సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, జూన్ 2021, శుక్రవారం

చూడ రారండు , కళ్యాణ శోభనములు

 


నేడు మా కుల్లూరులో శ్రీదేవీభూదేవీ సమేత 

శ్రీఅచ్యుతప్ప తిరుకళ్యాణం .

------------------------------------

తిరువాభరణములు దీసి పక్కనబెట్టి

ఇమ్ముగా హరికి గోణమ్ము గట్టి

పన్నీట దడిసిన పచ్చడమ్ములు దెచ్చి

లలితంపు రొమ్ము తల మొలజుట్టి

తుమ్మెదమైచాయ దొడరు నచ్యుతునికి

శిరసాది పచ్చ కప్పురము నలది

కన మల్లె పూవల్లె కన్నుల కింపైన

స్వామికి పునుగు జవ్వాది పట్టి


శుక్రవారాన , నేడు , అచ్యుతుని , పెండ్లి

కొడుకుగా గయిసేసిరి , నడిచి వచ్చె

వేదికకు , ముద్దుసతులతో , వేడ్క మీర

చూడ రారండు , కళ్యాణ శోభనములు .

2 కామెంట్‌లు:

  1. చూడగా రండు అంటే కూడా బాగానే ఉంటుంది. పద్యం సొంపుగా కుదిరింది. దేశిఛందస్సులలో వీలైనంతవరకు యతిమైత్రిస్థానంలో కొత్థపదం మొదలుకావటం చక్కగా శోభిస్తుంది. కాని ఆది నియమంగా పాటించటం ఒకింత కష్టమేను. పద్యఛందస్సులలో విసంధిగా వ్రాయటం సంప్రదాయం కాదు కాబట్టి నేడె యచ్యుతుని పెండ్లి అనవచ్చును. కాని నవ్యతకోసం కావాలని విసంధిగా వ్రాసారేమో తెలియదు. ఇకపోతే సంప్రదాయకవిత్వంలో విరామచిహ్నాలను వాడటం కూడా సంప్రదాయం కాదు కానీ ఈమధ్యకాలంలో చాలామంది విరామచిహ్నసంయుతంగానే వ్రాస్తున్నారు. నాకు పెద్దగా అభ్యంతరం లేదు కాని నేనైతే అలా వాడుక చేయను. ఫలితంగా ఒకరు నాపద్యం ఒకదానిలో అస్థానపతితంగా విరామచిహ్నాలు పెట్టి ఆపద్యాన్ని చివరకు తప్పు అర్ధం వచ్చేలా చేసారు. ఔరా అనుకోవటం తప్ప ఏంచేసేది. ఈసోదికేం కాని పద్యం బాగుందని చెప్పటం నాఉద్దేశం.

    రిప్లయితొలగించండి