సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, మార్చి 2014, శనివారం

ఏమ్మా ! వింటున్నావా ?ఏమ్మా!
వింటున్నావా ?
ఔను ! కూతుర్నేనమ్మా !
నాన్నకూతుర్ని!

కొడుకును కాదమ్మా!
నీ ముద్దుల కొడుకును కాదమ్మా!
కొడుకును కన్నందుకు పొంగి పోతున్నావా ?
కొడుకంటే ఎందుకమ్మా అంతిష్టం ?
ఇద్దర్నీ ఒక్కలాగే పెంచవేమమ్మా ?
ప్రేమానురాగాల్ని ఒక్కలాగే పంచవేమమ్మా ?
వాడికేమో కాన్వెంటూ -
నాకేమో గవర్న్ మెంట్ స్కూలూనా ?
నాచదువు ఊళ్ళో ఉన్నంతవరకేనా ?
ఉన్నత చదువులు మాత్రం వాడికేనా ?
ఉధ్ధరిస్తాడను కుంటున్నావా ?
కొడుకు మీది మోహంతో -
కళ్ళు మూసేసుకోకమ్మా !
మరీ అంత మురిసి పోవద్దమ్మా !

నీ మురిపెం వల్లే -
వాడిల్లా తగలడింది
మంచీ చెడులు మంటి కింద పాతేస్తున్నాడు
కీర్తి ప్రతిష్టలను కిరాతకాల కెక్కిస్తున్నాడు
మాన మర్యాదలు మరుస్తున్నాడు

ముదిమిలో ముద్ద పెడతాడనుకుంటున్నావా ?
చచ్చింతర్వాత తలకొరివి పెడతాడనుకుంటున్నావా ?
బ్రమలో బతకొద్దు
తల్లీ తండ్రీ అనుకునేదీ
దగ్గరికి తీసుకునేదీ
తుదకు,
తలకొరివి పెట్టేదీ
ఈ తనయేనమ్మా!

వాణ్ణైనా నన్నైనా
కాస్త కఠినంగా అనిపించినా
కష్టమూ సుఖమూ తెలిసేట్టు
క్రమశిక్షణతో పెంచమ్మా
కళ్ళు మూసుకో వద్దమ్మా
గారాంచేసి చెడగొట్టొద్దమ్మా
అవనీ తలాన్ని-
అమృతమయం చేయడం
అమ్మకే సాధ్యమమ్మా
                                                                                                                                                               (మహిళా బ్లాగరు లందరకూ 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు)
6, మార్చి 2014, గురువారం

ఘనత బొగడంగ .....
శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ
ప్రభవించి నడిచిన భరత భూమి
వేదాది వాజ్ఞ్మయ విజ్ఞాన వీచికల్
పరిమళించిన పుణ్య భరత భూమి
బౌధ్ధాది మతముల వర బోధనామృత
ఫలములు మెక్కిన భరత భూమి
గాంధీ మహాత్ముని ఖడ్గమయి అహింస
దొరల చెండాడిన భరత భూమి

ఘనత లానాడు , ఇప్పుడీ కన్నులెదుట
సాక్ష్యమై నిల్చె దోపిడీ స్వామ్య మగుచు
నీతి మాలిన నేతల చేతుల బడి
పరువు గోల్పోయె నకట ! నా భరత భూమి   

4, మార్చి 2014, మంగళవారం

..... మహిళ మహిమాన్వితా మూర్తిఅత్తలు కోడళ్ళు ఆడబడుచులు పర
         స్పరము సహకరించి బ్రతుకు రోజు
ఇరుగింటి పొరుగింటి ఇల్లాళ్ళ కష్టాలు  
          ఇంతుల కానంద మిడని రోజు
పక్కింటి తగవులు పడతికి టిక్కెట్టు
          లేని వినోదమ్ము కాని రోజు
మనకెందు కంటూనె  మాట పొల్లులు వోక
           పలు ప్రచారాల పాల్పడని రోజు

చెలగి ఈర్ష్య లసూయలు  స్త్రీకి సహజ
మని  జగమ్మున భావింప బడని రోజు
స్త్రీకి స్త్రీ శత్రు వను పేరు చెరగు రోజు
మహిళ మహిమాన్వితా మూర్తి , మాన్య చరిత .