సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, డిసెంబర్ 2020, శుక్రవారం

అడుగు విజయంవైపే వెయ్యి

 




ఆముక్తమాల్యద

 


భక్తి వలవేసి గెలిచి యా పద్మనాభు

వక్షము నలంకరించి సేవించి మించి

చెలువమున రంగనాధుని చేడెవయితి

వమ్మరో మమ్ము కాపాడు వరదహస్త .


ఆముక్తమాల్యదా ! ఆ

స్వామికి , నీయెదను తాకి , పరిమళ భరితం

బోమిన మాలలు కావలె ,

ఏమీ ! మీ ప్రేమకావ్య మెంత మధురమో !

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 🌹

 


అడుగొ ! కుల్లూరు పురమున నద్భుతముగ ,

అచ్యుతుం డుత్తరద్వార మందు , కొలువు

దీరె , ముక్కోటి దేవతాధీశు డగుచు ,

భాగ్య మిదిగదా ! దర్శించ భక్తులార !


నేడు ముక్కోటి , దేవతల్ భువికి తరళి

వచ్చి , దేవదేవునిగొల్చు పర్వదినము ,

మనము కూడ వైకుంఠవాసుని గొలుతము

రండి ఉత్తరద్వార దర్శనము సేయ .



21, డిసెంబర్ 2020, సోమవారం

మన యింటనే అష్టలక్ష్ములూ .....

 


తల్లి ఆదిలక్ష్మి , ధైర్యలక్ష్మియె అక్క

చెల్లి విజయలక్ష్మి  చెనటి ! వినుము ,

సకల శుభద భార్య సంతానలక్ష్మిరా

కూతురు ధనలక్ష్మి రాతమార్చు .


అరయర! గజలక్ష్మి అత్తయ్యయని , మరి

వదిన ధాన్యలక్ష్మి వరుస గనిన ,

మరదలు మనయింట వరలు విద్యాలక్ష్మి

అష్టలక్ష్ము  లింట నలరు చుంద్రు .


వారికి గౌరవ మిచ్చిన

వారే నీజీవితాన వరదులగుదు , రా

నీరేజాసనులు కినుక

బారిర , కష్టాలు మొదులు , భావించు సఖా !

20, డిసెంబర్ 2020, ఆదివారం

కన్నయ్యా ! అబ్బా! ఏమున్నావయ్యా !

 


కన్నయ్యా ! అబ్బా !  ఏ

మున్నావయ్యా ! యెడదకు మోహనమయ్యెన్ ,

కన్నుల్ చాలవు రెండూ ,

నిన్నే చూస్తూ , ఇటువలె  నిలువడి వోతిన్ .

నీవే నేనా ?

 


నీవేనా ప్రతిబింబం ?

నీవే నేనా ? అసలిక , నేనే లేనా ?

నీవే నేనను విషయము

దేవా ! నేటికి దెలిసెను , తెలివిడి కలిగెన్ .

ఈ ' చిత్రం ' చూశారా !

 


ఈ చిత్రం చూశారా !

ఓ 'చిత్రవిచిత్ర' ముంది , ఓహో! యని, శిరసుల్

ఊచక మానరు తెలిసిన,

యోచించగ చిత్రకారు డుధ్ధతుడు కడున్ .