చదువు చున్న విద్యార్థుల కుటుంబ , సామాజిక స్థితి గతులను తెలుసు కోవడం , వాళ్ళ అభివృద్దికి మార్గదర్శనం చేయడం కూడా ఉపాధ్యాయుడు చేయగలడు . ధన్యవాదములు రవిశేఖర్ గారూ .

  ప్రత్యుత్తరంతొలగించు