సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, ఏప్రిల్ 2024, గురువారం

నీల మోహనుడు

 


చిన్నప్పటి కన్నయ్యను ,

కన్నప్పుడు యెంత ముద్దుగారేనో , హా !

పన్నుగ యౌవన శ్యాముడు ,

కన్నుల కపురూప , అందగాడనిపించెన్ .


ఎన్నంగా మధ్యవయసు

నున్నప్పుడు , రాజనీతినోమి , చతురుడై

యెన్నని పార్శ్యాలు , హరివి ,

సన్నుత పరమాత్మయే , విశాల జగతికిన్ .

8, ఏప్రిల్ 2024, సోమవారం

క్రోధి

 


క్రోధ ముపసంహరించి , పరోపకార

సంయమము బూని , ధరణిపై సకల ప్రాణి

మేలు దలచుము , కరుణతో , కాల పురుష !

నే డుగాదిని నిన్ను నే వేడు 🙏 కొందు .

30, జనవరి 2024, మంగళవారం

గీతా ప్రశంశ



భగవానువాచగా , హరి
భగవానుడు , నుడివినట్టి , భగవద్ గీతా
నిగమము , పఠించి , గురుముఖ
ముగ దెలిసిన లేశమైన , ముక్తుల జేయున్ .

గీతా ప్రశంశ

 


పదపడి పసిడికి , మణులను

పొదిగిన విధమున , పదములు ,భువన మనోఙ్ఞా !

గదిసి , ప్రతి శ్లోక మొక , ని

గధిత మణి మనోఙ్ఞహార కధనంబు గదే !

గీతా ప్రశంశ

 

ఏమా సంస్కృత పద బం

ధామృత రసధుని ? ముకుంద ! తర్జుమ సేయన్

ధీమంబగు భాష గనము

భూమిని సంస్కృతము దప్ప , పుణ్య గురువరా !

గీతా ప్రశంశ

 


శ్రుతి పేయ , మధుర శబ్దము ,

లతి లలిత , శుభగ , మనోఙ్ఞమయి , సంగీతా

మృతము కురిపించె , వంశీ

జతయై , గీతా స్రవంతి , సంగీత ప్రియా !

గీతా ప్రశంశ

 


వినునతడు , చెప్పు నతడును

ఘను లయితే గాని , గీత , కాదు గ్రహింపన్

విను మిద్దరు, తమ వలె , భా

షను , యుద్దండులుగ , కృష్ణ ! సాధించ వలెన్ .

22, జనవరి 2024, సోమవారం

కన్నులానంద ....

 

కన్ను లానంద భాష్పముల్ గ్రమ్మె , నీదు

దివ్యమంగళ మూర్తి దేదీప్యమాన

మయి గనంగ , రామా ! కమల దళాక్ష !

జన్మ ధన్యత గాంచెను , జన జగతికి .

అయోధ్యలో రామప్రతిష్ట సమయం

 


అదిగో ! అయోధ్య రాముడు ,

గది‌సి మందిరములో  , సుఖాసీనుడవన్

ముదితంబగు సమయము , స

మ్ముదితం సయ్యెన్ , నమోస్తు 🙏 మోహన రామా !

నేడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట

 

రాముని యవతారము  , ఈ

భూమికి రక్షా కవచము ,  పూని వెలిసె , సం

క్షేమము లొసగగ , భారత

భూమి , నయోధ్యను ,  పున్నెపు ప్రోవై .





20, జనవరి 2024, శనివారం

ఖర్మ సరిలేదో ! ఇంతే !


 క్రిందన నీళ్ళున్నవి కడు ,

స్పందించుచు చెట్టుమధ్య భానుండుండెన్ ,

ఎందుకు మ్రోడయె భూజము ?!

ఎందున ఖర్మ సరిలేదొ , ఇటు తగులవడున్ .

బాలరాముని ముగ్ధమోహనరూపం

 


ఐదేళ్ళప్పటి రాముని ,

మోదపు చిరునవ్వురూపు , మోహనమై , ఆ

పాద శిఖము , జనముల కా

మోదంబై నిలిచె , నెంత ముగ్ధత్వంబో !

కుల్లూరు పోలేరుతల్లి ఆలయం


 పూని , పట్టు బట్టి  , నేను సంకల్పించి 
ఊరి జనము నంత , నొకటి జేసి
కోరి కట్టి నట్టి  ' కుల్లూరి పోలేరు
తల్లి '  ఆలయమ్ము   తనరె నిదిగొ !