సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, జనవరి 2021, శుక్రవారం

అద్భుత శిల్పము 🙏

 


హద్దే లేదీ ఘనతకు

తద్దయు మన శిల్పకళ గత విభవము గనన్ ,

ఎద్దును గననగు నొకవై

పద్దెస నేనుంగు గనగవచ్చు చతురతల్ .


ఆండాళ్ - శ్రీరంగనాధుల కళ్యాణ వైభోగమే భోగిపండుగ

 


ఆండాళ్ - శ్రీరంగనాధుల

కళ్యాణ వైభోగమే భోగిపండుగ

---------------------------------------

తనపూలవనములో దొరి

కిన పాపకు, విష్ణుచిత్త కేశవదాసుం

డొనరగ ' కోదై ' నామం

బును, పూమాలయను, నర్థమున పేరిడియెన్ .


కోదై గోదాయయ్యెను

గోదా శ్రీరంగనాధు కూరిమి బొందెన్

శ్రీదామ మామె ముడువగ ,

మోదముతో తానుదాల్చె మురహరి ప్రీతిన్ .


గోదా కొప్పున ముడిచి , ప్ర

మోదముతో విడిచి పంపు, పూమాలలె , నా

మోదింతుననుచు, కలలో

శ్రీదాముడు వలుక , కూతురిన్ వేనోళ్ళన్


వొగుడుచు,' నాండాళ్ ఆండాళ్ '

తగ బిలిచెను, మురిసి తండ్రి , 'తల్లీ' యనుచున్,

జగ మంత, టామె నాండాళ్ 

యని బిలువగబట్టి గోద, ఆండాళ్ అయ్యెన్.


రోజూ వొకపాశురమున 

రాజీవాక్షుని నెలంత రాగసుధలతో

పూజించ మెచ్చి యామెను

మోజున శ్రీరంగనాధమూర్తి వరించెన్


తుది , భోగి రోజు , రంగడు

ముదితను కళ్యాణమాడె ముచ్చటవడి,  ఇ

వ్విధ వైభోగపు కళ్యా

ణ ధగధగకు ' భోగి ' యనగ నాదిన మొప్పెన్ .

కన్ను లరమోడ్పు లయ్యెను .....

 


కన్ను లరమోడ్పు లయ్యెను

పన్నుగ హృదయాలు తనిసి పరవశమయ్యెన్

వెన్నుని రాధిక తనువులు

మన్ననతో పెనసి ప్రేమ మధువులు పండెన్ .

6, జనవరి 2021, బుధవారం

గుట్టుగ నొకచో నిలువడు

 


గుట్టుగ నొకచో నిలువడు ,

నెట్టన పొరుగిండ్ల దూరు నితడని తాడున్

గట్టెను సత్యాసతి, చే

పట్టి కరంబుల, నితండు పట్టుంబడునా ?


గట్టి మేల్ తలపెట్టవోయ్

 



తనసంపద, అధికారము,

ఘనవైదుష్యములవల్ల గౌరవమొనగూ

డున ? రా , దితరుల కందిం

చిన మేలొకటే , మనుజు విజితునిగ నిల్పున్ .


కోటలు దాటే మాటల

చాటింపులవల్ల మేలు జరుగదు జగతిన్,

దీటుగ మేల్ తలపెట్టి, న

దాటుగ సేయంగ నొరుగు, ధార్మిక కృతులన్ .

రానీవా ? మేనువిడిచి .....

 


ఓ నీలా  ! నీలాలక !

రానీవా మేనువిడిచి రాజీవాక్షున్ ,

శ్రీనాధుగొలువ నిదిగో !

మానినులము వచ్చినాము మంజులవాణీ !


5, జనవరి 2021, మంగళవారం

ఓగుదగిడీలు

 


' దేశభాషలయందు తెలుగు లెస్స' ని వల్కె,

రాయలు కర్ణాట రాజరాజు,

' సుందర తెలుగ ' ని చొక్కి వచించె, సు

బ్రహ్మణ్యభారతిరా , తమిళుడు ,

అరయ ' ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్ ' అంచు, ని

కోలకోంటి ఒక ఇటాలి మెచ్చె,

' అద్భుత ' భాషని అరచి చెప్పెను, బ్రౌను

ఇంగ్లీషుదొర గణియించి ఘనత,


దేశ దేశాల పండితుల్ తెలుగు మెచ్చి

వొగిడినా , రిదిగొ ! నిచటి 'వోగు దగిడి

గాళ్ళు' తామె బుధులవోలె, గ్రామ్యమనుచు

తెలుగు నుడులను నిరసింత్రు తులువ లగుచు .

3, జనవరి 2021, ఆదివారం

సద్దు సేయంగవద్దు .....

 



సద్దు సేయంగవద్దు విశ్వంబ నీవు,

సరసములదేలుచున్నారు, సరసజగతి

నేలు రాధికాకృష్ణులు, హృదయ

సీమలొక్కటిగ, రసానుగామినులయి .