సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, మార్చి 2017, మంగళవారం

మా కుల్లూరు - 6

మా కుల్లూరు
***********
ఇందు నందున రాముని మందిరాలు
ఊరి కుత్తర దక్షిణ పూరు లందు
రెండు గల వెందుకో ? వితర్కించి చూడ
తెలిసె నొక గుట్టు , చెప్పెద తెలిసి నంత .

కొండొక సైన్య పటాలం
బుండిన కోటున్న దిచట , పూర్వము బలిజల్
దండి మగలు రౌతులుగా
నుండి రని మొదట వచించి యుంటిని దెలియన్ .

యుధ్ధ విద్యల నేర్పించ నుధ్ధతులను
గురువులను దెచ్చి విద్యల గరపు వారు
సాము గరిడీలు నేర్పగా సగము సగము
పంచుకొనిరిట్లు పురమును పట్టు కొరకు .

నల్లంగు వాళ్ళ బడియని
అల్లాగునె వెంకయబడి యని పేర్లరయన్
యెల్లన్ విద్యల నేర్చిరి
కుల్లూరున పిల్ల లెల్ల కోవిదు లవగా .

బడులు గుడులౌను దశరాకు , ప్రభలు గట్టి
రామ లక్ష్మణ సీత విగ్రహము లొనర
దీర్చి , పురవీథులందున జేర్చి , యచట
సాము గరిడీలు ద్రిప్పుట నీమ మిచట .

పిల్లలకు తాము నేర్పిన విద్యలెల్ల
సాము గరిడీలతోటి విస్మయము గదుర
తనరి జేయంగ విద్యా ప్రదర్శనముల
ఊరు ఊరంత ఉర్రూత లూగు చుండు .

యుధ్ధ విద్యలు కొలువైన యూరు గనుక
సైన్యమున రౌతులై యున్న చదురు గనుక
సాము గరిడీల పోటీలు సాగు చుండు
ముచ్చ టొకనాడు కుల్లూరు పురము గనెను .

రాజ్యములు కోటలును సైన్య రావడులును
పోయె , నిరుగడ బడులు రూపులను మాసి
రామ మందిరా లయ్యెను , రామణీయ
కముగ దశరా మహోత్సవ కాంతు లొనరె .

నాకు దెలిసియు దశరాకు నవమి నాడు
కత్తి కర్రల పోటీలు గలవు , విజయ
మందిన వారికి తగు బహుమతులు గూడ
ఇచ్చు ముచ్చట జూచితి నిచట నేను .

దశరా యుత్సవము లనిన
దశ దిశలకు పేరు గాంచి తా కుల్లూరిన్
విశదంబుగ నేనుగుపై
ప్రశస్తముగ రామచంద్ర ప్రభు డూరేగున్ .

కుల్లూరి బలిజ వంశము
విల్లమ్ములు దాల్చి యుధ్ధ విద్యల నేర్చెన్ ,
బల్లేలు పటాకత్తులు
మొల్లమ్ముగ నింట నింట మూల్గుచు నుండెన్ .

మా కుల్లూరు - 5

మా కుల్లూరు
***********
అచ్యుత స్వామి గుడిప్రక్క నప్పు డెపుడొ
ఎవరు నిర్మించిరో గాని యెరుక పడదు
చెన్న కేశవ గుడి చాల శిధిలమయ్యె
విగ్రహము కూడ లేదు , పోవిడిచి రటులె .

బలిజలకు చెన్న కేశవు డెలమి కొలుచు
దైవమై గ్రాలు గాన ప్రాధాన్య మెరిగి
పూని గంగాధరం గారు భుజము మోపి
తలచి నిర్మించె క్రొత్తగా ధార్మి కుండు .

దేవ దేవుండు దేవేరు లీవిథముగ
దివ్య మంగళ మూర్తులై తీరి నిలువ
నెంత పుణ్యంబు జేశామొ యిచట బుట్టి
చెన్న కేశవ స్వామికి సేవ చేయ .

మా కుల్లూరు - 4

మా కుల్లూరు
***********
శ్రీ భూ దేవేరులతో
వైభవముగ నచ్యుతప్ప వరదుడు వెలుగున్
శోభాయమానముగ , నీ
ప్రాభవ మే యూర గనము , వైష్ణవ మూర్తిన్ .

ఎప్పుడు నిర్మించిరొ ! ఆ
చొప్పులు దెలియంగ రావు , శుభ గోపురమున్
ఒప్పుగ నిర్మించె ఘనుడు
గొప్పగ నీ గుడికి తోట గురుమూర్తి యనన్ .

ఎంద రెందరొ భక్తులీ మందిరాన్ని
పూని జీర్ణోధ్ధరణ జేసి , పుణ్య ఫలము
నందినా రచ్యుతుని మనోఙ్ఞ నయన లస
దృక్కులు బడి తడిసి వినుతింప బడిరి .

వారిలో మాయూరి ప్రముఖులు మాదాసు
గంగాధరం గారు కడు ప్రధములు ,
దరిమడ్గు కామయ్య తలకెత్తుకొని కార్య
భారమ్ము వహియించె భక్తి గదుర ,
నాటి దేవాదాయ మేటి కమీషనర్
అనుమతు లిచ్చిరి , ఘనులు , వారు
మా యూరి యల్లుడు , మహిత యశులు , బాల
సుబ్రహ మణ్యము శుభ ప్రథముగ

దీని పూజాదికములకు పూని , పెను శి
లేశుడు తగు వెచ్చము లిడు , నింక నొకరు
అందె చెన్నప్ప శెట్ఠిగా రందు కొంత
ట్రస్టు రూపాన ఖర్చుకు వ్రాసి నారు .




13, మార్చి 2017, సోమవారం

మా కుల్లూరు - 3

మా కుల్లూరు
***********
అచ్యుత స్వామి మా కండ దండగ నిల్చె
శ్రీదేవి భూదేవి చేరి కొలువ
వక్షస్థలముపైన వరలక్ష్మి నివసింప
నిలువెల్ల తోమాల నిలిచి మెరయ
శంఖ చక్రాలతో శార్ఙ గదాదండ
భూషణాలంకృత మూర్తి యగుచు
గరుడుండు పాదాల కడ కొలువుండగా
మోహనాకారమ్ము ముద్దులొలుక

ఆరడుగులు మించి నిలిచి , చేర వచ్చి
మ్రొక్కు కున్నట్టి భక్తుల మ్రొక్కు దీర్చ
మహిత రమణీయ దివ్య ధామమ్ము నందు
కొలువు దీరెను కుల్లూరు నిలయు డగుచు .

మా కుల్లూరు 2

మా కుల్లూరు
***********
విజయ నగర రాజ్యములో
మజరా మా కుల్లూరు గ్రామ మద్భుత రీతిన్
అజరామరమై వెలిగెను
ప్రజలెల్లరు కలిసి మెలిసి బ్రతికిరి ఘనతన్ .

కొండొక సైన్య పటాలం
బుండిన కోటున్న దిచట , పూర్వము బలిజల్
దండి మగలు రౌతులుగా
నుండిరట , విజయనగర నియుక్తాధిపతై -

కొండమురుసు ప్రభువు కుల్లూరు నిర్మించె
చెరువు ప్రక్క సకల శ్రీకరముగ
కొలని ప్రక్క నున్న కొల్లూరు , కుల్లూరు
గాగ మారె కాల క్రమము లోన .

12, మార్చి 2017, ఆదివారం

మా కుల్లూరు - 1

మా కుల్లూరు
***********
మా కుల్లూరు పురాధి దేవత సదా మాక్షేమ ముల్గోరుచున్
రాకాచంద్ర మనోఙ్ఞ ధీధితులతో రాజిల్లు పోలేరు తా
పోకార్చున్ కడ గండ్లు రోగములు రేపున్ మాపు మా యూరికిన్
చేకూర్చున్ మహనీయ శోభనములన్ చెన్నొంద రక్షించుచున్ .

ఉత్తరాన పెన్న , ఊరికి పడమట
చెరువు , చెరువు వెనుక ధరణి ధరము ,
దక్షిణాన చేలు , దర్శింప దూరాన
పెనుశిలేశు డుండు పెన్నిధి వలె .

నాల్గు దిశల బలము నైసర్గి కమ్ముగా
కలిసి వచ్చి వాస్తు ఘనత దాల్చి
చదువులందు సిరులు సంపదలందున
చుట్టు పట్ల ప్రజల స్తుతులు బొందె .

సువిశాలమైన వీథులు
నవవిథ కులాలవాళ్ళు నవ్యత లొలుకన్
ప్రవిమల ప్రశాంత ప్రకృతిని
రవి కిరణము వోలె వెల్గు రాజస ఠీవిన్ .