సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, అక్టోబర్ 2024, మంగళవారం

విష్ణు సంకీర్తనం .....

 పద్మసంభవదేవి బాహుబంధమ్ముల

నలరు శ్రీకృష్ణుని చెలువు వొగిడి ,

సత్యా వసంతుని సరస సల్లాపాల

ప్రణయ గాధల చెలువార తనిసి ,          

రాధికా రమణి చేరంగ రాసక్రీడ

సలిపిన మధుర ప్రసంగము విని ,

బృందావన విహార ప్రియ‌సమాగమ

వినుత రస పిపాస విథము దెలిసి ,


విష్ణు సంకీర్తనా చార్య విమల మతులు ,

చేరి  , వసుదేవ సుతుని , నోరార , పాడి ,

ఆడుదురు , అట్టి భక్తుల , అమల పాద

రజము దొరికిన చాలును , బ్రతుకు పండు .

30, సెప్టెంబర్ 2024, సోమవారం

కానివాడిన ?

 కృష్ణ పరబ్రహ్మ కెరగి ప్రార్థింతు , గాని ,

కనికరించ డదేమిటో కరివరదుడు !

కానివాడిన ?  ఇంతగా కఠిన వైఖ

రి గొన ,  ఔనులే , నేనేమి ప్రియ సఖుడన ?

29, సెప్టెంబర్ 2024, ఆదివారం

ఏ పాదములు .....

 ఏ పాదములను సేవించ నిశ్చింతగా

జనుల జీవితములు సాగిపోవు

ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ

ర్మమ్ము నిల్ప నవతరణము దాల్చె

ఏ పాదముల స్పర్శ ఈ భరత యవనిన్

పరమ పావనగాగ విరియ జేసె

ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు

నిరతము మునులు ధ్యానించి గనిరి


అట్టి పరమాత్మ పాదము లందు , పూని

మనసు నిల్పితి నీ జన్మ మందు , నడుగొ !

గోపికా  రాస  కేళీ  కలాప  లలిత

సుందరాకారుడై కనువిందు గొలుపు .