సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

మాతృపిండం దదామ్యహం


 

గర్భస్థ శిశువు తా కాళ్ళతో తన్నంగ

నొప్పిని ప్రియముగా నోర్చుకొనును

అలికిడి కులికి తా నమ్మ పొత్తిళ్లలో

నొదుగంగ గుండెల కదుము కొనును

ఆకటి కేడ్చుచు అమ్మపై కెగబ్రాక

మురిపాన చన్నిచ్చి పరవశించు

బుడి బుడి యడుగుల పడిలేచి నడయాడ

బుడుతకు కేలిచ్చి నడత నేర్పు

 

అలుపెరుంగక రాత్రింబవలు భరించి

బిడ్డలే లోకముగ జీవించు" అమ్మ " _

బిడ్డపై అమ్మ కెంతటి ప్రేమ గలదొ ,

బిడ్డలకు గూడ అంతటి ప్రేమ గలద ?

 

వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి

పూని చాకిరి చేయలేని నాడు

బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు

చేరి సహాయము కోరు నాడు

ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు

వైద్యావసరము కావలయునాడు

మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో

కలగుండు పడు కష్ట మొలుకు నాడు 

 

అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి

కాచి కడతేర్చు బిడ్డలు గలర ?  అంత

గాక పోయిన బాధ్యతగా దలంచి

జాలి చూపించ గలర ?  కాస్తంత యైన 

 

" మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర

ఋణము తీరదు  _  ముదిమి పైకొనిన నాడు

కాచి కడతేర్చ   తీరు  _   నీ ఘనత  మరచి  

ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?