సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, డిసెంబర్ 2020, శనివారం

తిక్కయజ్వ

 


భారతాంధ్రీకరణ మహాభాగుడును , హ

రిహరనాధదేవుని రూపురేఖలు రచించి ,

శైవ  వైష్ణవుల  కొఱకు , సామరస్య

తెఱగు జూపిన సంస్కర్త , తిక్కయజ్వ .


11, డిసెంబర్ 2020, శుక్రవారం

తరు పరిష్వంగము

 



రామా ! రఘువీర ! పరం

ధామా ! నీ డెంద మెంత దావానలమై

భూమిసుత కోస మేడ్చెనొ !

స్వామీ ! నిన్ జూడ , కండ్లు భాష్పము రాల్చెన్ .


విలపించు జగన్నాధుని

అలసట బాపంగ శాఖ లల్లనవీచెన్

అలరుల పరిమళ మద్దుచు

మలయపవన సేవజేసి మ్రాను తరించెన్ .


శ్రీరామ పరిష్వంగం

బారయ సీతమ్మకున్ను పవనసుతునికిన్

నేరుగ లభించె , చెట్టిది

కోరినదో లేదొగాని గొప్పగ దొరికెన్ .


మాధవుని పాదదర్శన

సాధన భాగ్యంబుగోరు సకలర్షులకున్

శోధనకందని కౌగిలి

శ్రీధవు డీ తరువు కొసగె శ్రీభాగ్యంబుల్   .




వాత్సల్యమూర్తికి వందనం

 


అమ్మా యని నోరారా

ఇమ్ముగ భజియించిన , మన ఈప్సితముల నా

యమ్మ యొసంగును , మనపయి

అమ్మకు వాత్సల్యమధిక , మమ్మకు ప్రణతుల్ 🙏 .

10, డిసెంబర్ 2020, గురువారం

స్వఛ్ఛ ప్రకృతి

 


చెన్నుందామెరలోని స్వఛ్ఛతలు  ఈస్త్రీయందు గన్పట్టు , సం

పన్నుల్ బంగరు భూషణాలు ధరియింపన్ రాని విణ్ణానపున్

వన్నెల్ , ఆ ప్రకృతీ సమీపగత జీవావాసులందుండుటల్

ఎన్నంగానగు , నీమెకున్ గొలనుకు న్నేవో దోచు సాపత్యముల్ .

మహానటి

 



ఈ మహానటి సాటి రా నెవరు గలరు

హేమ మకుటమ్మ దొడిగె కళామతల్లి

తెలుగుల సినీజగత్తు వో వెలుగు వెలిగె

అరయ సావిత్రివల్లనే ననగ జెల్లు .

ఇదీ మన కథే నట !

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా

మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు. 

సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు.  అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.

*అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).*

*ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క  నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు  - ఎక్కే గుమ్మం  దిగే గుమ్మం  అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే  అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).*

*చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి  జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే  - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.*

*అందుకే:*

*మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.*

*ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా   మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.*

*ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ* *కాపలాదారుగా మారిపోయి*

*వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ,  కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.*

*ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ  ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.*

*"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".*

*మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని.*

 

9, డిసెంబర్ 2020, బుధవారం

జననికి ప్రణతుల్ 🙏 .

 


ఘనముగ భూమికి బుట్టెను ,

జనకుని గారాలపట్టి స్థానము గనియెన్ ,

యినకుల తిలకుని బొందెను ,

జనజగతికి తల్లియయ్యె , జననికి ప్రణతుల్ 🙏 .

8, డిసెంబర్ 2020, మంగళవారం

అచ్చమైన పొడుపు కథ.!

 

ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 

పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

.

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

 జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

6, డిసెంబర్ 2020, ఆదివారం

చూపు దిప్పుకోనగున .....

 


చూపు దిప్పుకోనగున ఈశోభనంపు

మాధురీ మనోఙ్ఞతలకు ,  మదను డలిగి

పుడమి సరసుల డెందాల కడిది జీల్చ

వింటి కెక్కుబెట్టిన వాడి విశిఖ మేమొ !