సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, అక్టోబర్ 2022, శనివారం

వాన సుందరి

 


మోమొక కొంత పైకి , అర మూతలు వడ్డవి కళ్ళు , చేతిలో

మో మటు లైన ఛత్రమున , మోహన యోర్తు , తనంత వానలో

గోముగ నెత్తి దడ్వ , చినుకుల్ దిగజారి , మనోఙ్ఞ సీమలన్

పాముచు కిందికిన్ దిగెడు , భాగ్యము ఆమెద ? వానచిన్కుదా ?

వద్దనెనా !

 


వద్దనెనా మనోఙ్ఞ సుమవల్లరి మేనధరించ బూనగా

వద్దనెనా సురా మధుర పానమొకించుక సేయ బూనగా

వద్దనెనా సుధాధర భవాంగజ పూజన లంద బూనగా

వద్దనెనా వరూధిని ప్రవర్తిత స్వర్గ సుఖాలవాలమున్ .

14, అక్టోబర్ 2022, శుక్రవారం

అందాల మోహనా

 

అందాల మోహనా ! అర

విందాక్షా !  కృష్ణ !  వినతి వింటున్నావా ?

తొందరపెడుతోంది మనసు ,

కందొవ అరమోడ్పులయ్యె , కరుణే రాదా !


అలసితివా ,  శ్రీ కృష్ణా !

తులసీదళ పారిజాత తోమాలిదిగో !

గళమున వేసితి , నేనున్

అలరులతో పాటు , హృదయమందు నిలిచితిన్ .


12, అక్టోబర్ 2022, బుధవారం

మదిలో అలజడి రేగెడు

 


అరుగో , రాధా కృష్ణులు ,

చెరిసగమయి పొదలమాటు చేరిరి , కంటే ,

సరి సరి , ఈ యమునా తటి

పరిసరములు మధువు లొలికె , వారిరువురితో .


అడుగో , మురళీ మోహను ,

డడుగడుగు మనోహరాలు , అడుగులు వడ , ఆ

రడుగుల మన్మథ రూపము ,

పడుచు టెడద , దడ దడ మన , పర్వుచు నుండెన్ .


మదిలో అలజడి రేగెడు ,

మదనుని పేరురము జూడ , మరుమల్లె విరుల్

పొదివిన జడ అల్లాడెడు ,

కుదు రుండదు నీళ్ళకడవ , కోమలి ! నాకున్ .


పది జన్మలైన , కృష్ణుని

పదముల గెడన , పడియుండు బతుకె బతుకు , ఆ

పెదవుల రుచి , రుచి చూచెడు

వెదురుదె గద జన్మ , మనది వేదన సఖియా !


వగలొదవెడు , సెగలొదవెడు ,

మగటిమి మూర్తీభవించి మనముం దడుగో ,

అగుపడు , వగకాని గనగ

భిగి సడలెడు నీవి సఖియ , బేలయితి గదే !


కడవలు తేలిక లయ్యెను ,

కడుకొని బరువయ్యె యెదలు , కాంతుని కృష్ణున్

కడకంట గనిన కాంతల

నిడు మేనులు వణక సాగె , నెంతందంబో !


అతిమనోహరము

 

అర చిరునవ్వు మోమపయి అబ్బురమై మెరయంగ నింతిరో !

కరములు సాచి , విల్దొడిగి , కంజపు టమ్మును కంతుడేసి న ,

ట్లరయగ చూడ్కులన్ బరపుటల్ గననయ్యెడి , నింక నెవ్వడో

ఉరము పెటిల్లునన్ బగిలి , ఊపిరి గోల్పడుటల్ ధ్వనించెడిన్ .

అమ్మకు నీరాజనం


 పాటల రచన : వెంకట రాజారావు . లక్కాకుల

పాడినవారు : శ్రీమతి లక్ష్మీభవాని