సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ఏ మనుభవించె కృష్ణయ్య .....

 ఏ మనుభవించె కృష్ణయ్య ,  భూమి పైని ,

పుట్టుకా , చెఱసాలలో , యెట్టు లెటులొ

గొల్ల లిండ్లను బెరిగె ,  మేనెల్ల యాల

ధూళి దూసరితమయి దులకిసపడ .


మేనమామ శత్రువయి యేమేమొ చేసె

తనను చంపించ , తలిరాకు తనమునందె

గదిసి పోరాడ వలసె , రాకాసి గమిని ,

యేరికైనను నిట్టి రాయిడులు గలవె !


ఆల గాచెను , మన్నుల రాల విపిన

తలములన్ , యెండ లనక , వాన లన కకట !

అలసి సొలసి , కఠిన వృక్షముల మొదలుల

నిద్దురోయెను , ముద్దు మో మద్దె  మురికి .


రాచపుటక బుట్టె , మధుర రస విరాజ

మాన , పంచభక్ష్యంపు సమ్మాన భోజ

నమ్ము లేవి ?  వెన్నలకు ప్రాణమ్ము లూన ,

గొల్ల లిండుల గోరాడె ,  గోస బడియె .


రాధతో గూడి , యమునా తటీ , ధరాది

తల , లతా నికుంజముల , నితాంత ప్రణయ

జలధి , మునిగిన తన ప్రేమ ఫలిత మేమి ?

తుదకు యెడబాటె మిగిలెను , యెద బొగిలెను .


కడకు , కొడుకుల గోల్పడి , కడుపు రగిలి

ఇంతకును కారణమ్ము ' నీవే ' యటంచు ,

పూని గాంధారి శపియించె , మునిగె నీట

ద్వారకాపురి  యాదవుల్ పడిరి చచ్చి .


ఇన్నియును ముందె తెలిసియు , మిన్నకుండె ,

తాను పరమాత్మ యయ్యును , ధరణి పూని

ధర్మమును నిల్ప అవతారధారి యైన

కృష్ణ పరమాత్మ , తప్పునే ! కర్మ ఫలము  !


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్