సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

9, మార్చి 2022, బుధవారం

రుక్మిణీ పాణి గ్రహణం

 


అరమోడ్పు కనుల , రుక్మిణి

వరుని గనును , అంతలోనె వరదుడు కనగా ,

మరుని పువుబంతి దవిలిన

పరువపు మొగ్గయె , మనోఙ్ఞ పద చిత్ర మహా !


దక్కెను రుక్మిణి యని హరి ,

చిక్కె మనోహరు డని యా  చికురాననయున్ ,

ఒక్కెడ బిగి కౌగిళులన్

జిక్కిరి , విడదీయ బ్రహ్మచేతగున తగన్ ?

ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ


 ఇదికదా ,  కృష్ణయ్య మదికి నచ్చిన సేవ

పాదాంబుజములపై యొరగుట ,

ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ

దరిసి కరముల మ్రొక్కి ప్రదక్షిణ మిడ ,

ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ

నతులతో ముంచి సంస్తుతులు సేయ ,

ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ

అకలంక భక్తి డోలికల నూచ ,

 

అన్నిటికి మించి , ప్రియమార , గిన్నె లోన

వెన్న నైవేద్య మిడి , తినిపించు సేవ

యన్న , కృష్ణయ్య కిష్టము , కన్ను గవకు

భాష్పములు గ్రమ్ము , కృష్ణయ్య పటము గాంచ .

8, మార్చి 2022, మంగళవారం

మహిళ 'మహరాణి' నేటి రామాయణమున

 బధ్ధకముగ లేచి , పడకపై కసిరిన ,

సతికి నెస్ కాఫి చేసాచి యొసగి ,

బూష్టిచ్చి పిల్లల , కష్టకష్టాల్ వడి ,

స్నానాదికముల వేసట ముగించి ,

వంట జేసి , పొసగ  వడ్డించి బాక్సులన్ ,

పిల్లలన్ స్కూళ్ళకు వెళ్ళ దిగిచి ,

సతికి దోసెలు వేసి , శాపనార్థాల్ దిని ,

మధ్యాహ్న బాక్సు ప్రేమారనొసగి ,


చచ్చి చెడుచు , ఆఫీసుకు వచ్చిపడగ ,

అచటనూ తిట్లతో చంపు ఆడబాసు

వద్దురా మోడరన్ మగవాళ్ళ వెతలు

మహిళ 'మహరాణి' నేటి రామాయణమున .


( మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )