సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, మే 2020, శుక్రవారం

అమృతఫలాలు .....


అమృత ఫలాలు
--------------------
అమృతఫలాలివి , వీటిని
సుమశరు డింద్రుని వనమున చూచి , పుడమికిన్
రమణి రతీదేవి కొఱకు ,
శ్రమపడి కొనితెచ్చె రాగ రంజితు డగుచున్ .

రుచికి పడి , రతీ దేవి వ
లచి తన వనమున యమృతఫలమ్మును విత్తెన్ ,
సచిపతి కిష్ట ఫలదమగు
యచలము మదనాలి యింట నమరెను తరువై

వలరేని చెలిమికాడగు
వలపు వసంతుం డచటికి వచ్చెను , రాగా ,
కలయో మాయో తెలియదు ,
విలసిల్లెను చెట్టు పూప పిందె ఫలాలన్ .

మావి పండు తిన్న మన్మథ పతిసతుల్
మదన మోహ ఝరుల మరులు గొనిరి ,
మధుర ఫలము మహిమ మదనాయితమ్మను
నిజము తెలిసె , దివిజ రుజయు దెలిసె .

భూలోక మంత మావుల
జాలము నాటించి చిత్తజాతుడు , మిథునా
లోల సరాగాలాలస
లీలల పండించె , సృష్టి లీల లివేగా .

27, మే 2020, బుధవారం

ఎందాకా ఈ రోగపు .....

ఎందాకా ఈరోగపు
కుందున బతుకంగ వలయు కువలయ మంతా ?
ఎందాకా వ్యాక్సిన్ మన
కందునొ నందాక , తప్ప దందురు విఙ్ఞుల్ .

మా మా పరాక్రమమ్ములు
ధీమమ్ములు తేలిపోయె , తిరుమల వాసా !
నేమమ్మున నిను గొలుచుటె
భూమి జనుల బాధ తీరబోవు పథమ్మౌ .

గూడొదిలి , కూటికోసము
వేడుచు , పరదేశ మొచ్చి , వేసట పడి , పో
రాడిన పక్షుల కిప్పుడు
గూడే దిక్కను నిజంబు గొప్పగ దెలిసెన్ .

చేతులకు శానిటైజర్ ,
మూతికి మాస్కున్ ధరించు , పూస్కో రాస్కో
బోతివ , జనాల వెంబడి ,
గోతికి చేరువ యగుటయె , గూడే భద్రమ్ .

అల్లో లక్ష్మణ .....

వోటేసిన వారి నడుగు ,
వోటు గొనిన వారు గెలిచి పొడిచిన దేమో ?
నేటి రహదార్లు నుడువును ,
ఏటికి ఈ చేతగాని యేలికల పనుల్ ?

అల్లో ! లక్ష్మణ ! యనుచున్
పిల్లల పెండ్లాము తోటి , వేలాదిగ , రో
డ్లల్ల నడుచు ఓ సోదర !
ఇల్లిదె ' పేకేజి ' కాటి కెల్లే కిత్తుమ్ .

ఇవి కనపడ వే నేతకు ,
ఇవి వినపడ వే ప్రభుత్వ యేలికలకు , లే
నివి , యున్నవి పేకేజిలు ,
వివిధ గణాంకాలు చెప్పి వేధింపు బలే .

భూలోకము తన సొత్తని .....



భూగోళము తన సొత్తని
రేగి మనిషి ప్రకృతి నిట్టిరీతిని చెరుచన్
పోగాల మెదురు నిలిచెను
రోగాలకు జడిసి ఇంటిలో పడవలసెన్ .

రోడ్లు పట్టణాలు లోలాక్షులు పసుల్
గుంపులు చరియించు సొంపు జూడ
మనిషి అడ్డు తొలిగె నని మహదానంద
పడెడు లాగ దెలియు పసుల తీరు .

26, మే 2020, మంగళవారం

కేశవా ! .....


కేశవా ! గుట్ట నెత్తితివని కీర్తిగాన
మున మునిగెదేల రా? లోకముల భరించు
నిన్ను చూచుకముల నెత్తు నన్ను వొగడ
రేమిర ? యవునులే , నాకదృష్ట మేది ?

అనురాగ రాగ రంజిత .....


అనురాగ రాగ రంజిత
ఘనులీ పరమాత్మ జంట , కమనీయ ఘనం
ఘన రమణీయము చిత్రము ,
కనులకు విందై చరించు కామిత మిచ్చున్ .

పురుషోత్తమ ! కృష్ణ ! నమో 🙏 .....


పురుషోత్తమ కృష్ణ ! నమో 🙏 ,
పరమాత్మా కృష్ణ ! శుభద భాగవత! నమో🙏 ,
వరదాయక కృష్ణ! నమో 🙏 ,
సరసీరుహ నేత్ర కృష్ణ జగదీశ ! నమో 🙏 .

25, మే 2020, సోమవారం

యోగీంద్రచంద్ర కృష్ణా ! .....


యోగీంద్ర చంద్ర కృష్ణా !
రాగజలధి దేలు రసిక ! రాధిక కృష్ణా !
భోగీంద్రశయన కృష్ణా !
శ్రీ గానామృత విహరణ చిత్తా ! కృష్ణా  !

త్రిభువన మోహన కృష్ణా !
అభవాది నిలింప సేవ నావన కృష్ణా !
శుభకర ! రుక్మిణి కృష్ణా !
అభయప్రద ! వాసుదేవ ! హరి ! శ్రీ కృష్ణా !

బృందావన మధుబనిలో
నందిత గోపాల ! కృష్ణ ! నారాయణ ! నీ
మందిర మీ హృన్మందిర ,
మిందుండుము , కృష్ణ ! నీదు మేలు భజింతున్ .

శ్రీ మధురాధిప ! కృష్ణా !
మా మనసులు గెలిచినట్టి మాధవ ! కృష్ణా !
హేమాంబర ధర ! కృష్ణా !
ప్రేమాగమ సృష్టికర్త ! ప్రియ ! శ్రీకృష్ణా !

ఈ లలితాంగి మేని విరు .....


ఈ లలితాంగి మేని విరు పిక్షు శరాసన పొంకమున్ బలెన్ ,
ఈ లలితాంగిసోయగ సకృత్ రతిరూపవిలాస భాసమై
ఈ లలితాంగి చెంగుభిగి హెచ్చులు మెచ్చులు దెచ్చు నంచు శ్రీ
లోలుడె చేష్టితాలుడిగి లో చకితాననుడైతపించెడిన్ .

ఏమా మోహన రూపము .....


ఏమా మోహన రూపము !
ఏమా మోహన మనోఙ్ఞ హేమాంబరమున్ !
ఏమా మోహన గానము !
శ్రీమాధవ ! నిన్నుబొంది  సిరినైతి నెదన్ .

నారీ రత్నము .....


శ్రీ రాజిల్లు ముఖాంబుజంబుల నగుల్ , చేతోసుధాశ్రీలు జాల్
వారన్ , నాసికలందు ముత్యపు సరుల్ భాస్వంతమై పర్వగాన్ ,
ధీరాచ్ఛాద శిరోవిభూషణములున్ తీరై తలల్ గుల్క , ఈ
నారీరత్నము లెల్ల , సత్య లయి కన్పట్టంగ , కేల్మోడ్చెదన్ 🙏 .

ఇవిగో మల్లెలు .....


ఇవిగో ! మల్లెలు , మండుటెండలకునూ ఈపూలకున్నేదియో
రవియున్ గాంచని గోప్యబంధజితమౌ రాగంబు గన్పట్టెడిన్ ,
జవరాండ్రన్ తలలెక్కి  చొక్కి ధవులన్ సాధించగా కుట్రయో ?
యవనిన్ గంధపరీమళంపు జిగితో నాహ్లాదమున్ జేయుటో ?