సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

3, డిసెంబర్ 2023, ఆదివారం

సర్వము తానయైన వాడెవ్వడు ?

 


అతడి నుదుటి చిచ్చు , అనితర సాధ్యమ్ము

తగుల బెట్టును , విశ్వజగతి నెల్ల 

అతడి గళమున గల , అరి కాలనాగులు

కాల గమనమును కాటువేయు ,

అతడి తోడ నడచు , నతుల త్రిశూలమ్ము

పుడమి నడయాడెడు , చెడును బొలియు

అతడి చే దిరుగాడు , నరిది డమరుకము

నరుల నడతల  , హెచ్చరిక సేయు


హరు డతండు , విశ్వగురు డతండు , కడు  సం

హరు డతండు ,  కలడు ,   నరుడ ! ' నేనె

శక్తిమంతుడ '  నన జనకు , ఈ విశ్వమ్ము

ఈ శ్వరుని తలపున , నేల బడెడు .

2, డిసెంబర్ 2023, శనివారం

హరి సాయుజ్యము

 


ఆ యెదలో , కొలువై హరి ,

తీయని కలలోకి జారె ,  తెరువదు , తెర వీ

హాయిని పాయని , పరవశ

సాయుజ్యము చెందె , నెంత సరస హృదయ యో !

1, డిసెంబర్ 2023, శుక్రవారం

నేను నిర్మిస్తున్న అమ్మవారి ఆలయం


 మా కుల్లూరు గ్రామంలో నిర్మాణంలోని

శ్రీశ్రీశ్రీ పోలేరు తల్లి ఆలయం .

29, నవంబర్ 2023, బుధవారం

చేదు గలుగు గాక ....



చేదు గలుగు గాక , చిట్టి కాకర కూర ,
చేయి తిరిగి నట్టి స్త్రీలు వండ ,
రుచి యమోఘము , పలు రోగ బాధల నుండి
ముక్తి గలుగు , షుగరు వోవు తొలగి .

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

జడ తడిచె .....

 


జడ తడిచె , నొడలు తడిచెను

ఒడలికి ముడిబడిన కట్టు టుడుపులు తడిచెన్

కడదాకా ఉడుపుల బడు

మడత మడత లోని సొగసు మరిమరి తడిచెన్ .



13, జనవరి 2023, శుక్రవారం

తెల్గునేల సంబరాలు

 


పడగలువిప్పి, నాలుకలు పైపయిచాచి, మహోజ్జ్వలాకృతిన్,

గడపల ముందు, మంటలు సెగల్ వెలిగ్రక్కుచు, భోగి పర్వముల్

నిడు గన నౌను, తెల్గు కమనీయ మనోఙ్ఞత, పల్లెటూర్లలో,

సడులబెడంగునన్, మకరసంక్రమణానికి ముందు సందడుల్ .

2, జనవరి 2023, సోమవారం

ముక్కోటి శుభాకాంక్షలు

 


వైకుంఠవాస కృష్ణా !

రాకా శశి వాసుదేవ !  రారా భువికిన్

ఏకాదశి శుభ దినమున

నీ కాళ్ళను తాకి మ్రొక్కి నెమ్మి తరింతున్ .