విపినప్రసూనాక్ష వీక్షితుండు
గిరిధాతు చిత్రిత తిరుతిలక మనోఙ్ఞ
వర రుచిర నిటల వర్ణితుండు
అమృత మ్మొలుక వేణు వనయమ్ము మ్రోయించు
లావణ్య రూప విలాసితుండు
బాల తమాల వినీల మంగళ తనూ
ప్రభల చెలంగు పరాత్పరుండు
నందబాలుండు , కృష్ణుండు , నగధరుండు
వాసుదేవుండు , గోగోప వర సఖుండు
గరిమ గీతోపదేశ జగద్గురుండు
మదిని సాక్షాత్కరించె నమస్కరింతు .
కృష్ణుణ్ణి తలుస్తేనే –
జగత్తంతా ‘ ఆడతనం ’ పరచు కొంటుంది .
‘ మథుర భక్తి ‘ మనోఙ్ఞమై విరుచు కుంటుంది .
జగన్నాధుని ఆరాధనతో ‘ మనోనేత్రం’ తెరుచు కుంటుంది .
కృష్ణుని పేరు వింటేనే –
జగత్తుకు ‘ భగవద్గీత ’ విన్పిస్తుంది .
‘ అధర్మంపై ’ ధర్మ పోరాటం మొదలౌతుంది .
ఆర్తులకు జగన్నాధుని ‘ ఆశ్రయం ’ లభిస్తుంది .
కృష్ణుని రూప లావణ్యం చూస్తేనే –
జగత్తులోని ‘ అందమంతా ’ కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది .
ఆత్మకు ‘ అనిర్వచనీయమైన ’ ఆనందం కల్గుతుంది .
జన్మాంతర దు:ఖాలకు ‘ విముక్తి ’ లభిస్తుంది .
‘ మోవి ’ తాకిన ‘ క్రోవి ’ మోహనరాగ మాలపిస్తుంటే
ప్రకృతి యావత్తూ సమ్మోహిత మైన ఈ వేళ
‘ బృందావన విహారిని ’ స్మరించు కొందాం .
మహాత్ముల సంస్మరణ
మానవ జీవితాలకు
మార్గ దర్శనం చేస్తుంది .
జగన్నాధుని కని పెంచిన దేవకీ-వసుదేవులనూ , యశోదా-నందులనూ –
కృష్ణ ద్వైపాయణుణ్ణీ , కృష్ణనూ , కృష్ణ సచివుణ్ణీ –
రాధ , రుక్మిణి , మీరా , జయదేవుడు , వామదేవుడు , క్షేత్రయ్య మొదలైన భక్త శిఖా మణులనూ –
కృష్ణుణ్ణి తెలుగు వాకిటికి తెచ్చి , ప్రతిష్ఠించిన పోతన్ననూ
కన్నయ్యతో పాటు ‘ గురుపౌర్ణమి ’ రోజున
స్మరించు కుందాం .
“ కృష్ణం వందే జగద్గురుం “
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి