2, జనవరి 2026, శుక్రవారం

ముంగురుల్ జారె .....

 


ముంగురుల్ జారె , జాజిపూల్ మూర దిగియె
మోముపై సిగ్గు దొంతర పోల్చి చూడ
ఇంతి యంగజు కేళికా హేల నుండి
లేచి వచ్చిన విశ్రాంతి లీల దెలియు .


కుల్లూరు పోలేరు తల్లి


 


మణికిరీట ప్రభామయ , మయూఖ రుచిర ,

దివ్యమంగళ రూపు తేజరిల్ల ,

వజ్రాలు పొదిగిన వడ్డాణము మెరయ ,

కాలి యందెలు ఘల్లు ఘల్లురనగ ,

పసుపు గంధపు పూతపై , కుంకుమంబద్ది

ఫాలభాగమ్ము శోభనము గూర్చ ,


లేచి , ననుజూచి , వచ్చి , పోలేరు తల్లి

బిడ్డడా ! రార , యని బిల్చు ప్రేమతోడ ,

బ్రమయొ , పిచ్చియొ గానిండు ,  ప్రతిదినంబు

అమ్మవాకిట జేరి ప్రణామ మిడగ .

31, డిసెంబర్ 2025, బుధవారం

నూతన (2026)ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు

 



ఆయు రారోగ్య భాగ్య సౌఖ్యాల నిచ్చి
నవ వసంతంబు మిమ్ముల నడుపు గాత !
నవ నవోన్మేష సంతోష యవనికలకు
బాట లిడుగాక ! క్రొత్త సంవత్సరమ్ము  .

'మన కుగాది గదా ! ఇది మనది కాదు'
అనుచు కొందరు నిరసింత్రు , అవని యంత
నే డనుసరించున దిదియె , నీవు నేను
పదుగు రేగెడు బాటలో పడుట మేలు .


28, డిసెంబర్ 2025, ఆదివారం

నేటి మా కుల్లూరు


ఒక నాటి కుల్లూరి యున్నతుల్ స్మరియింప

గర్వ ముప్పొంగు సాగరము రీతి

సు విశాలమై , కళల్ శోభించు పెంకుటిళ్ళు

ఇంటి ముంగట నొప్పు   జంటరుగులు

ఎత్తుగా ప్రహరీలు ఇంపుగా ముంగిళ్ళు

ఏపుగా పెరిగిన వేప చెట్లు

ప్రతి యింటి వెనుకల బావియు , వంటిల్లు

మధ్యన హాలు ధీమమ్ము గదుర


అన్ని వసతులు గల్గి సంపన్న మై , యొ

నర్చు వైభవోపేత ఘనతలు ' నాడు '

కటకటా ! కనంగ , నిటు నా కళ్ళ ముందె

రూపు గోల్పోయె , నేమిటీ లోప మకట !


ఏరీ మా పెద్ద తలలు

ఏరీ మా చెలిమికాండ్రు , ఏమై పోయెన్

ఊరి మహోన్నత శోభలు ?

ఊరంతా ఘన నిశీధి  , ఊరా కాడా ?


పటుతర గృహాలు కూలెన్

ఎటు చూచిన శిధిల కుడ్య హేలె కనబడున్

మటు మాయ మాయె వెలుగులు

పటిమలు గోల్పోయె ఊరి ప్రాభవమెల్లన్ 


రూపాయి కనగ నోచని

మా పల్లెల లోన ' నాడు ' మా ఊరి గృహాల్

ప్రాపుగ వందలు వేలుగ

రూపాయిలు గలిగి వెలిగె రుణదాతలుగా .


చుట్టు పక్క లూళ్ళ సొరిది రైతులు గూడ

రుణము కొఱకు రాని రోజు లేదు

పార జూడ నొక్క నూరు రూపాయలు

పుట్ట వరయ ' నాడు ' చుట్టు పట్ల .


ధన ధాన్య రమా విలసిత

ఘనతలు తలదాల్చి బలిజ ధార్మిక గృహముల్

మొనసి తదితర కులాలకు

దిన వెచ్చము లిచ్చి , బతుకు తెరవు లొసంగెన్ .


ప్రతి యింట యినప్పెట్టెలు

అతిశయముగ పసిడి నిండి అలరారె , ధన

స్థితి , భూ స్థితి  శ్రుతి మించుడు

నతులిత వైభవము తోడ నందల మెక్కెన్ .

 

క్రిక్కిరిసిన జనములతో

పెక్కగు అంగళ్ళు ' నాడు ' పెంపు వహించెన్

అక్కజ మవి యెటు వోయెనొ ?

పక్కూళ్ళ జనాలు రారు పదిమందైనన్ .


వందలాది బలిజవాళ్ళ కుటుంబాలు

వలస వోయె నగర బాట బట్టి

ఊరు వదలినారు ఉద్యోగములబట్టి

కూలె యిళ్ళు , మొలిచె కుటజ తతులు .


అసలూరు నిర్ మనుష్యము

మసలిన పాళేల జన సమర్థత పెరిగెన్

పసగల వారు గతించిరి

కసుమాలపు జాతి హెచ్చె ,  కళదప్పె కడున్ .