సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, మార్చి 2014, శనివారం

' ఆడ పిల్లయే ' ఇంటికి అమృత ఫలము పుట్టి పుట్టంగనే పుణ్యాల ప్రోవయి
        కన్న వారికి గూర్చు కామ్యఫలము
బుడి బుడి నడకల బుజ్జాయి నవ్వులు
         నట్టింట ముత్యాల నగలు పేర్చు
పరికిణీ గట్టిన పాపాయి సొబగులు
           మురిపాల ముద్దులు మూట గట్టు
పెళ్ళీడు దరిసిన ప్రియ తనయ దిరుగు
            నాయింట లక్ష్మీ విహార మొనరు

ఘనులు కడుపార కూతురిన్ గన్న వారు
తల్లి దండ్రులు తనివార తమకు దాము
మురియు ననుభూతు లేమని బొగడ వచ్చు !
ఆడ పిల్లయే ఇంటికి అమృత ఫలము .

పండుగల నాడు కన్నుల పండు వగుచు
ఆడి పాడిచు దిరుగాడు ఆడ పిల్ల
ల కళ ఆయింటి నిండ వరాలు గురియు
ఆడ పిల్లయె సర్వస్వ మవని యందు .

అమ్మాయి నాన్న కూచీ ,
అమ్మకు గడు తోడు నీడ , అన్నయ్యకు ప్రా
ణ మ్మపురూప మ్మీ బం
ధమ్ములు గద ! ఆడ పిల్ల తనరిన యింటన్ .

 

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మహా శివ రాత్రి శుభాకాంక్షలు
తలమీద గంగమ్మ తనువులో గౌరమ్మ 
ఇద్దరు చెలువల ముద్దు మగడు 

ఒల్లంత బూడిద వల్లకాడే యిల్లు 
పాములతో దిరుగు సాములోరు 

ఏనుగు తోల్గట్టి యెద్దు వాహనమెక్కి 
లోకాలనేలు భూలోక విభుడు 

డమరుక నాదాలు డప్పుల మోతలు 
శూలాల కోలాహలాల ప్రియుడు

అతడె హరహర మహదేవు డందరికిని 
సులభు డభయమ్ము పొందగా నిల వెలసిన 
లింగ రూపుడు మనల పాలించు ప్రభుడు 
ప్రణతు లర్పింతు నర్చింతు పరమ శివుని .