సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

17, ఆగస్టు 2021, మంగళవారం

కృష్ణుని రూపలావణ్యాలు

 


కృష్ణపరమాత్మ శోభనకృత మనోఙ్ఞ

రూపలావణ్యములుగాంచి రుక్మిణిసతి

అచ్చెరువు జెంది నిచ్చేష్టయయ్యె , పోత

నకును కట్టెదుట గన్పట్టి నటులె దోచు .

16, ఆగస్టు 2021, సోమవారం

కృష్ణపరమాత్మతోడి మమేకమంద

 


కృష్ణపరమాత్మతోడి మమేకమంద ,

భక్తురాలెంతగా కోరి పరితపించు

నో , దెలియ , పోతనకు మించి , యొరులెరుగరు ,

భాగవతము తెలుగులకు భాగ్య పేటి .


5, ఆగస్టు 2021, గురువారం

ఈ పూబంతి .....

 



ఈ పూబంతి విహారపు

టూపులు చూడంగ , మదను డుధ్ధతుడై , పూ

దూపులు సంధించె ననగ

బో ! పైనా కింద మొత్తమూ పూదండల్ .

24, జులై 2021, శనివారం

గురుపౌర్ణమి శుభాకాంక్షలు



పరమాత్మ ' కృష్ణుడే ' సరి జగద్గురుం

డిల భగవద్గీత వెలయ జెప్పె ,

వేద పురాణాలు వెలయించి గురుడయ్యె

' వ్యాసుండు ' భువిని సేవలు గడించి ,

శ్రధ్ధా సబూరి యాచరణగా బోధించి

' సాయి ' సద్గురుడయ్యె సకల జగతి ,

తగ నుపాధ్యాయులై తనరు ' యొజ్జలు ' గూడ

గురువులు జగతికి గురుతుగాను ,


నేడు గురుపౌర్ణమి , వ్యాసమునీశ్వరుని జ

యంతి , పరమేశ్వరాకారు లైన మేటి

గురువు లందరి భజియింతు , తరిమి చీక

టులను , వెలుగులు తెచ్చిరి యిలకు గనుక .

23, జులై 2021, శుక్రవారం

రామోనామ బభూవ .....

 


రాముండుండెను - ఊ , తదీయ సతి పేరా సీత - ఊ , తండ్రి యా

ఙ్ఞామూర్ధన్యుడు వోయి తా మడవులన్ దాటంగ- ఊ , రావణుం

డామెన్ మోసముతో హరించెను - ఉ , నిద్రార్థ మాతల్లి శ్రీ

రామున్ గాధను విన్చ నూయనుచు , నిద్రన్ , లక్ష్మణా విల్లు వి

ల్లీమంచున్ పలవించు కృష్ణుడు సదా యిచ్చున్ మహార్థంబులన్ .

                          *****

రామో నామ బభూవ, హుం, తదబలా సీతేతి, హుం,తౌ పితుః 

వాచా పంచవటీ తటే విహరతః తామాహర ద్రావణ:l

నిద్రార్ధం జననీ కధామితి హరే:హుంకారతః శ్రుణ్వతః 

"సౌమిత్రే!క్వధను ర్ధను ర్ధను" రితి వ్యగ్రాః గిరః పాతు నః ll

ఇది 'రామకర్ణామృతం'లో ప్రస్తావించబడిన శ్లోకం.

సద్గురు సాయినాధునికి 🙏 లు

 


అకలంక సాయినాధుని

సకలానిమిషస్వరూపు సద్గురుని సదా

ప్రకటిత భక్తి ప్రపత్తుల

ముకులితకరకమల 🙏 స్తోత్రములసేవింతున్ .

22, జులై 2021, గురువారం

ఓహో ! చపాతీ ఇలా కూడా చెయ్యొచ్చు !

 



రుద్దేది గుండు మీదా ,

అద్దుచు కాల్చేది చూడు డైరన్ మీదా ,

అద్దిర ఇల్లాల్లంటే ,

బుధ్ధులు మరి కొత్త కొత్త పోకడలు గదా !


17, జులై 2021, శనివారం

నిన్ను దర్శించక .....

 


నిన్ను దర్శించక నీలమోహనరూప !

కన్నులున్నందున ఘనత యేమి ?

నిన్ను సేవించక నీరజాత నయన !

చేతులున్నందున శ్రేయ మేమి ?

నిన్ను భజించక నిగమ శుభగరూప !

నోరు గల్గుట వల్ల  సౌరదేమి ?

నిన్ను వినక మహనీయ ఘనచరిత !

చెవులు గల్గుట వల్ల  స్థితి యదేమి ?


మాధవా ! నిను విడి మరిమరి బతికినా

బతుకుకు పరమార్థ పరత యేమి ?

కృష్ణ ! నిన్ను జేర కెన్ని బొందినగాని

ఘనత యే మిహ పరముల కాంక్షదీర .

10, జులై 2021, శనివారం

ఆ యరమూతవడ్డ కను .....

 



 ఆ యరమూతవడ్డకను , లా నవమోహన నాసికా శిరో

లాయకభూష , కర్ణకమలాలు , మనోఙ్ఞపుభ్రూలతల్ , ముఖ

శ్శ్రేయముగాగబొట్టు, నడుచెక్కిలినొక్కును - నందమంత నా

రాయణు బొట్టి ,గుట్టయిడి, రమ్యముగా నినుజేసె నింతిరో !

28, జూన్ 2021, సోమవారం

తెలిస్తే కాస్త చెబుదురూ .....

అర్థంకావడం లేదు , కిటుకేమిటో .....
                         -----       
రామకృష్ణపరమహంసను గూర్చి విన్నాను .
సాయిబాబా గురుచరిత్ర చదివేను . గొలగమూడి వెంకయ్యస్వామిని చిన్ననాటినుండి స్వయంగా చూచేను . చిరుగులుపడ్డ అర్థముతకచొక్కా , ముతకపంచె ,  నాలుగిళ్ళు యాచించి తెచ్చిన అన్నం
నలుగురికి పెట్టి , మిగిల్తే ఏమి తిన్నాడో లేదో . ఇదీ జీవన విధానం . ఆరోజుల్లో జనాలకు ఆయనంటే విపరీతమైన నమ్మకం . మనుషులకు , పసువులకూ
నోటి దీవెనతోనే స్వాస్త్యం కలిగేది . ఏపనిచెయ్యాలన్నా ఆయన సలహాపొందేవారు . పాటించి లబ్ధిపొందేవారు .
డబ్బును దగ్గరకు చేరనిచ్చేవారు కాదు .
          వెంకయ్యస్వామి మా ప్రాంతంలో పుట్టిపెరిగిన వాడు . అందునను  నేనెరుగుదును . ఇక్కడ చెప్పిన వీరంతా లోకకళ్యాణంకోరి జీవించినవారే . 
              ఇక , రెండోవర్గం .  ఈ వర్గంలో కూడా నేను   స్వయంగా  చూచిన వాళ్ళున్నారు . 
               పసుపురంగు ఏక వస్రం . మెడలో రుద్రాక్షలు .
బవిరిగడ్డం . కొందరైతే ట్రిమ్మింగ్ రంగూ రెండూను .
వెదురుకర్ర , దానికి రెండు పేలికలు . ఇంట్లో భగవత్స్వరూపం పెద్ద పెయింటింగ్ . నిత్యం మండే గుండం . స్వీయనామం చివర స్వామి అనేపేరుతో ప్రచారం . బ్రహ్మఙ్ఞానులమని స్యయంగా చెప్పుకుంటారు . ( నాకుతెలిసును. వీరి పూర్వాశ్రమాలు
పరమ నికృష్టము  ) 
              మొత్తానికి స్వామీజీలుగా క్లిక్కయ్యారు . ప్రస్తుతం బిజీ . బాగా చదువుకున్న వారు ,బడా రాజకీయనేతలు , ఉన్నతుద్యోగుల క్యూ . ఇక , సామాన్యుల సంగతి చెప్పక్కరలేదు కదా . డబ్బు పోగేస్తున్నారు స్వామీజీలు . ఇబ్బందులు పడేవాళ్ళేగదా వీళ్ళను దర్శించేది . ఆశించిన ప్రయోజనాలు ఒనగూరితేనేగదా డబ్బులొచ్చేది . ఇతోధికంగా ఈ స్వాముల సందర్శకులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడం దేన్నిసూచిస్తుందో ఇదిమిధ్ధంగా ఊహకందడంలేదు . నాకంతటి ప్రతిభాయుత్పత్తులు లేవు . ఇందున వైదుష్యంగల పెద్దలు పైరెండువర్గాల లోకకళ్యాణాల గూర్చి బోధ సేయగలరు . అట్టివారికి ముందుగా నమోవాకములు .

25, జూన్ 2021, శుక్రవారం

చూడ రారండు , కళ్యాణ శోభనములు

 


నేడు మా కుల్లూరులో శ్రీదేవీభూదేవీ సమేత 

శ్రీఅచ్యుతప్ప తిరుకళ్యాణం .

------------------------------------

తిరువాభరణములు దీసి పక్కనబెట్టి

ఇమ్ముగా హరికి గోణమ్ము గట్టి

పన్నీట దడిసిన పచ్చడమ్ములు దెచ్చి

లలితంపు రొమ్ము తల మొలజుట్టి

తుమ్మెదమైచాయ దొడరు నచ్యుతునికి

శిరసాది పచ్చ కప్పురము నలది

కన మల్లె పూవల్లె కన్నుల కింపైన

స్వామికి పునుగు జవ్వాది పట్టి


శుక్రవారాన , నేడు , అచ్యుతుని , పెండ్లి

కొడుకుగా గయిసేసిరి , నడిచి వచ్చె

వేదికకు , ముద్దుసతులతో , వేడ్క మీర

చూడ రారండు , కళ్యాణ శోభనములు .

20, జూన్ 2021, ఆదివారం

కిట్టయ్యా ! నిన్ళొదిలే దెట్టయ్యా

 


కిట్టయ్యా ! నిన్ళొదిలే

దెట్టయ్యా ! నీవులేక , తిండీ నిద్రా

పట్టేనా ? వెళ్ళొద్దే

తట్టూ , ఆతట్టు బిల్చె తానెవ్వత్తో .


ఎదయిల్లు వీడి బయటికి

వదులుదునా యేమి ? కృష్ణపరమాత్మను , నా

మదిలోని భక్తిపాశము

కదలంగానీదు , కట్టు , గట్టిగ స్వామిన్ .


హరిభక్తి పరాకాష్టకు

పరవశమే యవధి , కృష్ణపరమాత్మ , మనో

సరసీరుహమందు , సతత

వరదుండగుగాత ! మనకు , ప్రస్తుతి జేతున్ .

                       🙏


17, జూన్ 2021, గురువారం

పరమాత్మ శ్రీవిభూతి .....

 


చంద్రరేఖావిలాస భాస కమనీయ

హరు జటాజూట విథ మనోహర విచిత్ర

చిత్ర మగుపించు , పరమాత్మ శ్రీవిభూతి

జగతి నావిష్కృతంబయ్యె , జయతు జయతు . 🙏

వాసుదేవా ! నమోస్తు , తే , వనజనాభ !

 


శంఖ చక్ర గదా ధారి , శౌరి , కృష్ణ

విమల మురళీధరా , శిఖిపింఛమౌళి

నందనందన , బృందావనే  విహారి

వాసుదేవా ! నమోస్తు , తే , వనజనాభ !


5, జూన్ 2021, శనివారం

డెభ్భైయొకటో పడిలో .....

 


డెభ్భైయొకటో పడిలో

నిభ్భంగిన్ బడె వయస్సు , నీ ఆశీస్సులతో

నిబ్బరముగ , నిన్గొలుచుచు

నిబ్బడి ముబ్బడి రుజలను నిలిచి గెలిచితిన్ .


మాయమ్మా ! పరమేశ్వరి !

హాయిగ నీ కడుపుతీపి యమృతపు సరసిన్

శ్రేయమ్ములు గంటి , గడమ

ప్రాయమ్మువరకు వదలకు , పదములు 🙏 వీడన్ .


13, ఏప్రిల్ 2021, మంగళవారం

హరికి ఉగాదిపచ్చడి

 


అల్లన నూనె జమిరి , ఆ

నల్లని మేనంత చిదిమి , నలుగెట్టి , హరిన్

మెల్లన కైసేసె మగని ,

తెల్లారకముందె సత్య , తెలుగుంగళలన్


ఇదుగో ! ఉగాది పచ్చడి ,

కుదురుగ కూర్చునుము స్వామి ! , కొంచము తిను , ఆ

తదుపరి నైవేద్య మిడుదు ,

' కుదరదు సత్యా! ఇదేమి ? గొంతుదిగుటలే ' .


స్వామీ ! మనమిపుడు , తెలుగు

భూమిపయి , ఉగాదిపర్వమున, కొలువయి యు

న్నా , మిచటి సంప్రదాయము ,

నామాట విని తినవలె , ప్రణామము లిడెదన్ .


సత్యమాట వినెను , సరసిజాక్షుడు తినెన్ ,

తినగ తినగ వేము తియ్యనయ్యె ,

ఆరు రుచులు గలిసి అద్భుత భక్ష్యమై

హరికి అమృతోప మయ్యె , స్వస్తి 👌 .

ఉగాది శుభాకాంక్షలు

 


'ప్లవ' - యైవచ్చె శుభస్యశీఘ్రమనగా భాగ్యప్రదోగాది నూ

త్న వసంతం , బిలకున్ , దెలుంగులకు హృద్యంబై , మనోల్లాసమై 

స్తవనీయంబయి  భోగభాగ్యములగూర్చన్ , జీవసంజీవియై ,

భువన ప్లావిత నందదాయకముగా , మోదప్రదాయంబుగా .

18, మార్చి 2021, గురువారం

Vaccinated Covisheild

 

Vaccinated Covisheild on this day .

చెవి మెలివెట్టి చెప్పినను .....

 


చెవిమెలివెట్టి చెప్పినను చెయ్దము మాన విదేమి కృష్ణ! ఎం

త వినయమున్నటించెదవు నాయెదుటన్ ?,యిక కాదుగాని, నిన్

దవిలిన దెయ్యమున్ విడుతు దా యిటు యంచు, యశోద కొట్టగా

దవిలి, కరమ్ములాడక ,యెదన్ దగహత్తిలి, ముద్దులాడెడిన్ .

17, మార్చి 2021, బుధవారం

నిరీక్షణ

 


సమయము సంధ్య , సూర్యుడు నిశాగృహమేగగ దోచుటల్ గవా

క్షము వెలుపట్ల గాననగు , సారసలోచన కొంతవట్టు పొ

త్తము పఠియించె ,  చేత జతతామరలున్ వసివాడె , నెంతకున్

రమణుడు రాడె , నోరుములు రాయిడి కెక్కెడు, రాత్రిదక్కునో ?! .



భ్రమలో యశోదమ్మ

 


నాకృష్ణయ్య యదార్థమా?భ్రమయ?నేనాతల్లినేనా?నిజ

మ్మా? కల్లా? ఎరుగంగలేనయితినే! మార్వల్కరెవ్వార,లీ

నా కళ్లేనను మో‌సగించెడినె, కన్నా ! నీవె దిక్కియ్యెడన్,

నీకే సాధ్యముతండ్రి ! బాపు భ్రమలన్ నీరేజపత్రేక్షణా !

14, ఫిబ్రవరి 2021, ఆదివారం

నమో సంకీర్తనాచార్యా ! 🙏

 


తిరువాభరణములు దీసి పక్కనబెట్టి

ఇమ్ముగా హరికి గోణమ్ము గట్టి

పన్నీట దడిసిన పచ్చడమ్ములు దెచ్చి

లలితంపు రొమ్ము తల మొలజుట్టి

తుమ్మెదమైచాయ దొడరు వేంకటనాధు

శిరసాది పచ్చ కప్పురము నలది

కన మల్లె పూవల్లె కన్నుల కింపైన

స్వామికి పునుగు జవ్వాది పట్టి


శుక్రవారాల నలవేలు శోభనవతి

యొనర కైసేసె మగని , ఆ యొంపుసొంపు

గన్న , పాడిన సంకీర్త నాన్నమయ్య

దెన్ని జన్మల తపమొ నా కెన్నతరమ! 🙏 .

6, ఫిబ్రవరి 2021, శనివారం

జిలకర బెల్లము


 నెత్తిన జిలకర బెల్లము

ఉత్తర దక్షిణ ధృవాల నొహటిగ గలుపున్ ,

హత్తెరి బ్రహ్మా ! ఇది నీ

జిత్తులమారి మనోహర చేష్టయె సుమ్మా !


పెద్దచదువులకు పెట్టిందిపేరుగా .....

 


పెద్దచదువులకు పెట్టిందిపేరుగా

విఙ్ఞాన జ్యోతులన్ వెల్లివిరిసె ,

గొప్పగు కొలువుల కొప్పుల కుప్పయి

దశదిశల విఙ్ఞతల్ దఖలుపరచె ,

అప్రతిమాన మహాప్రతిభలు గల

ఘననాయకత్వ ప్రఙ్ఞల జెలంగె ,

ధనదాన్య సిరిసంపదల దులతూగుచు

చుట్టూర పల్లెలన్ పట్టుగలిగె ,


నాదు కుల్లూరు గ్రామ ఘనత గురించి

జనులు వొగిడిరి , నేడు నిశానిగాళ్ళ

వికృత చేష్టలు గనగ , ఆ విభవమెల్ల

బూడిదను బోయు పన్నీరు బోలు నకట !

ఆనాటి రూపురేఖలు .....

 




నేనే !   నేనే  !   నేనే !

నేనేనా ? యనెడు ప్రశ్న నేడుదయించున్ ,

ఆనాటి రూపురేఖలు

నానాటికి మారిపోవు ననుట సహజమే .

గోడకె చెవి బెట్టినాడు కోరి మరీనూ !

 



గోడకు చెవులుంటాయని

చేడియలను గూర్చి జనము చెప్పుట దెలియున్ ,

వీడెవ డండీ బాబూ  ?

గోడకె చెవి బెట్టినాడు కోరి మరీనూ !

27, జనవరి 2021, బుధవారం

వందనం సైనికా !

 


గుండెల నిండా కొలువై ,

దండిగ నీ భరత ప్రజల తను మనసులలో

నిండుగ నో సైనిక ! నీ

వుండాలయ్యా ! నమామి , యుధ్ధతుడవుగాన్ .

20, జనవరి 2021, బుధవారం

పరమ బంగారుతల్లికి ప్రణతు🙏🙏 లివిగొ!

 


పద్మాక్షి పద్మిని పద్మాసనాసీన

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ!

ఐశ్వర్యదాయిని అమృతప్రదాయిని

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ!

ఙ్ఞానప్రదాయిని కరుణాంతరంగిని

బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ!

ఆరోగ్యదాయిని అభయప్రదాయిని

బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ!


అభయమిచ్చి కాపాడు మాయమ్మ , కొలువు

దీరె , నదిగొ పోలేరు , కుల్లూరున ,  పర

మేశ్వరీపరంజ్యోతి రక్షించు తల్లి

పరమ  బంగారుతల్లికి ప్రణతు🙏🙏 లివిగొ!

18, జనవరి 2021, సోమవారం

రంగా ! శ్రీరంగా !

 


రంగా !  శ్రీరంగా !   ఈ

మంగళకర దివ్యభంగిమము మహనీయం,

బంగాంగ మనోఙ్ఞము, శుభ

సంగమము కనంగ మాకు, జగదాధారా !

కొండపిండిమొక్క

 


' కొండపిండిమొక్క '  గొప్ప ఓషధి, మూత్ర

నాళరాళ్ళు కరుగునట , సమూల

ముగ గ్రహించిన గుణము గలుగునండ్రు , ఈ

మొక్క వివరమెరుగ బూను కొనుడు .

17, జనవరి 2021, ఆదివారం

నా దేశం ఘనత .....

 


అమెరికా యిచ్చింది ఆయుధాలను జగతి

కందుకుని చంపుకోమని మనుజుల ,

పాకీస్థ నిచ్చింది పలుయుగ్రవాదులన్

మనుజులన్ జంపు దుర్మార్గపథము ,

చైన యిచ్చింది వంచనతోడ ఘన వైర

సులను , చావాలని యిల మనుజులు ,

నాదేశ మొక్కటే ప్రోదిగా మందుల

నందించి ప్రాణదానమ్ము సేసె ,


హైందవపు సచ్చిదానంద సుందరతర

జీవనవిధాన శోభల పావనతలు

దాల్చి , నా  భారతము జగదభిహితమ్ము

గోరి , యెల్లవేళల సమకూర్చు శుభము .

15, జనవరి 2021, శుక్రవారం

చేటలో బియ్యం

 


పురివిప్పి నాట్యమాడెడు

పరిపరి ఈ చేటలోని వరిబియ్యం , బ

త్తరి మోమున నగవులసిరి

మరిమరి విరిసెను, మనోఙ్ఞమై, మగువకునూ .

13, జనవరి 2021, బుధవారం

పరమాత్మ బహుమతి .....

 


ప్రకృతి చిద్విలాసపర భోగభాగ్యాల

సిరులు తరలివచ్చి శ్రీకరముగ

పుడమికి దిగువేళ బొడమె నీసంక్రాంతి

మాధవు బహుమతిగ మనుజ తతికి .

12, జనవరి 2021, మంగళవారం

పెద్ద(ల)పండుగ శుభాకాంక్షలు

 


ఆది మధ్యాంత రహితు డీ అమ్మకొఱకు

అంగలార్చుటజూడ , హే రంగ ! రంగ!

ఎంతలమటించె ! పరమాత్మ , ఇంతదనుక ,

తల్లిప్రేమను రుచిజూచు తహతహయిది .


8, జనవరి 2021, శుక్రవారం

అద్భుత శిల్పము 🙏

 


హద్దే లేదీ ఘనతకు

తద్దయు మన శిల్పకళ గత విభవము గనన్ ,

ఎద్దును గననగు నొకవై

పద్దెస నేనుంగు గనగవచ్చు చతురతల్ .


ఆండాళ్ - శ్రీరంగనాధుల కళ్యాణ వైభోగమే భోగిపండుగ

 


ఆండాళ్ - శ్రీరంగనాధుల

కళ్యాణ వైభోగమే భోగిపండుగ

---------------------------------------

తనపూలవనములో దొరి

కిన పాపకు, విష్ణుచిత్త కేశవదాసుం

డొనరగ ' కోదై ' నామం

బును, పూమాలయను, నర్థమున పేరిడియెన్ .


కోదై గోదాయయ్యెను

గోదా శ్రీరంగనాధు కూరిమి బొందెన్

శ్రీదామ మామె ముడువగ ,

మోదముతో తానుదాల్చె మురహరి ప్రీతిన్ .


గోదా కొప్పున ముడిచి , ప్ర

మోదముతో విడిచి పంపు, పూమాలలె , నా

మోదింతుననుచు, కలలో

శ్రీదాముడు వలుక , కూతురిన్ వేనోళ్ళన్


వొగుడుచు,' నాండాళ్ ఆండాళ్ '

తగ బిలిచెను, మురిసి తండ్రి , 'తల్లీ' యనుచున్,

జగ మంత, టామె నాండాళ్ 

యని బిలువగబట్టి గోద, ఆండాళ్ అయ్యెన్.


రోజూ వొకపాశురమున 

రాజీవాక్షుని నెలంత రాగసుధలతో

పూజించ మెచ్చి యామెను

మోజున శ్రీరంగనాధమూర్తి వరించెన్


తుది , భోగి రోజు , రంగడు

ముదితను కళ్యాణమాడె ముచ్చటవడి,  ఇ

వ్విధ వైభోగపు కళ్యా

ణ ధగధగకు ' భోగి ' యనగ నాదిన మొప్పెన్ .

కన్ను లరమోడ్పు లయ్యెను .....

 


కన్ను లరమోడ్పు లయ్యెను

పన్నుగ హృదయాలు తనిసి పరవశమయ్యెన్

వెన్నుని రాధిక తనువులు

మన్ననతో పెనసి ప్రేమ మధువులు పండెన్ .

6, జనవరి 2021, బుధవారం

గుట్టుగ నొకచో నిలువడు

 


గుట్టుగ నొకచో నిలువడు ,

నెట్టన పొరుగిండ్ల దూరు నితడని తాడున్

గట్టెను సత్యాసతి, చే

పట్టి కరంబుల, నితండు పట్టుంబడునా ?


గట్టి మేల్ తలపెట్టవోయ్

 



తనసంపద, అధికారము,

ఘనవైదుష్యములవల్ల గౌరవమొనగూ

డున ? రా , దితరుల కందిం

చిన మేలొకటే , మనుజు విజితునిగ నిల్పున్ .


కోటలు దాటే మాటల

చాటింపులవల్ల మేలు జరుగదు జగతిన్,

దీటుగ మేల్ తలపెట్టి, న

దాటుగ సేయంగ నొరుగు, ధార్మిక కృతులన్ .

రానీవా ? మేనువిడిచి .....

 


ఓ నీలా  ! నీలాలక !

రానీవా మేనువిడిచి రాజీవాక్షున్ ,

శ్రీనాధుగొలువ నిదిగో !

మానినులము వచ్చినాము మంజులవాణీ !


5, జనవరి 2021, మంగళవారం

ఓగుదగిడీలు

 


' దేశభాషలయందు తెలుగు లెస్స' ని వల్కె,

రాయలు కర్ణాట రాజరాజు,

' సుందర తెలుగ ' ని చొక్కి వచించె, సు

బ్రహ్మణ్యభారతిరా , తమిళుడు ,

అరయ ' ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్ ' అంచు, ని

కోలకోంటి ఒక ఇటాలి మెచ్చె,

' అద్భుత ' భాషని అరచి చెప్పెను, బ్రౌను

ఇంగ్లీషుదొర గణియించి ఘనత,


దేశ దేశాల పండితుల్ తెలుగు మెచ్చి

వొగిడినా , రిదిగొ ! నిచటి 'వోగు దగిడి

గాళ్ళు' తామె బుధులవోలె, గ్రామ్యమనుచు

తెలుగు నుడులను నిరసింత్రు తులువ లగుచు .

3, జనవరి 2021, ఆదివారం

సద్దు సేయంగవద్దు .....

 



సద్దు సేయంగవద్దు విశ్వంబ నీవు,

సరసములదేలుచున్నారు, సరసజగతి

నేలు రాధికాకృష్ణులు, హృదయ

సీమలొక్కటిగ, రసానుగామినులయి .

2, జనవరి 2021, శనివారం

తీగకు తగుల్కొన్న సూరీడు

 


సాయంసంధ్యాసమయము ,

హాయిగ మా ఊరిలోని అభవునిగుడిలో ,

తీయగ ఫోటో , ఇదిగో !

తోయజమిత్రుండు తీగతో ముడివడియెన్ .