సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, మార్చి 2020, గురువారం

ముద్దుగొల్పేటి మోహనాకారులు



బహు వర్ణ శోభిత పటముపై తీర్చిన
ముత్యాల తలపాగ మురువు జూడ
తిరుమణి తిరుచూర్ణ తేజో విరాజిత
భువన మోహన ప్రభన్ ముఖముజూడ
మెరయు నానాపుష్పపరిమళశోభిత
నిడువైన దండల యెడద చూడ
వెండి బంగారాలు విలసిల్లు నగిషీల
జాలరీ పట్టు దట్టీలు చూడ

కనులు చాలవు మోహనాకారుల గన
ఇద్దరొకచోట కూడిరి పెద్దరికపు
పోకడలువోవ చర్చించబూని యిటుల
శ్రీకరంబుగ బలరామ కృష్ణు లిచట .

11, మార్చి 2020, బుధవారం

శ్రీరామచంద్ర మూర్తి ఠీవి


ఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్
రాకాశోభలుగుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కంగల్గు సర్వార్థముల్ .

శ్రీకృష్ణ పరమాత్మ .....


కైవల్య మెవ్వాని సేవింప దిగివచ్చు
కామితార్థము లెవ్వ డోమి యిచ్చు
మోము జూడంగనే ముద్దొచ్చు నెవ్వాడు
మోహాలు రగిలించి ముంచు నెవడు
భక్తితో కట్టంగ పట్టువడు నెవడు
తను వినా నేది లేదను నెవండు
ఆనందమున దేల్చి యాడించు నెవ్వాడు
ముదమున దరిజేర్చు మూర్తి యెవడు

యెవడు కరుణాంతరంగుండు యెవడు యోగి
యెవడు త్రిభువన మోహను డెవడు కర్త
యెవడు భర్త జగద్గురు డెవ్వ డతని
పరమ పాదాబ్జ రజముకు శరణు శరణు .

10, మార్చి 2020, మంగళవారం

బతుకు వేసట


బతుకు వేసట కలవాటు పడి బ్రతుకుటె ,
మార్గ మింకోటి గలద యేమాత్రమైన ?
ఎందరో కష్టజీవను లుందు రిలను ,
జాలిపడ తప్పు ,  తలవంచి కేలు మొగుడు🙏

సృష్టి ధర్మము తెలియంగ కష్ట మిందు
ధర్మసూక్ష్మము వచియింత్రు కర్మ యనుచు
మర్మ మేముందొ గాని యీ కర్మకు బహు
జనులు బలియౌట వాస్తవ మని దలంతు .

ఆ పరాత్పరు డెంత దయామయుండొ
తేట తెల్ల మగుట లేద ! మాట మార్చి
మిధ్యయని సత్య మింకోటి మీకు జూపు
దనుట భావ్యమా కట్టెదుటను గనంగ .

నట్టి నడివీధిలో రాళ్ళు మోపెట్టి తలను ,
పసిది , ఇంకో పసి నిసుగు , బైట గట్టి ,
చంక బెట్టి బతుకు బాట సాగి చనుచు
మొలక నవ్వోటి విరియించు మోము గనగ .

కష్టమును చిరునవ్వుతో యిష్టపడుట
బాధ్యతను తలకెత్తుకు బతుకు టలును
ఎవరు నేర్పిరి , యీ యోర్పె యిల వెలయుచు
బతుకుటలు నేర్పె , యిదిగదా బతుకు ఘనత .