సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, నవంబర్ 2017, శనివారం

మన తెలుగు వర్థిల్లాలి .

పద్యమైన , వచనమైన పాఠకులకు
అర్థ మవని యెడల పరమార్థమేమి ?
పండితుల కిది ఫేషనా ? బాగు , బాగు !!
వారి దారులు వారివి వదులుకోరు .

పదిమందికి తెలిసిన తగు
పదజాలము పద్యమందు వాడి , సరసమౌ
విధమున పద్యము వ్రాయుట
కుదరని వారెందుకయ్య గొప్పలువోవన్ ?

పద్యములు వ్రాసి , అందులో పదము , లాంధ్ర
భారతిలో జూపి , సూచన వ్రాయు ఖర్మ
తెలుగు భాషకు పట్టెను , ధీ మతు లట !!
డిక్ష్ణరీల భాష లిట పాటింతు రకట !

వాడుకన లేని , తెలియని పదము వాడి
గొప్పఘా ఫీలగుట మన కోవిదులకు
గొప్ప గాబోలు ! నిదియేమి గొప్ప బాబు !
మూగ-చెవిటి వారి విధము ముచ్చట గద !

ప్రజల నోళ్ళయందు పరిఢ విల్లిన భాష
శాశ్వితముగ బ్రతుకు విశ్వమందు ,
పేరు గొప్ప కొఱకు  పిడికెడు పండితుల్
వాడు భాష మనదు  ,  వాస్తవ మిది .

10, నవంబర్ 2017, శుక్రవారం

పొద్దు వాటాలె .....

ఏ వ్రేలు పట్టి తా నిలను నడిపించెనో
ఆ వ్రేలు తన కూత మగునొ లేదొ
ఏ బాల్యమునకు తా నింత ఙ్ఞాన మిడెనొ
ఆబాల్య మండయై ఆదు కొనున
ఏ తీగె సాగుట కెండు కట్టెయి నిల్చి
పెంచిన పొదరిల్లు ప్రియ మొసగున
కౌలు రైతిట వచ్చి  నిలువు కట్టెకు నీడ
నొనర నిచ్చున  పెద్ద మనసు గదుర

షష్టి సప్తతియు నశీతి చని  సహస్ర
పున్నములు జూచె నీ వృధ్ధ మూర్తి , యితని
సాదుకుందురొ లేదొ , ఈ స్వాదు ఫలము
రాలు నందాక బిడ్డలు మేలు దలచి .

9, నవంబర్ 2017, గురువారం

కందాక్రందనము .....

జొట జొట కన్నీ రొలుకగ
కట కటబడి కందబాల కళదప్పి కడున్
అట మటముల నిటుల వలికె
కట కట డగ్గుత్తిక వడ కలలో నాతో .

అన్నా ! నీ వెరుగవె ! నే
నన్నిట సుకుమారినిగద ! నన్నొక బామ్మా
తన్నిన తన్నులు తన్నక
తన్నుచు నున్నది పదాల తాడనములతో .

మీ నెల్లూరున తిక్కన ,
మానుగ వేమన్న - కడప మారాజు  ననున్
మేనెల్ల హేమ పరిమళ
మానితముగ దీర్చినారు , మన్నన గలిగెన్ .

ఛిన్నా భిన్నం బైతిని
నిన్నటి విభవంబు వోయె , నే డిట్టుల సం
ఖిన్న వదన రదన మహా
పన్న విరూప విపరీత ప్రకృతిన్ బడితిన్ .

నరసన్న , భాస్కరన్నలు ,
మరియును మన బండిరావు మాన్యులు , మీరున్
కరుణింతు రనుచు బొగిలితి ,
పర పీడన నుండి నన్ను  బైట బడేయన్ .

                             .....jk......