సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

24, జులై 2020, శుక్రవారం

పాశ్చాత్యంలో భగవద్గీత


ఈ చిన్నారుల చేతిలో వెలుగు సాహిత్యమ్ము పేరేమిటో ?
ఈ చిన్నారుల దేశమేదొ ? మరి యాచిన్నారు లెంచేత ఈ
రోచుల్ గుల్కెడు గ్రంధరాజమును దాల్తుర్ మహానిష్టగా ?
రేచున్ చిత్తమునన్ గుతూహలము ఆవృత్తాంతమున్ జెప్పెదన్ .

అది భగవద్గీత , నిసుగు
లదియు నెదర్లాండ్ , ప్రభుత్వ మచ్చట విధిగా
జదివింతురు , పాఠ్యాంశం
బిది , పాశ్చాత్యుల ప్రదేశ , మెంతో మనసై .

ఇదేందయ్యా ! కిట్టయ్యా !


ఏందిర ? ఓసోసి ! మొగము
పందిరిపై జుట్టుచెదిరె, పరవశమా?ఆ
ముందరి పలుసందులపై
చిందు నగవు ముత్యములను చేకొందు హరీ !



మనకవి జాషువా


తిక్కనలా వేమనలా
చక్కని గురజాడలాగ జాషువ, తెలుగుల్
అక్కున జేర్చిన మనకవి,
మ్రొక్కి తెలుగు శారదలకు మ్రోడ్తును కరముల్ .

23, జులై 2020, గురువారం

వచ్చె వచ్చె కన్నయ్య .....


వచ్చె వచ్చె కన్నయ్య ఈ వంక వచ్చె
పరుగు పరుగున ఆలు దౌడురుక వెనుక
నవ్వు మోమున త్రుళ్ళింత నగలు మెఱయ
ఆడుకొందము రావయ్య ! ఆది పురుష ! .

ఆ నవ్వుమీది మోహము
మానంగా తరమ ? మాకు , మానసచోరా !
రా ,  నాతండ్రీ ! పరుగున ,
రానా ? నేనైన ,  నాడ , రాత్రిందివముల్ .

మాటలు శివతత్వమ్ములు


మాటలు శివతత్వమ్ములు
మాటున వెలుగొందు నర్థ మా యుమ తత్వమ్
మాటాడునెడల భద్రము
పాటించుట శుభము మానవాళికి జగతిన్ .

నడయాడె శివుడు కాశీ
గడపన గల గాంగ తటము కలదిరుగుచు , నో
బడబానల నిటల నయన !
దడరా నినుజూడ , అమ్మదయగలదు హరా !

22, జులై 2020, బుధవారం

కబరీభర కందము .....


పడతుక కబరీభరమున
నడుమ పసిడి సూర్యబింబనాగరమును , పై
గుడుసున మల్లెల సరములు
ముడిచె , మదనరథపు చక్రమో యన సరసుల్