సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

20, నవంబర్ 2020, శుక్రవారం

కైమోడ్పులు

 


పదపడి కళ్ళెముంభిగిచి పళ్ళకు మధ్యన , రెండుచేతులన్

బొదివి మహోగ్ర ఖడ్గములు , మూపుకు బిడ్డడి గట్టి , స్వారియై

పది పదునైదు రక్షకులు ప్రక్కగమించగ  , రౌద్రమూర్తియై

కదిలెను ఝాన్సిలక్ష్మి యలుకన్ దునుమాడగ నాంగ్లసేనలన్ .


కత్తుల రెండుచేతులను కంఠములన్ తెగగోసె శత్రులన్

బిత్తరచూపులన్ రిపులు భీతిలి రాయమ వీరవిక్రమో

న్మత్తత జూచి , మోసపు సమాయతనంబున నొంటె సైన్యమున్

క్రొత్తగ దింపి వెన్క కడ కూడి తటాలున దాడిసేయగా


కలవరపాటునంద , వెనుకన్ ఛురకత్తియ వీపులోదిగెన్

నెలతకు , వెంటవెంటనె ఘణిల్లున గుండుదిగెన్ , హయమ్ము వె

ల్వెలవడె , నింతలో గదిసి పెల్లుగ శత్రులు కత్తివ్రేటులన్

దలగిరి శీర్షమున్, చివరిదాకను పోరెను నెత్తురోడుచున్ .


ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామ యోధురాలు

రాణి ఝాన్సిలక్ష్మీయె , చిరస్మరణగ

భరత భూమి దలచు దేశభక్తురాలు

భక్తి  కైమోడ్చి ప్రణమిల్లి  🙏 ప్రణతు లిడుదు .

19, నవంబర్ 2020, గురువారం

ఈ రోజు .....

 

ఈరోజు అంతర్జాతీయ 'పురుష' దినోత్సవం అట !

ఐనా ,


అమ్మే తొలిప్రాధాన్యత ,

ఇమ్ముగ పరమేశ్వరుడు మహేశ్వరి పిదపే ,

నమ్మిన నిజమిది జగతిన్ ,

అమ్మకె పాదాభివందనము 🙏 లు యెపుడున్ .

నేడు అలివేలు మంగ జన్మదినం

 


తిరుచానూరున పద్మసారసభవా,దేవీ,మహాలక్ష్మి, మం

గ,రమావల్లభువేంకటేశ్వరుని తాన్కంజోత్పలత్పూజలన్

వరమాలల్ దిగవైచి కోరివలచెన్ వామాక్షి , నే డా పరే

శ్వరి జన్మించినరోజు మ్రొక్కులిడుచున్ ప్రార్ధింతు 🙏 కైమోడ్పులన్ .

16, నవంబర్ 2020, సోమవారం

శివుడు .....

 


మట్టి ప్రమిద దెచ్చి మహదేవు నర్చించి

ఆవు నెయ్యి వోసి అభవు నెదుట 

వత్తి వేసి శివుని వాకిట ప్రతి రోజు

దీప మిడుడు , జన్మ తేజరిల్లు .


మట్టి ప్రమిద లోన మరి కాను పించడు

నూనె లోన గనగ నోప మతని

ప్రత్తి లోను దాని వత్తిలో గనరాని

శివుడు దివ్వె లోన చేరియుండు


అరుదైన అలంకారం .....

 


పండరి పురంలో  శివాజీ సమర్పించిన అరుదైన

ఆభరణాలతో రుక్మిణీ అమ్మవారి అపురూప వైభవం

              -----

కాసులపేరులు కంఠహారాలతో

మెరయు విఠ్ఠలుని రుక్మిణిని గనుడు

మరకత మణిమయ మంగళాభరణాల

కాంతమత్ మూర్తి శ్రీకాంత గనుడు

కటివలయ విలాస కమనీయ రత్నాభ

రణ హేలల వెలుంగు రమణి గనుడు

పసిడిపచ్చల భూషణసిరుల కరపాద

కమనీయమూర్తి శ్రీకమల గనుడు


ఛత్రపతి శివాజి సభక్తి సమధికముగ

తగ సమర్పించినవి యరుదైన నగలు

కనులు చాలవు రుక్మిణీ ఘనవిభవము

చూడ సర్వాంగభూషిత  శోభనములు .

15, నవంబర్ 2020, ఆదివారం

ఫలముల్ మెక్కెడివారు .....



 


ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాదక్రియాలోలురై

పలుమా ఱమ్మధురత్వము న్నుతుల సంభావింతురేగాని, త

త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, నట్లే రమా

కలితు ల్భోగములన్‌ భుజించుచు నినుం గన్నెత్తియుంజూతురే?

     ----- కవికోకిల దువ్వూరు . రామిరెడ్డి

               కృషీవలుడు నుండి