సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, జూన్ 2020, బుధవారం

హా!తెలిసెన్ .....


హా !తెలిసెన్ కళారహసి , అద్భుతసృష్టికి ' బాపు ' చిత్రముల్
ఖ్యాతివహించు టెందులకొ , యల్లదె రంగులపాత్ర సాచె తా
చేతుల , సీత చిత్రమును శ్రీరఘురాముడు గీయుచుండగా
నాతని శిష్యుడై , యరసె నందున కౌశల మంత నేర్పుతోన్ .

9, జూన్ 2020, మంగళవారం

రారా ! మాధవ ! .....


రారా! మాధవ ! రాధతో కలిసి , చేరన్  మా కుటీరానికిన్ ,
కోరన్ కోర్కెల , నచ్యుతా! మధురమౌ  గోవింద నామామృతం
బారంగ్రోలుటదక్క ,నాదొరవు, యీపళ్ళున్, పలారంబులున్ ,
క్షీరంబుల్ గొని  పోదుగాని , హరి ! రాశీభూత ప్రేమాంబుధీ !

8, జూన్ 2020, సోమవారం

అమ్మదొంగ ! నిన్ను నందందు వెదికేను .....


ముగ్ధ మోహన రూపు మునుపెన్న డెరుగను
కృష్ణయ్య! గోపెమ్మ కృపను గంటి
ఘనశ్యామ తనుఛాయ కమనీయ మెరుగను
కృష్ణయ్య! రాధమ్మ కృపను గంటి
మల్లెల సౌరులు – మధుపర్కములు గనన్
కృష్ణయ్య! రుక్మిణి కృపను గంటి
మోవిపై పిల్లన క్రోవి ముచ్చటెరుంగ
కృష్ణయ్య!  గోపన్న కృపను గంటి

అమ్మదొంగ ! నిన్ను నందందు వెదికేను
చిన్నగా మదిలోనె జేరినావ !
చిన్నికన్న ! నిన్ను గోపెమ్మతో జెప్పి
పద్య మందు కట్టి , పట్ట గలను .

తలపున గల 'గమ్య 'మందు....


కలమందున , గళమందున ,
కలలందున , కనుల యందు , కాంక్షల యందున్
పలు పలుకు లేల ? కృష్ణుడు
తలపున గల 'గమ్య 'మందు తానై యుండున్