సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

26, జూన్ 2020, శుక్రవారం

ఆ వొడ్డూ పొడుగూ ....


ఆ వొడ్డూ పొడుగూ, ఆ
శ్రీవత్సము , పొగడదండ , శ్రీవంశీగా
నావన మోహన శుభతను
పావనమంగళ మనోఙ్ఞ భవ్యవిలాసాల్

ఎందే గంటిమ కష్ణా ?
అందమునకు అతివలండ్రు , అది నిజమా , కా
దందమునకు నీ రూపమె ,
డెందము పరవశమగు , మరుడే సరి రాడే !

రాధారాధితవంశీ
శోధన విధి గాంచు కృష్ణ ! శోభన మూర్తీ !
మాధవ ! రమాధవా! మధు
సూధన ! పరమాత్మ ! శ్రీయశోదానందా !

ఆ నలుగురు .....


భజన సేయ పావనికన్న భక్తు డేడి ,
రక్షసేయ రామునికన్న రాజు లేడు ,
తలప సీతకన్న కొలువ తల్లి లేదు  ,
అన్నసేవ లక్ష్మణుకన్న ననుజు డేడి .

24, జూన్ 2020, బుధవారం

సొగసు జూడ తరమా .....


నగుమోము నిగనిగల్ ధగధగా మెరయు నీ
సొగసుజూడ తరమా జగ దధీశ !
ఆడు తుమ్మెద రెక్క నడచు వినీల నీ
సొగసుజూడ తరమా జగ దధీశ !
మగశిఖి పింఛంపు మౌళి జిలుగుల నీ
సొగసు జూడ తరమా జగ దధీశ !
రమణుల మధ్య చేర నవ మోహనము నీ
సొగసు జూడ తరమా జగ దధీశ !

నంద గోపబాల! నగధర !గోవింద!
కృష్ణ! హరి! ముకుంద! కేశ !వాచ్యు
త! మురళీధరా! జిత మదన రూప! నీ
సొగసు జూడ తరమ జగ దధీశ !

23, జూన్ 2020, మంగళవారం

భాగ్యప్రదాతా! నమో🙏.


హే ధాత్రీధరధారి!కృష్ణ!శుభగా!హేదివ్యసన్మంగళా!
రాధామాధవరూపమోహనవపూరాగామృతశ్శోభితా!
గాధాభాగవతా! జగద్గురు! శుభాంగా! అర్థనారీశ్వరా!
భాధాతప్తజనావనా! హరి!నమో🙏భాగ్యప్రదాతా! నమో🙏.

22, జూన్ 2020, సోమవారం

ఏమా పారవశ్యము ?


ఆ నీల మోహన తనూ
ధ్యాన పరవశయయి, సీత, యాతని మెడలో
పూని వరమాల వేయదు ,
ఊని చెలియ తాకుదాక, నూహాంతరయై .

21, జూన్ 2020, ఆదివారం

నమో🙏సూర్యనారాయణా !


నమో🙏సూర్యనారాయణా !
.....................................

ఇనుడు చంద్రుండు పుడమి ఒకే వరుసకు
వచ్చిన ఖగోల అద్భుతం బదిగొ కనుడు ,
పుడమిపై సూర్యకిరణాలు పడు విధమ్ము
నడ్డుకొని యడ్డునిల్చు చంద్రగ్రహమ్ము .

ఇందువలన మరే మార్పు చెంద దవని ,
ఇది ఖగోళ సహజ చర్య , ఎవ్వియును న
నూహ్య కష్ట నష్టాలు వినూత్నములును
సంభవించ వాందోళన జనగ వలదు .

ఆరాశివారు చెడుదురు ,
ఈరాశులవారు లబ్ధి కెక్కుదు రనుచున్
నోరేసుక కార్తాంతికు
లూరక తెగవాగుచుందురు , వలదు వినగా .

సూర్యునికి గ్రహణ మేమిటి ?
ఆర్యా ! పరిపూర్ణ శక్తి కాద్యుండు , సదా
శౌర్యప్రతాప తాప సు
కార్యౌదార్యోజ్జ్వల ప్రకాశుడు మనకున్ .