సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, డిసెంబర్ 2014, బుధవారం

శుభ కామనలుఅనంత విశ్వమే క్రమపధ్దతిలో నడుస్తోంది
విశ్వాంతరాళంలోని నక్షత్ర , గ్రహాది సకలమూ
క్రమపధ్ధతిలో నడుస్తోంది .
అందులోని భూమి కూడా క్రమపధ్ధతిలో నడుస్తోంది .
భూమిపైన వసంతాది ఋతువులూ ,
కాలాలూ క్రమపధ్ధతిలో నడుస్తున్నవి .
భూమ్మీది పశువులూ , పక్షులూ కూడా క్రమపధ్ధతిలో
జీవనం సాగిస్తున్నవి .
కాని ,
మనిషి మాత్రం
అహంకార జ్ఞానం పెరిగి ,
తెలివి ముదిరి ,
క్రమపధ్దతిని గాలికొదిలేశాడు .
నీతినియమాలు నీళ్లకొదిలేశాడు .
దైవాన్ని స్వార్ధం కోసం
మతాన్ని హింస కోసం
ధర్మాన్ని పాపం కోసం
సత్యాన్ని బొంకు కోసం
వాడుకుంటున్నాడు .

కాలం మార్పు తెస్తుందంటారు .
ఈ క్రొత్త సంవత్సరమైనా
మేధావి లోని
గతి తప్పిన వికృత మతిని
మారుస్తుందేమో చూద్దాం .
శుభ కామనలు 2015 కు .

23, అక్టోబర్ 2014, గురువారం

దీపావళి శుభాకాంక్షలు
అందరి జీవితా లారోగ్య దీపాల
వెలుగులతో నిండి విరియు గాత !

అందరి జీవితా లైశ్వర్య దీపాల
వెలుగులతో నిండి విరియు గాత !

అందరి జీవితా లందున పరిపూర్ణ
విజయాల వెలుగులు విరియు గాత !

అందరి జీవితా లందు భద్రత కల్గి
వెలుగుల రక్షణ విరియు గాత !

మంత్ర తంత్రాలు జ్యోతిష్య మాది  వృత్తు
లు గొని , అంధ విశ్వాసములు రగిలించు
బుధుల దుర్మార్గ మికనైన పోవు గాత !
విశ్వ కళ్యాణ ధీధితుల్ వెలయు గాత  !
3, అక్టోబర్ 2014, శుక్రవారం

అమ్మా ! దుర్గమ్మ తల్లీ !

మంచేదో తెలుసు

అయినా ఆచరించడానికి తగిన సత్య సంధత లేదు

చెడేదో తెలుసు

అయినా చెడుతో పోరాడడానికి తగిన మనో నిబ్బరం లేదు

మోస మనీ తెలుసు

అయినా నివారించడానికి తగిన నిబధ్ధత లేదు

స్వార్థ మనీ తెలుసు

అయినా విడనాడడానికి తగిన మానసిక సంసిధ్ధత లేదు

బ్రమ యనీ తెలుసు

అయినా బైట పడడానికి తగిన ధైర్యం లేదు

హింస అనీ తెలుసు

అయినా పరిహరించడానికి తగిన సౌమనస్యం లేదు

అన్యాయమనీ తెలుసు

అయినా ఎదిరించడానికి తగిన న్యాయ శీలత లేదు

దుర్మార్గ మనీ తెలుసు

అయినా వదిలి పెట్టడానికి తగిన సౌశీల్యం లేదు

అజ్ఞాన మనీ తెలుసు

అయినా జ్ఞానం వైపు పయనించడానికి తగిన సంస్కారం అలవడడం లేదు


       తర తరాల మానవ మేథస్సు పండించిన

       వేదాలు , ఉపనిషత్తులు, పురాణాలు , ఇతిహాసాలు , శాస్త్రాలూ –

       తదితర విజ్ఞాన(?)భాండాగార మంతా

       తెలుసు కోడానికేనా ?

       ఆచరించడానికి కాదా ?

          మనిషిని మనిషిగా గౌరవించడానికి కాదా?


          జ్ఞానం స్వార్ధానికి ఉపయోగించుకోవడానికేనా?


          మనిషిని బ్రమల్లో ముంచి మేధావులు - వాళ్ళ పబ్బం గడుపుకోవడానికా? 
          

          మంచీ – చెడూ తేడా తెలుసున్న మేధో వర్గం చెడు వైపే మొగ్గు తున్నదెందుకని ?


అమ్మా !  దుర్గమ్మ తల్లీ !

‘ విజయ దుర్గ ‘ వైన నిన్ను

తర తరాలుగా కొలుస్తున్న మా ‘ బుధ్ధి ‘ కి

‘ చెడును ఎదిరించే పోరాట పటిమనూ ,

మంచిని ఆచరించ గల ‘    ‘ సత్తానూ ‘ ప్రసాదించు తల్లీ !

         ----- విజయ దశమి శుభాకాంక్షలతో


23, సెప్టెంబర్ 2014, మంగళవారం

మన జాతి తెలుగు జాతి

నానేల తెలుగు నేల
నాజాతి తెలుగు జాతి
నాభాష తెలుగు భాష
నన్నందరూ తెలుగు వాడంటారు
అరవలూ , కన్నడిగులూ ,
కళింగులూ , మరాఠాలూ-అందరూ
నన్నందరూ తెలుగువాడంటారు .

కానీ ,
మనలో మనం మాత్రం
ఆంధ్రోడనీ
తెలంగాణావాడనీ
రాయలసీమోడనీ పిలుచుకుంటాం
ఐనా ,
ఇదేమీ అసహజం కాదు గదా
ఒకే జాతిలో
ప్రాంతీయ భేదాలూ
ప్రాంతీయ మాండలికాలూ
ప్రాంతీయ యాసలూ కూడా సహజమే
పాలనా పరంగా
రాష్ట్రాలు రెండైనా , మూడైనా
ఈనేల తెలుగు నేల
ఈజాతి తెలుగు జాతి
ఈభాష తెలుగు భాష

సంస్కృతంతో జత కట్టి
మణులూ పగడాల సరమైనా
ఉర్దూతో జత కట్టి
ముత్యాలూ పగడాల సరమైనా
మనభాష తెలుగు భాష

బతుకమ్మలాడుతూ
ప్రకృతి మాత నారాధించినా
సంక్రాంతి సంబరాలతో
పాడి పంటల నారాధించినా
మన నేల తెలుగు నేల

ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టడం
విద్వేషాలు రగిలించడం
ఎలక్షన్ల పబ్బం గడుపుకొవడం
పాలకులు కావడం
నేతల రాజనీతి
నేటి రాజనీతిజ్ఞులెవ్వరూ
సామాన్య జనం కోసం కాదన్న నిజం
చరిత్ర చెప్పిన సత్యం

మాయగాళ్ళ మాటల్ని పక్కన పెడితే
మన నేల తెలుగు నేల
మన జాతి తెలుగు జాతి
మన భాష తెలుగు భాష  


29, ఆగస్టు 2014, శుక్రవారం

గణేశ్ చతుర్ధి శుభాకాంక్షలు


జగతి జనము  లెల్ల సౌఖ్యాలు బడయగా
బుధ్ధి నిచ్చి   కార్య సిధ్ధి నిచ్చి
బ్రోవ వేడు కొందు  బొజ్జ గణేశుని
గుంజియలను దీసి  అంజలించి . 

26, ఆగస్టు 2014, మంగళవారం

తిక్క తలకెక్కింది

శిరిడి సాయి బాబా దేవుడు కాదు “ -  ధర్మ సంసద్ తీర్మానం .
    -- ఇదీ ఈరోజు వార్త .
శిరిడి సాయి బాబా దేవుడు కాదనీ , గురువూ కాదనీ , అసలు
సన్యాసీ కాదనీ , ఆయన్ని దేవుడుగా ఆరాధించ వద్దనీ  హిందువులకు
సదరు తీర్మానం ఆదేశిస్తూ ఉంది .
బాబా దేవుడా , కాదా , అనే విషయం బాబా భక్తులు చూచు కుంటారు .
ఈ దేశంలో ఇంకేమీ సమస్యలు లేవా , సదరు సంసద్ లు తీర్మానాలు
చేసి పరిష్కరించడానికి ? అని సామాన్యులు ఈ నిర్వాకాలను                                           ఈసడించుకుంటున్నారు . స్వామి వివేకానందుల వారిని ఆదర్శంగా
తీసుకుని ఉంటే ,  సామాన్య జనం మధ్యలో కెళ్ళి వాళ్ళ సమస్యలు
పరిష్కరించడానికి పూనుకునే వారు , అంతే కాని , ఇలాంటి
వివాదాలు సృష్టించి , సమాజంలో చిచ్చు పెట్టే వారు కారు అని ఉక్రోషిస్తున్నారు .
జనాభాలో అత్యధిక శాతం ఉన్న దళిత వర్గాలను , వీళ్ళ అనుచిత
ప్రవర్తనల వల్ల ఆర్ష ధర్మానికి దూరం చేసిన ఈ మేధావులు , ఇప్పు
డింకో వివాదానికి తెర తీశారని తిట్టి పోస్తున్నారు .
                        -----
బాబా  జనం మధ్యలో బతికాడు . సామాన్యులతో సహజీవనం చేశాడు .
వాళ్ళ సమస్యలను తమ సమస్యలుగా భావించాడు . భగవంతుణ్ణి
వాళ్ళకు సన్నిహితం చేశాడు . ఎలా జీవించాలో నేర్పించాడు . ఆయనలో
దురహంకారం ఏకోశానా కన్పించదు . దేని పైనా వ్యామోహాలు లేవు .
భగవంతుని లోని ప్రేమ తత్వం మూర్తీభ వించిన మహానుభావుడు .
సామాన్యుల మధ్య సంచరిస్తూ , మార్గ దర్శనం చేసిన సద్గురువు .
కట్టు బట్టలలో గాని , కడుపు నింపుకోవడంలో గాని , నివాసం విషయం
లో గాని కఠినంగా నియమాన్ని పాటించిన సన్యాసి .
                           -----
బాబాను నమ్మి కొలిచే వాళ్ళు ఈ దేశంలో లెక్కకు మిక్కుటం . బాబా గుడి
లేని పల్లె టూళ్ళు ఈ దేశంలో లేవంటే అతిశయోక్తి కాదు . నేడు రాముడంటే
సాయి రాముడే . కృష్ణుడంటే సాయి కృష్ణుడే . అను నిత్యం బాబా ఆలయాలు
భక్తులతో , హారతులతో , భజనలతో దేదీప్యమానంగా వెలుగొందు చున్నవి .
పుట్టిన ప్రతి బిడ్డకూ సాయి నామం  చేర్చకుండా నామ కరణం చేయడం లేదు .
ఒక వ్యాపార సంస్థ పెట్టినా . ఒక అపార్ట్ మెంటు కట్టినా పెట్టేది సాయి పేరే .
సర్వం సాయి మయం   గా  ఎట్ట యెదుట కళ్ళకు కనబడు తున్నప్పుడు
శిరిడి సాయి బాబా దేవుడు కాదని తీర్మానించడం సర్వజనులనూ తిరస్క
రించడమే . జన బాహుళ్యంతో మమేక మైన సాయి నామాన్ని ఆపాలనే విఫల
ప్రయత్నం మద్యందిన మార్తాండునికి చేతు లడ్డు పెట్టడమే .
రాముణ్ణి కొలిచినంత గొప్పగా సాయిరాముణ్ణీ , కృష్ణున్ని తలచినంత మిక్కుటముగా      
 సాయి కృష్ణుణ్ణీ  నేడు కొలుస్తున్నారు , తలుస్తున్నారు .   
దైవాన్ని అనేక రూపాలలో దర్శించడం , పూజించడం హిందువులకున్న గొప్ప గుణం . 
  దీన్ని కాదని ,   పెద్దలు భక్తి విషయాన్ని
వివాదం చేయడం మాని , జన సామాన్యానికి దగ్గరై  , వాళ్ళ దైనందిన సమస్యలలో
పాలు పంచుకుని , పరిష్కారాలను అన్వేషిస్తారని ఆశిద్దాం .


16, ఆగస్టు 2014, శనివారం

రాధా మాధవం

ఎందుకో ఆ పున్నమి చంద్రుని కంత విచ్చుబాటు , 
వొళ్లు తెలియనంతగా పరవశిస్తున్నాడు .                                                                  
ఏమా మలయ సమీర మంద గమన మదం ,
పూదోటల పరిమళాలతో దొంతర దొంతరలుగా,
యేటి నీటి తుంపరలు వెదజల్లు చున్నాడు .
ఎంత నిగారింపు ఈ తట సైకతానికి ,
పసిడి మిసిమి మిస మిసల హొయలు పోతోంది .
              -----------
కతమేమిటో కళ్లకు కట్టినట్లు కనబడుతూనే ఉంది ,
కలువ కనుల అలల కళల జల వాహినికి .
కను కలువలు విచ్చి మరీ చూస్తోంది ,                                                                      
కాసేపైనా రెప్పలార్పకుండా .
               -----------
ఆ యమునా తట సైకత శయనంలో
పున్నమి వెన్నెల జిలుగు వెలుగులలో
ఆ ప్రణయిని
ఎంత సేపట్నించి
తన్మయత్వంతో
ఆ సమ్మోహన రూపసిని చూస్తోందో
ఆ చూపులు అనిమేషాలై
అమృతత్వాన్ని సంతరించుకున్నట్లున్నవి .
              ----------
ఎంత సేపు ఆ లీలా మానుష
మనోహర రూపాన్ని చూస్తోందో
ఆ ప్రేమ మయి
మంత్ర ముగ్ధ చిత్తరువై కన్పిస్తోంది .
ఆ నవ మోహనాంగి
ఆ మోహనాకారుని
పరిష్వంగం కోసం
పరితపిస్తున్నట్లు కన్పిస్తోంది .
నుదురు ముద్దాడింది
కనురెప్పలకు పెదాలద్దింది
చిరునగవు చికురాన్ని చుంబించింది
అధరాలకు అధరాల మధువు లందించింది
గళసీమకు కరకమలాలు కీలించింది
ఎద శయ్యపై సేదతీరింది
          ----------
ఒకరి కొకరుగా
ఇద్దరొకరుగా
ఒకే ఒకరుగా
ఆ రూపం సమ్మోహనం
ఆ తేజం మనోహరం
ఆ వదనం మధురం
ఆ నయనం మధురం
ఆ హసితం మధురం
ఆ ప్రేమ మధురాతి మధురం .
అదే రాధా మాధవం .
జగతికి -
అదే తొలి ప్రేమ కావ్యం .
       -----------
ఆ ప్రేమ కావ్య సాక్షిగా
ఆ యమునా శ్రోతస్విని
ఆనంద డోలికలలో ఊగుతూ
నిరంతరాయంగా
కొనసాగుతూనే ఉంది .


15, ఆగస్టు 2014, శుక్రవారం

కృష్ణ రారా చిన్ని కృష్ణ రారా

కృష్ణ రారా
చిన్ని కృష్ణ రారా
ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా
ఆరగించి వరములిచ్చి ఆదుకోరా

స్వఛ్ఛమైన మనసులన్ని పాల సమానం
పాలు చిలికి తీయు వెన్న ప్రేమ సమానం
ప్రేమ వెన్న నైవేద్యం ప్రియమని నమ్మితి కృష్ణా   || కృష్ణ రారా ||

తర తరాల తల్లి ప్రేమ   త్రచ్చి వెన్న తినిపించెను
మమకారపు పిచ్చి ప్రేమ    కుమ్మరించి యశోదమ్మ || కృష్ణ రారా ||

అనురాగపు ప్రేమ వెన్న    పెన వేయుచు తిని పించెను
మనసున తనువున    తానై అణువణువున రాధమ్మ     || కృష్ణ రారా ||

తరగని ప్రేమల వెన్నలు    తరచి తరచి తినిపించిరి
తమను తాము అర్పించుచు    తరుణులు గోపిక రమణులు   || కృష్ణ రారా ||

అడుగడుగున నడయాడుచు    ఆడి పాడి చెలిమి వెన్న
వనమున యమునా వనమున    తినిపించిరి గోపాలురు         || కృష్ణ రారా ||

తెలుగుల తేనియలద్దిన    పద్య సుధల భాగ్యనిధులు
భాగవతపు భక్తి వెన్న     తినిపించెను పోతన్న                  ||  కృష్ణ రారా  ||