సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, జులై 2020, శనివారం

ప్రకృతి కుంచె .....



పరమపురుషుని చేతిలో ప్రకృతికుంచె
నీటిలో అద్ది రచియించె నీ విచిత్ర ,
మేరికైనను సాధ్యమా కోరి సేయ ,
నీకు తెలియని విద్యలా నీరజాక్ష !

10, జులై 2020, శుక్రవారం

ధర్మజుడే యెందుకని ? .....


తనకన్న తెలివిడి తనమున్న వారలు
లేరను యహముచే చేర డొకడు
తనకన్న సొగసైన ఘనులు లేరను నహం
కారము కనుగ్రప్పి చేర డొకడు
మగ లైదుగురి లోన మగువ ' కింద్ర సుతుడె '
' మక్కువ ' లోపమై చిక్కె నొకతె
విలు విద్యలో తన చెలువమ్ముపై నున్న
అతిశయ మొకనికి అడ్డు నిల్చె

మరణ వేదన పడుచున్న మనుజు జూచి
పరగ నానంద పడుటచే పడియె నొకడు
తుదకు ధర్మజుం డొక్కడే ముదము తోడ
బొందితో స్వర్గమును జేరె పూజ్యు డగుచు .

9, జులై 2020, గురువారం

మొక్కనాటుము .....


ఇంటిలో నాటిన నింటిల్లపాదికీ
ప్రాణవాయువొసగి రక్షసేయు
బస్టాండులో నాట పదిమందితో నీకు
దీవన లిప్పించు పావనముగ
దేవాలయమ్ములో దీపించినాటిన
దేవుని కృపగల్గితీరు నీకు
తగ స్మశానవాటి తరువు నాటినవాడు
జన్మజన్మలకీర్తి జాతు డగును

చెట్టు నాటుము , శ్రీరస్తు, చెలిమికాడ!
పుట్టువుకు సార్థకమ్మగు, గిట్టికూడ
బతికియుందువు, చెట్టురూపాన, వంద
లేళ్ళు, భూమిపై చావు జయించి సఖుడ !

5, జులై 2020, ఆదివారం

గురుపూర్ణిమ శుభాకాంక్షలు

వందే కృష్ణ జగద్గురుమ్ సురమునివ్రాతాది సంపూజితమ్ వందేవ్యాసమునిమ్ పురాణపురుషమ్ వాగీశ్వరమ్ ఙ్ఞానదమ్ వందే సాయి పరాత్పరమ్ సకలదేవవ్రాత రూపాద్భుతమ్ వందే సర్వగురుప్రపంచవిభవమ్ భాస్వంత మోక్షప్రదమ్ .

కృష్ణం వందే జగద్గురుమ్

శిఖిపింఛ వలయిత శీర్ష కుంతలభార
విపినప్రసూనాక్ష వీక్షితుండు
గిరిధాతు చిత్రిత తిరుతిలక మనోఙ్ఞ
వర రుచిర నిటల వర్ణితుండు
అమృత మ్మొలుక వేణు వనయమ్ము మ్రోయించు
లావణ్య రూప విలాసితుండు
బాల తమాల వినీల మంగళ తనూ
ప్రభల చెలంగు పరాత్పరుండు

నందబాలుండు , కృష్ణుండు , నగధరుండు
వాసుదేవుండు , గోగోప వర సఖుండు
గరిమ గీతోపదేశ జగద్గురుండు
మదిని సాక్షాత్కరించె నమస్కరింతు .


కృష్ణుణ్ణి తలుస్తేనే –

జగత్తంతా ‘ ఆడతనం  పరచు కొంటుంది .

‘ మథుర భక్తి  మనోఙ్ఞమై విరుచు కుంటుంది .

జగన్నాధుని ఆరాధనతో ‘ మనోనేత్రం తెరుచు కుంటుంది .



కృష్ణుని పేరు వింటేనే –

జగత్తుకు ‘ భగవద్గీత  విన్పిస్తుంది .

‘ అధర్మంపై  ధర్మ పోరాటం మొదలౌతుంది .

ఆర్తులకు జగన్నాధుని ‘ ఆశ్రయం  లభిస్తుంది .



కృష్ణుని రూప లావణ్యం చూస్తేనే –

జగత్తులోని ‘ అందమంతా  కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది .

ఆత్మకు ‘ అనిర్వచనీయమైన  ఆనందం కల్గుతుంది .

జన్మాంతర దు:ఖాలకు ‘ విముక్తి  లభిస్తుంది .



‘ మోవి  తాకిన ‘ క్రోవి   మోహనరాగ మాలపిస్తుంటే 

ప్రకృతి యావత్తూ సమ్మోహిత మైన ఈ వేళ

‘ బృందావన విహారిని  స్మరించు కొందాం .



మహాత్ముల సంస్మరణ

మానవ జీవితాలకు

మార్గ దర్శనం చేస్తుంది .



జగన్నాధుని  కని పెంచిన దేవకీ-వసుదేవులనూ , యశోదా-నందులనూ –

కృష్ణ ద్వైపాయణుణ్ణీ , కృష్ణనూ , కృష్ణ సచివుణ్ణీ –

రాధ , రుక్మిణి , మీరా , జయదేవుడు , వామదేవుడు , క్షేత్రయ్య మొదలైన భక్త శిఖా మణులనూ –

కృష్ణుణ్ణి తెలుగు వాకిటికి తెచ్చి , ప్రతిష్ఠించిన పోతన్ననూ

కన్నయ్యతో పాటు ‘ గురుపౌర్ణమి  రోజున

స్మరించు కుందాం .

“ కృష్ణం వందే జగద్గురుం