మాటలను కూర్చి రచనల మాయజేయు
కవులు ! , పండొలిచి ప్రసంగ విథ వివిధ
భాగవత సంవిధ ప్రవచనాగమములు
సేయు బుధులు ! , మీ తీరులు చిత్త మలరు .
వృక్షో రక్షతి యందురె !
అక్షయముగ నొక్క మొక్క నల నాటి కడున్
రక్షించి పెంచి యటుపై
వీక్షింపుడు చెట్టు శోభ విభవము దెలియున్ .
మాటలకే పరిమితమై
పాటింపరు చేతలు , పరిపాటి యిదే , యీ
నోటి పసగాళ్ళ తీరని ,
మోటుగ మాటాడ , పడుట , మోమాటేలా ?
ధర్మకార్య నిరతి మర్మమ్ము దెలిసిన
మాట కంటె చేత మహిత మెపుడు ,
శుష్కవాక్య ఝరులు శూన్య హస్త చయము
గాని , యిలను , పనికి రాని వెపుడు .
ఒక్క చేతి మీద నోలి రెండొందలు
మొక్కలు తగ నాటి నిక్కువముగ
రక్షణ నొనగూర్చి రమణమై కడుపెంచి
పెద్ద జేసినాడ తద్దయు కడు .
నేడవి యిరవై యడుగులు
శోడష కళ లూని పెరిగి శుంభద్యశమై
కూడి నన పూప పిందెల
పోడిమితో కాపుకొచ్చె మోదము గూర్చెన్ .
అమ్మ గుడికి శోభ లలరారె పచ్చంగ
దర్శనీయ మగుచు తరులు లతలు ,
జన్మ ధన్యమయ్యె , జనని పోలేరమ్మ
కృపలు కూడ నాకు సఫలమగుట .