సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, ఆగస్టు 2014, శనివారం

రాధా మాధవం

ఎందుకో ఆ పున్నమి చంద్రుని కంత విచ్చుబాటు , 
వొళ్లు తెలియనంతగా పరవశిస్తున్నాడు .                                                                  
ఏమా మలయ సమీర మంద గమన మదం ,
పూదోటల పరిమళాలతో దొంతర దొంతరలుగా,
యేటి నీటి తుంపరలు వెదజల్లు చున్నాడు .
ఎంత నిగారింపు ఈ తట సైకతానికి ,
పసిడి మిసిమి మిస మిసల హొయలు పోతోంది .
              -----------
కతమేమిటో కళ్లకు కట్టినట్లు కనబడుతూనే ఉంది ,
కలువ కనుల అలల కళల జల వాహినికి .
కను కలువలు విచ్చి మరీ చూస్తోంది ,                                                                      
కాసేపైనా రెప్పలార్పకుండా .
               -----------
ఆ యమునా తట సైకత శయనంలో
పున్నమి వెన్నెల జిలుగు వెలుగులలో
ఆ ప్రణయిని
ఎంత సేపట్నించి
తన్మయత్వంతో
ఆ సమ్మోహన రూపసిని చూస్తోందో
ఆ చూపులు అనిమేషాలై
అమృతత్వాన్ని సంతరించుకున్నట్లున్నవి .
              ----------
ఎంత సేపు ఆ లీలా మానుష
మనోహర రూపాన్ని చూస్తోందో
ఆ ప్రేమ మయి
మంత్ర ముగ్ధ చిత్తరువై కన్పిస్తోంది .
ఆ నవ మోహనాంగి
ఆ మోహనాకారుని
పరిష్వంగం కోసం
పరితపిస్తున్నట్లు కన్పిస్తోంది .
నుదురు ముద్దాడింది
కనురెప్పలకు పెదాలద్దింది
చిరునగవు చికురాన్ని చుంబించింది
అధరాలకు అధరాల మధువు లందించింది
గళసీమకు కరకమలాలు కీలించింది
ఎద శయ్యపై సేదతీరింది
          ----------
ఒకరి కొకరుగా
ఇద్దరొకరుగా
ఒకే ఒకరుగా
ఆ రూపం సమ్మోహనం
ఆ తేజం మనోహరం
ఆ వదనం మధురం
ఆ నయనం మధురం
ఆ హసితం మధురం
ఆ ప్రేమ మధురాతి మధురం .
అదే రాధా మాధవం .
జగతికి -
అదే తొలి ప్రేమ కావ్యం .
       -----------
ఆ ప్రేమ కావ్య సాక్షిగా
ఆ యమునా శ్రోతస్విని
ఆనంద డోలికలలో ఊగుతూ
నిరంతరాయంగా
కొనసాగుతూనే ఉంది .


15, ఆగస్టు 2014, శుక్రవారం

కృష్ణ రారా చిన్ని కృష్ణ రారా

కృష్ణ రారా
చిన్ని కృష్ణ రారా
ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా
ఆరగించి వరములిచ్చి ఆదుకోరా

స్వఛ్ఛమైన మనసులన్ని పాల సమానం
పాలు చిలికి తీయు వెన్న ప్రేమ సమానం
ప్రేమ వెన్న నైవేద్యం ప్రియమని నమ్మితి కృష్ణా   || కృష్ణ రారా ||

తర తరాల తల్లి ప్రేమ   త్రచ్చి వెన్న తినిపించెను
మమకారపు పిచ్చి ప్రేమ    కుమ్మరించి యశోదమ్మ || కృష్ణ రారా ||

అనురాగపు ప్రేమ వెన్న    పెన వేయుచు తిని పించెను
మనసున తనువున    తానై అణువణువున రాధమ్మ     || కృష్ణ రారా ||

తరగని ప్రేమల వెన్నలు    తరచి తరచి తినిపించిరి
తమను తాము అర్పించుచు    తరుణులు గోపిక రమణులు   || కృష్ణ రారా ||

అడుగడుగున నడయాడుచు    ఆడి పాడి చెలిమి వెన్న
వనమున యమునా వనమున    తినిపించిరి గోపాలురు         || కృష్ణ రారా ||

తెలుగుల తేనియలద్దిన    పద్య సుధల భాగ్యనిధులు
భాగవతపు భక్తి వెన్న     తినిపించెను పోతన్న                  ||  కృష్ణ రారా  ||