సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, మే 2018, సోమవారం

మాకుల్లూరు - నా గురించి


బలిజను నేను , పుట్టువున పావని గంగకు తమ్ముడన్ , మహా
బలితలకెక్కి త్రొక్కిన శుభంకర విష్ణు పదోద్భవుండ , స్వ
స్థలమది కుల్లురీ పురము , సంపదలందున విద్యలందు భూ
తలమున సాటిలేని ఘనతల్ గల యూరిని బుట్టితిన్ కడున్ .

కాపులలో విశిష్టతలు గల్గిన శూరుల జాతి మాది , మా
ప్రాపున ప్రాభవమ్మొడిసి పట్టెను రాయల రాజ్యలక్ష్మి , మా
చూపుల తీక్ష్ణతల్ దవిలి శోభలు గోల్పడె శత్రురాజ్యముల్ ,
భూపతులై తెలుంగు వర భూముల నేలిరి మాకులీనులున్ .

సదమల ప్రాకృతీ విభవ చైత్ర రమా రమణీయ శోభలన్
బొదివిన చెట్లు , కొండలును , పూర్ణజలాన్వితమైన చెర్వులున్ ,
నదియు , ననేక గుళ్ళు , విపినమ్ములు , స్వచ్చపు మానసమ్ములున్ ,
చదువులు , శౌర్యముల్ గదిసి చక్కని తల్లి మదీయ గ్రామమే .

చదివితి తెల్గు నాంగ్లమును సంస్కృతమున్నొక కొంత , యిష్టమై
మదికి లయించు నొజ్జదనమందున ముప్పది యెన్మిదేండ్లుగా
బ్రదికితి , లక్షలాదికి నవారిగ జీవన మార్గ సత్యముల్
విదిత మొనర్ఛి ధన్యతల వెల్గుల గాంచితి , నింత యేటికిన్ .

ఆస్తికుండనె గాని యసదు నించుకయేని
గ్రుడ్డిగా నమ్మిన గురుతు లేదు
దైవ నిందలు సేయ తలపు బారదుగాని
తాంత్రిక క్రతువులు తగులు పడవు
విశ్వంబు నియతమై విభ్రమించు నటుల
సత్య ధర్మ నియతి చాల ప్రియము
ద్వేషంబు మోసంబు వేషంబు లెరుగను
తప్పుడు పథములు తగవు మదికి

తానె గొప్పటంచు తగ విఱ్ఱవీగెడు
త్రాష్టు డన్న నాకు తగని మంట
ఒప్పు గాంచ లేక తప్పులే వెదికెడు
వెధవ లన్న పడదు బుధులలోన .

చరమ జీవితమ్ము పరమాత్మ సేవనా
నంద మగ్న సత్య సదమలముగ
గడిపి గొలగమూడి కరుణామయుడు స్వామి
వెంకయార్యు జేర వేడ్క గలదు .