సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, ఆగస్టు 2016, శుక్రవారం

మాతృదేవోభవ

గర్భస్థ శిశువు తా కాళ్ళతో తన్నంగ
నొప్పిని ప్రియముగా నోర్చుకొనును
అలికిడి కులికి తా నమ్మ పొత్తిళ్లలో
నొదుగంగ గుండెల కదుము కొనును
ఆకటి కేడ్చుచు అమ్మపై కెగబ్రాక
మురిపాన చన్నిచ్చి పరవశించు
బుడి బుడి యడుగుల పడిలేచి నడయాడ
బుడుతకు కేలిచ్చి నడత నేర్పు

అలుపెరుంగక రాత్రింబవలు భరించి
బిడ్డలే లోకముగ జీవించు" అమ్మ " _
బిడ్డపై అమ్మ కెంతటి ప్రేమ గలదొ ,
బిడ్డలకు గూడ అంతటి ప్రేమ గలద ?

తనువిచ్చి కన్నట్టి తల్లిని కాదని
రాతి బొమ్మకు మ్రొక్కు ఖ్యాతి మనది
చన్నిచ్చి కడుపార చాకిన తల్లికి
వెన్నిచ్చి వదిలించు విద్య మనది
తొలి యొజ్జయి  యెరుక దెలిపిన తల్లిని
మోస పుచ్చెడు గొప్ప బుధ్ధి మనది
సంతానమే తన సర్వస్వ మను తల్లి
తమకు భారమ్మను తలపు మనది

బిడ్డలకు  వాండ్ల పెండ్లాలు బిడ్డలకును
ఊడిగము చేసి  యోపిక లూడి కూడ
బ్రతికినన్నాళ్ళు చాకిరీ బ్రతుకు బ్రతుకు
తల్లి కాదరణ కరువు ధరణి మీద  .

వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి
పూని చాకిరి చేయలేని నాడు
బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు
చేరి సహాయము కోరు నాడు
ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు
వైద్యావసరము కావలయునాడు
మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో
కలగుండు పడు కష్ట మొలుకు నాడు

అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి
కాచి కడతేర్చు బిడ్డలు గలర ?  అంత
గాక పోయిన బాధ్యతగా దలంచి
జాలి చూపించ గలర ?  కాస్తంత యైన

" మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర
ఋణము తీరదు  _  ముదిమి పైకొనిన నాడు
కాచి కడతేర్చ   తీరు  _   నీ ఘనత  మరచి 
ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?

1, ఆగస్టు 2016, సోమవారం

తనువిచ్చి కన్నట్టి తల్లిని కాదని .....

తనువిచ్చి కన్నట్టి తల్లిని కాదని
రాతి బొమ్మకు మ్రొక్కు ఖ్యాతి మనది
చన్నిచ్చి కడుపార చాకిన తల్లికి
వెన్నిచ్చి వదిలించు విద్య మనది
తొలి యొజ్జయి  యెరుక దెలిపిన తల్లిని
మోస పుచ్చెడు గొప్ప బుధ్ధి మనది
సంతానమే తన సర్వస్వ మను తల్లి
తమకు భారమ్మను తలపు మనది

బిడ్డలకు  వాండ్ల పెండ్లాలు బిడ్డలకును
ఊడిగము చేసి  యోపిక లూడి కూడ
బ్రతికినన్నాళ్ళు చాకిరీ బ్రతుకు బ్రతుకు
తల్లి కాదరణ కరువు ధరణి మీద  .

31, జులై 2016, ఆదివారం

ఘనుడు ?

అవలీలగా నసత్యాలు పలుకుచును
వెరపేమి లేని యా వెధవ ఘనుడు
పిల్లికి నెల్కయై ప్రియ భాషణమ్ముల
వెధవకు తోడ్పడు వెధవ ఘనుడు
తప్పులే వెదుకుచు తనతప్పు లెరుగమి
విర్ర వీగెడు నా వెర్రి ఘనుడు
పరగ భక్త్యావేశ ప్రవచనాల్ పలుకుచు
చేయకూడని పని చేయ ఘనుడు

ఘను డహంకార పూరిత ఘనత గల్గి
చదువు గలదంచు నీలుగు చవట  , ఘనుడు
కష్టమెరుగక మోసపు కతలు జెప్పి
కష్టజీవుల కష్టాన్ని కరచు వెధవ  .

కళ్ళుగిరి తరు ఝరీ పరీత ప్రకృతిమయ మయి ,
కడు మనోఙ్ఞమై సూర్య సంకాశ మైన       
“ పుడమి  యందాలు వీక్షించు పుణ్య మరసి
మనకు “ కన్నుల “ నొసగెను మాధవుండు

సకల జగతిని వీక్షించు శక్తి గలిగి
చూచి గుర్తించు ఙ్ఞాన విస్ఫూర్తి గలిగి
తనర ప్రాణుల కానంద దాయకమయి
గ్రాలు – సర్వేంద్రియ ప్రధానాలు – “ కళ్ళు 

పుట్టు గ్రుడ్డులే గాక , యీ పుడమి మీద
పలు ప్రమాదాలు రోగాల బడుట వలన
“ కళ్లు ”  గోల్పోయి “ అంధులై “ గనలు వారు
కటిక చీకటిన్ బ్రతుకుట గాంచి కూడ ....

మార్గ ముండియు   చైతన్య  మబ్బకునికి
మరణ శయ్యకు జేరిన మనుజ వరుల
“ కళ్ళు మరణించు చున్నవి  గాని ,   పూని
“ నేత్ర దానమ్ము జేసిన     నిలుచును గద !

మనిషి మరణించినను   కళ్ళు బ్రతికి     మరొక
మనుజునకు   చూపొసగి    అట్టి మనిషి వలన
“ మరల లోకాన్ని గనును  ,  “ సమ్మతి “ యొసంగ ,
మానవత్వము వెల్లువై మహి వెలుగును .

ముందు చూపున్న మనుజులు పుణ్య ఫలము
నమ్మి  నేత్ర దానమ్మియ్య సమ్మతించి  ,
అంధులకు చూపు నొసగుదు  రమరు లయ్యు ,
మృతులు జీవింతు రీ భూమి మీద మరల .